SS Rajamouli: ‘గిరిజ..సాయి పల్లవిలా..’: ప్రేమలు హీరోయిన్‍పై రాజమౌళి ప్రశంసలు-premalu actress mamitha baiju will be the next heart throb like sai pallavi says rrr director ss rajamouli ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ss Rajamouli: ‘గిరిజ..సాయి పల్లవిలా..’: ప్రేమలు హీరోయిన్‍పై రాజమౌళి ప్రశంసలు

SS Rajamouli: ‘గిరిజ..సాయి పల్లవిలా..’: ప్రేమలు హీరోయిన్‍పై రాజమౌళి ప్రశంసలు

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 12, 2024 10:12 PM IST

SS Rajamouli on Mamitha Baiju: ప్రేమలు సినిమా హీరోయిన్‍ మమితా బైజూపై దర్శక ధీరుడు రాజమౌళి ప్రశంసలు కురిపించారు. ట్రైలర్ చూడగానే ఆమె తనకు చాలా నచ్చారని అన్నారు. అందరి హృదయాలను ఆమె గెలుస్తారని చెప్పారు.

SS Rajamouli: ‘గిరిజ..సాయి పల్లవిలా..’: ప్రేమలు హీరోయిన్‍పై రాజమౌళి ప్రశంసలు
SS Rajamouli: ‘గిరిజ..సాయి పల్లవిలా..’: ప్రేమలు హీరోయిన్‍పై రాజమౌళి ప్రశంసలు

SS Rajamouli: మలయాళంలో సూపర్ హిట్ అయిన ప్రేమలు చిత్రం తెలుగులోనూ మంచి కలెక్షన్లు దక్కించుకుంటోంది. ఈ రొమాంటిక్ కామెడీ సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు కార్తికేయ. తెలుగులో ఈ మూవీల మార్చి 8వ తేదీన రిలీజ్ అయింది. తెలుగులోనూ ప్రేమలు చిత్రానికి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. పాజిటివ్ మౌత్ టాక్ రావటంతో తొలి రోజు కంటే నాలుగో రోజు ఈ సినిమాకు ఎక్కువ వసూళ్లు వచ్చాయి. దీంతో ప్రేమలు తెలుగు టీమ్ నేడు (మార్చి 12) హైదరాబాద్‍లో సక్సెస్ ఈవెంట్ నిర్వహించింది.

ప్రేమలు తెలుగు సక్సెస్ మీట్‍కు స్టార్ డైరెక్టర్ రాజమౌళి అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మూవీ టీమ్‍ను అభినందించారు. ప్రేమలు సినిమాలో హీరోయిన్‍గా నటించిన మమితా బైజూను రాజమౌళి ప్రశంసించారు. గీతాంజలి (1989) సినిమాలో గిరిజ, ఆ తర్వాత సాయిపల్లవి చూపించిన ఎఫెక్ట్‌కు మమితా కూడా చూపిస్తారని తాను అనుకుంటున్నట్టు రాజమౌళి అన్నారు.

మమితా బైజూ ఎనర్జీ చూస్తే అందరి హృదయాలను ఆమె గెలువబోతోందని తనకు అనిపించిందని రాజమౌళి చెప్పారు. “ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు నాకు మమితా చాలా నచ్చింది. ఆమెనే తర్వాత అందరి హృదయాలను మెలిపెడుతుందని అనిపించింది. గీతాంజలి సినిమాలో గిరిజ వచ్చినట్టు.. ఆ తర్వాత సాయిపల్లవి వచ్చినట్టు. వాళ్లు ఎలాంటి ఎలాంటి ఎఫెక్ట్ క్రియేట్ చేశారో మమితాకు కూడా అలాగే చేసే సామర్థ్యం ఉంది. ఇప్పటికే ఈమెపై మీరు ప్రేమ కురిపిచడం నేను చూస్తున్నా” అని రాజమౌళి చెప్పారు.

1989లో నాగార్జున హీరోగా నటించిన గీతాంజలి చిత్రంలో గిరిజ హీరోయిన్‍గా చేశారు. ఆ సినిమాతో చాలా ఫేమస్ అయ్యారు. ఇక, మలయాళ మూవీ ప్రేమమ్ (2015)తో సాయిపల్లవి దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. తెలుగు మూవీ ఫిదా (2017)తో స్టార్ హీరోయిన్ అయ్యారు. అందం, అభినయం, డ్యాన్స్, ఎనర్జీ, సింప్లిసిటీతో అందరినీ మెప్పిస్తున్నారు. సాయి పల్లవి నటించిన కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ స్థాయిలో సాయిపల్లవి ఉన్నారు. ఆమెకు చాలా అభిమానగణం ఉంది. లేడీ పవర్ స్టార్ అనే పేరు తెచ్చుకున్నారు. సాయిపల్లవి ఉంటే సినిమా కచ్చితంగా బాగుంటుందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో నిలిచిపోయింది. సాయిపల్లవిలా మమితా బైజూ కూడా అందరి హృదయాలను గెలుచుకుంటారని రాజమౌళి అభిప్రాయపడ్డారు.

90s దర్శకుడిపై రాజమౌళి ప్రశంసలు

ప్రేమలు తెలుగు వెర్షన్‍కు 90s వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ డైలాగ్స్ రాశారు. ఈ చిత్రం చూసేంత నవ్వుతూనే ఉంటామని, ఈ క్రెడిట్ డైలాగ్స్ రాసిన వారికి దక్కుతుందని రాజమౌళి చెప్పారు. తెలుగులో ఆదిత్య హాసన్ డైలాగ్స్ ఇరగదీశారని ఆయన ప్రశంసించారు. మీమ్‍లను బలవంతంగా కాకుండా అర్థవంతంగా డైలాగ్‍లో పెట్టారని ప్రశంసించారు.

గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించిన ప్రేమలు సినిమాలో నెస్లేన్ గఫూర్, మిమితా బైజూ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 9న మలయాళం రిలీజ్ కాగా.. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల కలెక్షన్లను దక్కించుకుంది. మార్చి 8న ఈ మూవీ తెలుగులో రిలీజ్ అయింది. తెలుగు వెర్షన్ ఇప్పటికే రూ.3కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. తెలుగులో రోజురోజుకూ కలెక్షన్లు పెరుగుతున్నాయి.

ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ హిట్ సాధించిన ఎస్ఎస్ రాజమౌళి.. తదుపరి సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా (SSMB29) చేయనున్నారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ మొదలుకానుంది.