Manjummel Boys vs Premalu: రూ.150 కోట్ల మార్క్ దాటిన మంజుమెల్ బాయ్స్.. ఆ క్లబ్‍లోకి ప్రేమలు: వివరాలివే
Manjummel Boys vs Premalu Collections: మలయాళ సినిమాలు మంజుమెల్ బాయ్స్, ప్రేమలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్నాయి. కలెక్షన్ల హోరు కొనసాగిస్తున్నాయి. తాజాగా ముఖ్యమైన మైలురాళ్లు దాటాయి ఈ చిత్రాలు. ఆ వివరాలు ఇవే.
Manjummel Boys vs Premalu: మంజుమెల్ బాయ్స్, ప్రేమలు సినిమాలు సెన్సేషనల్ హిట్ దిశగా దూసుకెళుతున్నాయి. రికార్డులను సృష్టిస్తున్నాయి. తక్కువ బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ రెండు సినిమాలు భారీ వసూళ్లు సాధిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఫిబ్రవరి 9న మలయాళం విడుదలైన ప్రేమలు ఇంకా వసూళ్లలో జోరు చూపిస్తోంది. ఫిబ్రవరి 22న విడుదలైన మంజుమెల్ బాయ్స్ దూకుడు చూపిస్తూ రికార్డుస్థాయి వసూళ్లతో దూసుకెళుతోంది. ఈ రెండు చిత్రాలు ఇప్పటి వరకు ఎంత కలెక్షన్లు రాబట్టాయంటే..
రూ.150 కోట్లు దాటిన మంజుమెల్ బాయ్స్
సర్వైవల్ థ్రిల్లర్ మంజుమెల్ బాయ్స్ సినిమా భారీ వసూళ్లతో సత్తాచాటుతోంది. 18 రోజుల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. దీంతో, అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో మలయాళ మూవీగా దూసుకొచ్చింది. లూసిఫర్, పులిమురుగన్ చిత్రాలను దాటేసింది. ప్రస్తుతం మలయాళ సినీ ఇండస్ట్రీలో టాప్ గ్రాసర్‌గా 2018 మూవీ (రూ.175కోట్లు) ఉంది. దీన్ని కూడా ముంజుమెల్ బాయ్స్ మూవీ దాటే అవకాశాలు ఉన్నాయి.
మలయాళం సినీ ఇండస్ట్రీలో టాప్ గ్రాసర్‌గా మంజుమెల్ బాయ్స్ నిలువడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి కేరళలో సుమారు రూ.53 కోట్లు వచ్చాయి. తమిళనాడులోనే ఈ మలయాళం చిత్రం ఏకంగా రూ.40 కోట్ల వసూళ్లు రాబట్టింది. కర్ణాటకలోనూ రూ.10కోట్ల మార్కుకు అత్యంత సమీపంలో ఉంది. ఓవర్సీస్‍లోనూ రూ.46 కోట్లను ఈ చిత్రం సాధించింది.
మంజుమెల్ బాయ్స్ చిత్రానికి చిదంబరం దర్శకత్వం వహించారు. సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసీ, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొడువల్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్, అరుణ్ కురియన్ ప్రదాన పాత్రలు పోషించారు. ఈ మూవీకి సుషిన్ శ్యామ్ సంగీతం అందించారు.
రూ.100 కోట్ల క్లబ్‍లో ప్రేమలు
లవ్ కామెడీ రొమాంటిక్ సినిమా ప్రేమలు కూడా సంచలన కలెక్షన్లతో దూసుకెళుతోంది. కేవలం రూ.4 కోట్లలోపు బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ దుమ్మురేపుతోంది. గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నెస్లెన్ కే గఫూర్, మమితా బైజూ హీరోహీరోయిన్లుగా నటించారు. 31 రోజుల్లో ప్రేమలు సినిమా రూ.100 కోట్ల క్లబ్‍లోకి అడుగుపెట్టింది. కేరళలో రూ.53 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ మూవీ.. విదేశాల్లో రూ.37 కోట్ల కలెక్షను దక్కించుకుంది. మిగిలిన చోట్ల కూడా దుమ్మురేపుతోంది.
తెలుగు వెర్షన్ దూకుడు
ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్ కూడా మంచి వసూళ్లను సాధిస్తోంది. తెలుగులో మార్చి 8న ఈ చిత్రం రిలీజైంది. ఇప్పటి వరకు తెలుగు వెర్షన్ రూ.2కోట్లను దక్కించుకుంది. ఇప్పటికే తెలుగులోనూ లాభాల్లోకి ఈ మూవీ అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు కార్తికేయ. తెలుగులోనూ ప్రేమలుకు భారీ రెస్పాన్స్ వస్తోంది. క్రమంగా వసూళ్లు పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ బ్యాక్‍డ్రాప్‍లోనే ఈ చిత్రం రూపొందింది. లవ్ స్టోరీ, కామెడీ ఈ చిత్రంలో ఆకట్టుకుంటున్నాయి.