The Raja Saab Song: రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేస్తోంది! హింట్ ఇచ్చిన డైరెక్టర్ మారుతీ
The Raja Saab First Song: ‘ది రాజాసాబ్’ సినిమా అప్‍డేట్ల కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. అయితే, ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ త్వరలో రానుందనేలా ఓ హింట్ వచ్చింది.
The Raja Saab Song: రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ విడుదల కావాల్సి ఉంది. ఈ భారీ బడ్జెట్ గ్లోబల్ రేంజ్ చిత్రం మే 9న వస్తుందని గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే, ఎన్నికల కారణంగా వాయిదా పడక తప్పదు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ రానుంది. అయితే, డైరెక్టర్ మారుతీతో ‘ది రాజాసాబ్’ సినిమా కూడా చేస్తున్నారు ప్రభాస్. ఇప్పటికే ఈ మూవీ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రాగా.. అప్‍డేట్ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఈ సినిమా నుంచి ఫస్ట్ పాట గురించి మారుతీ ఓ హింట్ వదిలారు.
ఎస్‍కేఎన్ ట్వీట్.. రిప్లై ఇచ్చి మారుతీ
బేబి మూవీ నిర్మాత ఎస్‍కేఎన్ నేడు (ఏప్రిల్ 16) ఓ ట్వీట్ చేశారు. పాట అదిరిపోయిందనేలా సింబల్స్, ఎమోజీలను పోస్ట్ చేశారు. అయితే, ఏ మూవీనో పేర్కొనలేదు. అయితే, ఈ ట్వీట్‍కు రాజాసాబ్ డైరెక్టర్ మారుతీ రెస్పాండ్ అయ్యారు. స్మైలీ సింబల్‍తో రిప్లై ఇచ్చారు. దీంతో.. ఇది రాజాసాబ్ మొదటి పాట గురించే అని అర్థమవుతోంది. దీంతో త్వరలోనే ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ది రాజాసాబ్ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ వీడియోకు ఆయన ఇచ్చిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ మెప్పించింది. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు.
జోరుగా షూటింగ్
ది రాజాసాబ్ మూవీని కామెడీ హారర్ థ్రిల్లర్‌గా మారుతీ తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ మూవీలో వీఎఫ్‍ఎక్స్ కూడా భారీగా ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీలో ప్రభాస్‍కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిధి కుమార్, జుషు సెంగుప్త, యోగిబాబు, వరలక్ష్మి శరత్‍కుమార్, బ్రహ్మానందం కీలకపాత్రలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ది రాజా సాబ్ చిత్రం నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరిలో వచ్చింది. ఈ మూవీ గురించి నెలకు ఓ అప్‍డేట్ ఇస్తానని డైరెక్టర్ మారుతీ అప్పట్లో చెప్పారు. ఈ విషయంపై ఆయనపై ఒత్తిడి వచ్చింది. అయితే, ప్రభాస్ నటించిన కల్కి చిత్రం రిలీజ్ కావాల్సి ఉందని.. అందుకే ఆ మూవీ వచ్చిన తర్వాతే రాజాసాబ్ అప్‍డేట్లు ఇవ్వాలని అనుకుంటున్నామని కొన్నాళ్లకు చెప్పారు. ఈ మూవీ అద్భుతంగా ఉంటుందని డార్లింగ్ అభిమానులకు భరోసా ఇస్తూ వస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి ప్లాన్ చేసే అవకాశం ఉందని టాక్.
ది రాజాసాబ్ మూవీ తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీ చేయనున్నారు ప్రభాస్. అలాగే, సలార్ సీక్వెల్ సలార్ పార్ట్-2 కూడా లైనప్‍లో ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే షురూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. హను రాఘవపూడితోనూ మరో మూవీకి ప్రభాస్ ఓకే చెప్పారని తెలుస్తోంది.
కల్కి 2898 ఏడీ సినిమా జూన్ లేదా జూలైలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. కొత్త రిలీజ్ డేట్‍ను అతిత్వరలోనే మేకర్స్ ప్రకటించనునున్నారు.