Kali Teaser: కల్కి విలన్ కలి పాత్రతో మైథాలజీ సైకలాజికల్ థ్రిల్లర్.. టీజర్ వదిలిన నాగ్ అశ్విన్
Kalki 2898 AD Director Nag Ashwin Released Kali Teaser: కల్కి 2898 ఏడీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కలి మూవీ టీజర్‌ను విడుదల చేశారు. విష్ణు అవతారాల్లో ఒకటైన కల్కికి విలన్ అయిన కలి పాత్రతో సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్‌లో ఈ సినిమా రానుంది.
Nag Ashwin Launched Kali Movie Teaser: ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమా దుమ్ములేపుతోంది. ఇందులో కలి అనే కలియుగ రాక్షసుడిని చంపేందుకు పుట్టబోయే కల్కి అవతారం నేపథ్యంతో సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇక పురాణాల్లో చూసుకుంటే విష్ణు అవతారాల్లో ఒకటైన కల్కి భగవానుడికి విలన్‌గా రాక్షసుడు కలి ఉంటాడు.
అలాంటి కలి పాత్రతో మైథాలజీ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీగా వస్తోంది కలి సినిమా. యంగ్ హీరోలు ప్రిన్స్ సిసిల్, నరేష్ అగస్త్య నటిస్తున్న ఈ కలి చిత్రాన్ని ప్రముఖ కథా రచయిత కె. రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో రుద్ర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీకి శివ శేషు దర్శకత్వం వహించారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ ఇటీవల పూర్తి అయింది.
త్వరలో కలి సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా కలి టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ కలి టీజర్‌ను కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ విడుదల చేయడం విశేషంగా మారింది. కలి మూవీ టీజర్ ఇంట్రెస్టింగ్‌గా ఉండి ఆకట్టుకుందని, ఒక కొత్త కాన్సెప్ట్‌ను డైరెక్టర్ శివ శేషు తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నట్లు టీజర్‌తో తెలుస్తోందని ఆయన తెలిపారు.
కలి మూవీ టీమ్‌కు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ బెస్ట్ విశెస్ అందజేశారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు కె. రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ.. "ఈ రోజు కలి మూవీ టీజర్‌ను డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. కలి పాత్ర నేపథ్యంతో సాగే ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం" అని అన్నారు.
"నాగ్ అశ్విన్ గారు ఎంతో బిజీగా ఉన్నా మాకు టైమ్ ఇచ్చి కలి మూవీ టీజర్‌ను లాంఛ్ చేసినందుకు ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాం" అని నిర్మాత లీలా గౌతమ్ వర్మ తెలిపారు. "కలి సినిమాను ఓ సరికొత్త కథాంశంతో రూపొందించాం. మైథాలజీ, సైకలాజికల్ థ్రిల్లర్ జానర్స్ కలిపిన చిత్రమిది. కలి సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని ఆశిస్తున్నాం. త్వరలోనే గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్‌కు మూవీని తీసుకురాబోతున్నాం" అని డైరెక్టర్ శివ శేషు చెప్పుకొచ్చారు.
కలి మూవీ టీజర్ విషయానికొస్తే.. స్వార్థం నిండిన ఈ లోకంలో బతకలేక ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమవుతాడు శివరామ్ (ప్రిన్స్). ఉరి వేసుకునే సమయానికి అతని ఇంటికి ఓ అపరిచిత వ్యక్తి (నరేష్ అగస్త్య) వస్తాడు. శివరామ్ జీవితంలో జరిగిన విషయాలన్నీ ఆ వ్యక్తి చెబుతుంటాడు. తన జీవితంలో జరిగిన ఘటనలు ఆ అపరిచితుడికి ఎలా తెలిశాయని ఆశ్చర్యపోతాడు శివరామ్.
పెళ్లి చేసుకుని సంతోషంగా భార్యతో ఉన్న శివరామ్ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు?. అతని ఇంటికి వచ్చిన అపరిచితుడు ఎవరు?. అతనికి శివరామ్ జీవితంలో విషయాలన్నీ ఎలా తెలిశాయి?. కళ్లముందే శివరామ్ ఉంటే అతని పోలిక ఉన్న డెడ్ బాడీ ఎలా వచ్చింది? ఇలాంటి ఆసక్తికర అంశాలతో కలి టీజర్ క్యూరియాసిటీ క్రియేట్ చేసింది.