NNS May 23rd Episode: స్టైల్ మార్చిన మిస్సమ్మ- షాక్‌లో మనోహరి, పిల్లలు- కిందపడబోతున్న అమర్‌ను కాపాడిన భాగీ- నోటికి తాళం
Nindu Noorella Saavasam May 23rd Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మే 23వ తేది ఎపిసోడ్‌లో అరుంధతి చెప్పడంతో అమర్ ఇంటికి మిస్సమ్మ వెళ్తుంది. కానీ, పూర్తిగా స్టైల్ మార్చి ఏమాత్రం భయం లేకుండా అమర్‌తో మాట్లాడుతుంది. దాంతో అంతా షాక్ అవుతారు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 23rd May Episode) భాగీ సంసారం బాగుపడుతుందా? అని కోయదొరని అడుగుతాడు రామ్మూర్తి. మరికాసేపట్లో నీ కూతురే వచ్చి తన ఇంటికి వెళ్తానంటుంది అంటాడు కోయదొర రూపంలో ఉన్న గుప్త. అప్పుడే భాగీ వచ్చి.. నాన్నా.. నేను ఆ ఇంటికి వెళ్తాను అంటుంది. పలికించినది.. అమ్మ పలికించినది అంటాడు గుప్త.
కోటీశ్వరాలు అవడం ఎప్పుడు
అదేంటి పోరి.. ఇప్పటిదాకా వెళ్లనన్నావ్.. ఇప్పుడు వెళ్తానంటున్నావ్ అంటుంది మంగళ. అదేంటి పిన్ని.. వెళ్తానన్నా ప్రశ్నలే, వెళ్లను అన్నా ప్రశ్నలేనా అని అడుగుతుంది భాగీ. నువ్వు లగేజి సర్దుకోమ్మా.. నేను వెళ్లి ఆటో తీసుకొస్తానని రామ్మూర్తి బయటకు వెళ్లగానే ఇంట్లోకి వెళ్తుంది భాగీ. తను కోటీశ్వరురాలిని ఎప్పుడవుతాను అని కోయదొరను అడుగుతుంది మంగళ. బతికుండగా నువ్వు అనుకున్నది నెరవేరదు అంటాడు గుప్త.
మంగళతో గొడవకు దిగుతున్న గుప్తను ఆపుతుంది అరుంధతి. కోపంగా బట్టలు సర్ధుతున్న భాగీ దగ్గరకు వెళ్లి మాట్లాడుతుంది. మనోహరితో నెగ్గడం తన వల్లే కాలేదని ఆమెతో తలపడొద్దని చెబుతుంది. అదేంటి.. మీరెందుకు ఆమెతో గొడవపడ్డారు అని అడుగుతుంది భాగీ. ఓసారి గొడవైందిలే అని సర్దిచెబుతుంది అరుంధతి. భాగీ బట్టలు సర్దుతూ అరుంధతితో మాట్లాడటం మంగళ చూస్తుంది.
పోలిక కాదు పిచ్చి
అక్కడ ఎవరూ లేకపోయినా ఎవరితో మాట్లాడుతుంది అని ఆలోచిస్తుంది. వెంటనే రామ్మూర్తిని పిలిచి చూపిస్తుంది. తను కూడా చిన్నప్పుడు అలాగే తనలోతనే మాట్లాడుకునేవాడినని, తన కూతురుకి అన్నీ తన పోలికలే అంటాడు రామ్మూర్తి. అది పోలిక కాదు పిచ్చి అని, భాగీని పిలిచి ఎవరితో మాట్లాడుతున్నావ్ అంటుంది మంగళ. అక్కతో అంటుంది భాగీ. అలా ఎలా మాట్లాడావ్ అంటున్న మంగళతో నోటితో మాట్లాడాను.. ఏ మాట్లాడకూడదా? అంటూ అక్కడనుంచి వెళ్లిపోతుంది.
పక్కనే దాక్కుంటుంది అరుంధతి. నేనేంటి ఇన్నాళ్లు ఇద్దరు పిచ్చివాళ్లతో కలిసి బతుకుతున్నానా అనుకుంటుంది మంగళ. వెంటనే భాగీ అక్కడకు వచ్చేస్తుంది అని మనోహరికి కాల్ చేసి చెబుతుంది. ఆఫీసుకు బయల్దేరుతున్న అమర్ ముందు ఓ కారు స్పీడ్‌గా వచ్చి ఆగుతుంది. ఎవరది అని రాథోడ్ కోపంగా వెళ్లి అడుగుతాడు. అప్పుడే భాగీ స్టైల్‌గా కారు దిగుతుంది. మనోహరి కోపంతో తనతో గొడవపడేందుకు వెళ్లాలనుకుంటుంది.
స్టైల్ మార్చిన మిస్సమ్మ
కానీ, నీల సర్దిచెప్పి ఆపుతుంది. కారులో వచ్చింది ఎవరో చూద్దామని పిల్లలు, నిర్మల ఇంట్లోనుంచి బయటకు వస్తారు. స్టైల్ మార్చిన మిస్సమ్మను చూసి షాకవుతారు. క్యాబ్ డ్రైవర్‌కి డబ్బులు ఇమ్మని అమర్‌ని అడుగుతుంది మిస్సమ్మ. రాథోడ్.. అని అరుస్తాడు అమర్. క్యాబ్ డ్రైవర్ వెయ్యి రూపాయలు అయ్యిందని చెప్పడంతో రెండు వేలు ఇచ్చి పంపించు ఎక్కడనుంచి తెచ్చిన చెత్తను అక్కడే పడెయ్యమను అంటాడు.
అదేంటి మొగుడుగారు అలా మాట్లాడుతున్నారు అంటుంది మిస్సమ్మ. అసలు నీకు, ఈ ఇంటికి సంబంధం లేదని చెప్పా కదా.. అంటాడు అమర్. అదేంటండీ.. మీరు నా మొగుడు అంటుంది మిస్సమ్మ. ఇంకోసారి మొగుడు అన్నావంటే బాగోదు అంటున్న అమర్‌కి తన మెడలో మంగళ సూత్రం చూపించి ఇదేంటి? అని అడుగుతుంది. ఏ మాట్లాడాలో అర్థంకాక కోపంగా జీప్ ఎక్కాలని డోర్ తీయబోయి పడిపోబోతాడు అమర్.
షాక్‌లో పిల్లలు
కిందపడకుండా పట్టుకుంటుంది మిస్సమ్మ. కోపంగా లేచిన అమర్ నువ్వు ఇంట్లోకి వెళ్లడానికి వీల్లేదు అంటాడు. ఇది మన ఇల్లు అంటూ అక్కడే ఉన్న నిర్మల కాళ్లకి దండం పెట్టి పరుగుపరుగున లోపలకు వెళ్తుంది మిస్సమ్మ. అసలేమైంది మిస్సమ్మకి దయ్యం ఏమైనా పట్టిందా.. డాడీతో మాట్లాడటానికే భయపడే మిస్సమ్మ ఈ రోజు ఇలా మాట్లాడుతోంది అనుకుంటారు పిల్లలు.
జరిగినదంతా చూస్తూ మిస్సమ్మని ఈ ఇంటికి తీసుకురావడానికి నాలుగు మాటలు చెబితే ఇలా వచ్చి గొడవపడుతుందేంటి అనుకుంటుంది అరుంధతి. అమర్ భాగీని ఇంట్లో ఉండనిస్తాడా? మనోహరి నిజ స్వరూపం బయటపెట్టడానికి భాగీ ఏం చేయనుంది? అనే విషయాలు తెలియాలంటే మే 24న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!