Devara Tickets Booking: ఏపీలో మొదలైన దేవర సినిమా టికెట్ల బుకింగ్స్-jr ntr devara theatres tickets online bookings started in andhra pradesh ap ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Devara Tickets Booking: ఏపీలో మొదలైన దేవర సినిమా టికెట్ల బుకింగ్స్

Devara Tickets Booking: ఏపీలో మొదలైన దేవర సినిమా టికెట్ల బుకింగ్స్

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 23, 2024 05:29 PM IST

Devara Ticket Bookings: దేవర సినిమా టికెట్ల బుకింగ్స్ షురూ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్‍లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. వేగంగా టికెట్లు అమ్ముడవుతున్నాయి. ఆ వివరాలు ఇవే..

Devara Tickets: ఏపీలో మొదలైన దేవర సినిమా టికెట్ల బుకింగ్స్
Devara Tickets: ఏపీలో మొదలైన దేవర సినిమా టికెట్ల బుకింగ్స్

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర చిత్రం విడుదలకు సిద్ధమైంది. మరో నాలుగు రోజుల్లో సెప్టెంబర్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. బాక్సాఫీస్ వేట మొదలుపెట్టనుంది. ప్రీ-రిలీజ్ ఈవెంట్ రద్దవటంతో ఫ్యాన్స్ కాస్త నిరాశగా ఉన్నారు. అయితే, భారీ అంచనాలు ఉన్న ఈ మూవీ టికెట్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయా అని నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో నేడు (సెప్టెంబర్ 23) ఆంధ్రప్రదేశ్‍లో బుకింగ్స్ షురూ అయ్యాయి.

ఫుల్ జోష్‍గా బుకింగ్స్

ఆంధ్రప్రదేశ్‍లోని థియేటర్లలో దేవర సినిమా కోసం టికెట్ల బుకింగ్స్ ఆన్‍లైన్‍లో నేడు షురూ అయ్యాయి. బుకింగ్స్ ఓపెన్ అయిన థియేటర్లలో టికెట్లు వేగంగా అమ్ముడవుతున్నాయి. బుకింగ్‍ల్లో జోష్ కనిపిస్తోంది. కొన్ని షోలు అప్పుడే సోల్డౌట్ అయిపోయాయి. క్రమంగా థియేటర్లు, షోలు యాడ్ అవుతున్నాయి.

దేవర చిత్రానికి టికెట్ ధరల పెంపునకు, అదనపు షోలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. జీవో కూడా జారీ చేసింది. దీంతో ఏపీలో టికెట్లను మూవీ టీమ్ షురూ చేసింది. పెంచిన ధరలతోనే టికెట్స్ అందుబాటులోకి వచ్చాయి. రెండు వారాలు అదనపు రేట్లు ఉంటాయి. ఏపీలో దేవర చిత్రం తొలి రోజు సెప్టెంబర్ 27న ఆరు షోలకు గ్రీన్‍సిగ్నల్ వచ్చింది. దీంతో ఫస్ట్ డే అర్ధరాత్రి షో కూడా ఉండనుంది. ఆ తర్వాత తొమ్మిది రోజులు ఐదు షోలకు అనుమతి లభించింది.

తెలంగాణలో జీవో కోసం నిరీక్షణ

టికెట్ ధరలు పెంచుకునేందుకు, అదనపు షోల కోసం తెలంగాణ ప్రభుత్వానికి కూడా దేవర మూవీ టీమ్ దరఖాస్తు చేసుకుంది. అయితే, ఇంకా అనుమతి లభించలేదు. ఈ విషయంపై జీవో జారీ కోసం నిరీక్షణ కొనసాగుతోంది. ఈ విషయంపై ప్రభుత్వం నుంచి జీవో వచ్చిన తర్వాత తెలంగాణలో టికెట్లు బుకింగ్స్ మొదలుకానున్నాయి. రేపు బుకింగ్స్ షురూ కావొచ్చనే అంచనాలు ఉన్నాయి. తెలంగాణలో అనుమతులను బట్టి ఏపీలో అర్ధరాత్రి షోపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో టికెట్ల కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ప్రీ-రిలీజ్ ఈవెంట్ రద్దు

దేవర సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఆదివారం (సెప్టెంబర్ 22) రద్దయింది. అభిమానులు భారీగా తరలిరావటంతో హైదరాబాద్ నోవాటెల్‍లో జరగాల్సిన ఈవెంట్ క్యాన్సల్ అయింది. ఇన్‍డోర్‌లో జరగాల్సిన ఈ ఈవెంట్‍కు పరిమితికి మంచి వేలాది మంది ఎక్కువగా వచ్చారు. దీంతో గందరగోళం ఏర్పడటంతో నిర్వాహకులు ప్రీ-రిలీజ్ ఈవెంట్ రద్దు చేశారు. అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అందరికీ సారీ చెబుతూ ఎన్టీఆర్ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. బియాండ్ ఫెస్ట్‌లో దేవర ప్రీమియర్ కోసం అమెరికాకు వెళ్లారు ఎన్టీఆర్.

దేవర చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. రిలీజ్‍కు ముందే ఆయన ప్రెస్‍మీట్ ఏర్పాటు చేసి మాట్లాడతారని సమాచారం. ఈ చిత్రం నుంచి వచ్చిన రెండు ట్రైలర్లు అదిరిపోయాయి. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్‍గా చేశారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు భారీ బడ్జెట్‍తో ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశాయి.