Devara Trailer: దేవర ట్రైలర్ వచ్చేసింది.. ఎన్టీఆర్ యాక్షన్ విశ్వరూపం.. అదిరిపోయిన విజువల్స్: చూసేయండి
Devara Trailer Released: దేవర సినిమా నుంచి ట్రైలర్ వచ్చేసింది. యాక్షన్ మోడ్‍లో ఎన్టీఆర్ విశ్వరూపం చూపించారు. విజువల్స్ స్టన్నింగ్‍గా ఉన్నాయి. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్‍తో అనిరుధ్ రవిచందర్ దుమ్మురేపారు.
నిరీక్షణ ముగిసింది. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న దేవర సినిమా ట్రైలర్ వచ్చేసింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ హైవోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంపై పాన్ ఇండియా రేంజ్‍లో బోలెడు అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 27వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్ కోసం సినీ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూశారు. ఆ ట్రైలర్ నేడు (సెప్టెంబర్ 10) రిలీజ్ అయింది.
దేవర ట్రైలర్లో మాస్ యాక్షన్‍తో ఎన్టీఆర్ విశ్వరూపం చూపించారు. హైవోల్జేజ్ సీక్వెన్సుల్లో అదరగొట్టారు. సముద్రం బ్యాక్‍డ్రాప్ విజువల్స్ వారెవా అనిపించేలా ఉన్నాయి. దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని కసితో తెరకెక్కించిన టేకింగ్ చూస్తే అర్థమవుతోంది. అనిరుధ్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఇంటెన్సిటీతో ఉంది.
ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా..
భైర (సైఫ్ అలీ ఖాన్), అతడి దళం సముద్రంలో ఓడలను దోచుకుంటూ.. అరాచకాలు చేసే సీన్‍తో దేవర ట్రైలర్ షురూ అయింది. భైర ఎంత ప్రమాదకరమో, అతడిని ఎవరు భయపెట్టారో చెబుతూ ప్రకాశ్ రాజ్ వాయిస్ ఓవర్ ఉంది. “కులం లేదు.. మతం లేదు.. భయం అసలే లేదు.. ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్లలో భయం పొరలు కమ్ముకున్నాయి” అనే డైలాగ్స్ ఉన్నాయి. “చాలా పెద్ద కథ.. రక్తంతో సంద్రంతో ఎరుపెక్కిన కథ.. మా దేవర కథ” అనే వాయిస్ ఓవర్ తర్వాత.. దేవర (ఎన్టీఆర్) భీకర యాక్షన్‍తో ఎంట్రీ ఉంది.
పిల్లతనం.. పిరికితనం
దేవర సినిమాలో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ చేస్తున్నారు. దేవర విశ్వరూపం చూపిస్తుంటే.. అతడి కుమారుడు వర అలియాజ్ వరద (ఎన్టీఆర్) భయస్తుడిగా ఉంటాడు. వరను తంగం (జాన్వీ కపూర్) ప్రేమిస్తుంటుంది. “ఎప్పుడు చూడు పిల్లతనం.. పిరికితనం.. వాడితో ఎట్టాగే” అని తంగం స్నేహితులు అంటారు.
రెండేళ్లయినా సముద్రంలోనే..
అయితే, సముద్రంలోకి వెళ్లి రెండేళ్లయినా దేవర తిరిగి రాలేదని ట్రైలర్లో అర్థమవుతోంది. సముద్రంపై తప్పుడు పని చేసే వాళ్ల పని పట్టే పనిలో దేవర ఉంటాడు. కనిపించకుండా అక్రమార్కులను మట్టుబెడుతుంటాడు. “ఈ రోజు నుంచి కానరాని భయం అవుతావుండా” అని దేవర అంటాడు. సొరచేపపై కూర్చొని సముద్రం నుంచి దేవర గాల్లోకి ఎగిరే అద్భుతమైన షాట్‍తో దైవర ట్రైలర్ ముగిసింది.
ఈ ట్రైలర్‌లో ఎన్టీఆర్ మాస్ యాక్షన్, డైలాగ్స్ పవర్‌ఫుల్‍గా ఉన్నాయి. సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ భీకరంగా ఉండటంతో పాటు కన్నింగ్‍గా అనిపిస్తోంది. సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో వచ్చే విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. మొత్తంగా దేవర ట్రైలర్.. చిత్రంపై హైప్‍ను మరో రేంజ్‍కు తీసుకెళ్లింది. ఈ మూవీకి రత్నవేలు సినిమాటోగ్రఫీ చేశారు. డైరెక్టర్ కొరటాల టేకింగ్ ట్రైలర్లో అదిరిపోయింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ట్రైలర్ వచ్చింది. సెప్టెంబర్ 27న ఐదు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
ముంబైలో ట్రైలర్ లాంచ్
దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. లాంచ్ ఈవెంట్‍కు మాస్ ఎంట్రీ ఇచ్చారు ఎన్టీఆర్. అక్కడ కూడా జై ఎన్టీఆర్ నినాదం హోరెత్తింది. ఈ చిత్రంలో నటించిన బాలీవుడ్ స్టార్లు హీరోయిన్ జాన్వీ కపూర్, విలన్‍గా చేసిన సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ ఈవెంట్‍కు వచ్చారు. దేవర ద్వారానే తెలుగులో వారిద్దరూ అడుగుపెడుతున్నారు.