Jr NTR on Devara: ఆ 40 నిమిషాలు యాక్షన్ జాతరే: దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో ఎన్టీఆర్.. ఆ ఒక్క షాట్ కోసం రోజంతా..
Jr NTR on Devara: దేవర మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. ఈ చిత్రం గురించి మీడియాతో మాట్లాడారు ఎన్టీఆర్. ఈ సందర్బంగా ఈ మూవీలో హైలైట్ ఏంటో చెప్పారు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర ట్రైలర్ అంచనాలకు తగ్గట్టే అదిరిపోయింది. దీంతో ఈ మూవీపై ఉన్న హైప్ మరింత పెరిగింది. నేడు (సెప్టెంబర్ 10) వచ్చిన ఈ ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. ఈ సందర్బంగా మీడియాతో ఎన్టీఆర్ మాట్లాడారు. ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
అందుకోసం ఎదురుచూడలేకున్నా..
దేవర చిత్రంలో యాక్షన్ ప్యాక్డ్ సీక్వెన్స్‌లపై చాలా అంచనాలు ఉన్నాయని, అయితే ఏ సీక్వెన్స్ అన్నికంటే హైలైట్‍గా ఉంటుందనే ప్రశ్న ఎన్టీఆర్‌కు ఎదురైంది. అయితే, ఈ చిత్రంలో చివరి 40 నిమిషాలు యాక్షన్ జాతరే అన్నట్టుగా ఎన్టీఆర్ ఆన్సర్ చెప్పారు. ఆ సీక్వెన్స్ చూసి ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారో చూసేందుకు నిరీక్షించలేకున్నానని అన్నారు.
దర్శకుడు కొరటాల శివ సృష్టించిన ఆ విజువల్స్‌ను చూసేందుకు ఆత్రుతగా ఉన్నానని ఎన్టీఆర్ చెప్పారు. “నేను ఒకే యాక్షన్ సీక్వెన్స్ అని చెప్పలేను. కానీ చివరి అరగంట, 40 నిమిషాలు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. దాన్ని అందరూ చూసేందుకు నేను ఎదురుచూడలేకున్నా. నా డైరెక్టర్ శివ ఆలోచించిన విజువల్ ప్రపంచాన్ని చూసేందుకు నిరీక్షించలేకున్నా” అని ఎన్టీఆర్ చెప్పారు.
షార్క్ షాట్ కోసం రోజంతా..
సముద్రంలో నుంచి గాల్లోకి ఎగురుతున్న షార్క్ (సొరచేప)పై ఎన్టీఆర్ కూర్చున్న షాట్ ట్లైలర్లో హైలైట్‍గా నిలిచింది. అద్భుతంగా ఉందంటూ చాలా మంది ప్రశంసిస్తున్నారు. ఈ మీట్‍లో కూడా ఈ షాట్‍పై ఎన్టీఆర్‌కు ప్రశ్న ఎదురైంది.
ఆ షాట్ ఎలా ఉందని ఎన్టీఆర్ అడిగే.. తనకు చాలా నచ్చిందని రిపోర్టర్ చెప్పారు. అయితే, ఆ షాట్ షూటింగ్ తనకు నచ్చలేదని ఎన్టీఆర్ సరదాగా అన్నారు. చాలా టైమ్ పట్టిందని చెప్పారు. “ఆ షాట్ చాలా కష్టంగా అనిపించింది. నేను ఓ పెద్ద ట్యాంక్‍లో ఉన్నా. ఆ షాట్ పర్‌ఫెక్ట్‌గా వచ్చేందుకు దాదాపు రోజుంతా తీసుకుంది” అని ఎన్టీఆర్ అన్నారు.
ఆరేళ్ల తర్వాత సోలో రిలీజ్
ఆరేళ్ల తర్వాత తన సోలో చిత్రం రిలీజ్ అవుతోందని, అందుకే కాస్త టెన్షన్‍గా ఉందని ఎన్టీఆర్ చెప్పారు. ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్, రామ్‍చరణ్ కలిసి నటించారు. ఎన్టీఆర్ నుంచి వచ్చిన లాస్ట్ సోలో మూవీ అరవింద సమేత (2018).
దేవర సినిమా సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్లలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ రిలీజ్ కానుంది. ట్రైలర్ ఐదు భాషల్లో వచ్చింది. అదిరిపోయే యాక్షన్, విజువల్స్‌తో ట్రైలర్ అదిరిపోయింది. ఎన్టీఆర్ యాక్షన్ విధ్వంసం చేశారు. ఈ మూవీ పక్కా బ్లాక్‍బస్టర్ అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.
దేవర చిత్రంలో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ చేశారు. జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటించారు. భైర అనే విలన్ పాత్రను సైఫ్ అలీ ఖాన్ పోషించారు. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, షైనా టామ్ చాకో, నరైన్, మురళి శర్మ, అజయ్ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సుమారు రూ.300కోట్ల భారీ బడ్జెట్‍ను ఈ మూవీకి వెచ్చించినట్టు అంచనా. పాజిటివ్ టాక్ వస్తే రూ.1000కోట్ల కలెక్షన్ల మార్కును దేవర దాటేస్తుందనే అంచనాలు ఉన్నాయి.