Devara Ticket Prices: దేవర టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం ఓకే.. అదనపు షోలకు కూడా.. తొలి రోజు ఆరు..
Devara Ticket Prices Hike: దేవర సినిమా టికెట్ల ధరలను పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదనపు షోలకు కూడా ఓకే చెప్పింది. తొలి రోజు అర్ధరాత్రి షో కూడా ఉండనుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న హైబడ్జెట్ మూవీ ‘దేవర’ విడుదల సమీపిస్తోంది. మరో ఆరు రోజుల్లో అంటే సెప్టెంబర్ 27న ఈ యాక్షన్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్లు కూడా జరుగుతున్నాయి. ఇక దేవర మూవీ టికెట్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయా అని సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో దేవర టికెట్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూవీ టీమ్ అడిగిన మేరకు టికెట్ల ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ధరలు ఎంత పెరిగాయంటే..
ఆంధ్రప్రదేశ్‍లోని మల్టీప్లెక్స్ థియేటర్లలో దేవర సినిమాకు సంబంధించిన ఒక్కో టికెట్‍పై అదనంగా రూ.135 పెంచుకునేందుకు మూవీ టీమ్‍కు ఏపీ సర్కార్ ఓకే చెప్పింది. సింగిల్ స్క్రీన్‍లలో బాల్కనీ టికెట్‍పై అదనంగా రూ.110, లోయర్ క్లాస్ టికెట్‍పై రూ.60 అధికం చేసేందుకు అనుమతి ఇచ్చింది. రెండు వారాల వరకు టికెట్లపై అదనపు ధరలు ఉంచుకోవచ్చు. ఈ మేరకు నేడు (సెప్టెంబర్ 21) ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
అదనపు షోలు ఇలా.. ఫస్ట్ డే అర్థరాత్రి షో
దేవర సినిమా కోసం అదనపు షోలకు కూడా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలి రోజైన సెప్టెంబర్ 27న ఆరు షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆరోజున అర్ధరాత్రి 12 గంటలకే తొలి షో పడనుంది. రెండో రోజు నుంచి మరో తొమ్మిది రోజులు ప్రతీ రోజు 5 షోలు ప్రదర్శించేందుకు కూడా ఏపీ ప్రభుత్వం ఓకే చెప్పింది. దీంతో దేవర చిత్రానికి తొలి రోజు ఆరు షోలు.. ఆ తర్వాత 9 రోజులు ఐదు షోలు ప్రదర్శించేందుకు వీలుంది.
ధన్యవాదాలు చెప్పిన ఎన్టీఆర్
దేవర చిత్రానికి టికెట్ల పెంపు, అదనపు షోలకు అనుమతి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జూనియర్ ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కల్యాణ్‍కు థ్యాంక్స్ చెపుతూ ట్వీట్ చేశారు. “దేవర రిలీజ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసినందుకు, తెలుగు సినిమాకు మద్దతు కొనసాగిస్తున్నందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‍కు హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‍కు కూడా థ్యాంక్స్ చెబుతున్నా” అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
దేవర సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను దక్కించుకున్న సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ నిర్మాత నాగవంశీ కూడా ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఈ మూవీకి టికెట్ల పంపు, అదనపు షోలపై తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా జీవో అతిత్వరలో వచ్చే అవకాశం ఉంది. సోమవారం నుంచి టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ మొదలవుతుందనే అంచనాలు ఉన్నాయి.
కొరటాల శివ దర్శత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన హైవోల్టేజ్ యాక్షన్ డ్రామా మూవీ దేవరపై పాన్ ఇండియా రేంజ్‍లో చాలా అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‍గా చేయగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ప్రొడ్యూజ్ చేసిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
టాపిక్