Rajamouli: అలాంటి సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. చేస్తా: రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్రశ్నకు నో కామెంట్-i will make animated film one day says director ss rajamouli at baahubali crown of blood press meet ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rajamouli: అలాంటి సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. చేస్తా: రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్రశ్నకు నో కామెంట్

Rajamouli: అలాంటి సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. చేస్తా: రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్రశ్నకు నో కామెంట్

Chatakonda Krishna Prakash HT Telugu
May 07, 2024 07:05 PM IST

SS Rajamouli: ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ యానిమేటెడ్ వెబ్ సిరీస్ కోసం మీడియాతో మాట్లాడారు దర్శక ధీరుడు రాజమౌళి. ఈ ఈవెంట్‍లో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆర్ఆర్ఆర్ విషయంలో ఎదురైన ఓ వివాదాస్పద ప్రశ్నకు స్పందించేందుకు నిరాకరించారు.

Rajamouli: అలాంటి సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. చేస్తా: రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్రశ్నకు నో కామెంట్
Rajamouli: అలాంటి సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. చేస్తా: రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్రశ్నకు నో కామెంట్

SS Rajamouli: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సృష్టించిన ‘బాహుబలి’.. యానిమేటెడ్ సిరీస్ రూపంలో వచ్చేందుకు రెడీ అయింది. ఆయన రూపొందించిన ‘బాహుబలి 1: ది బిగినింగ్’, ‘బాహుబలి 2: ది కంక్లూజన్’ సినిమాలు భారీ బ్లాక్‍బస్టర్ అవడంతో పాటు గొప్ప చిత్రాలుగా చరిత్రలో నిలిచిపోయాయి. ఈ క్లాసిక్ చిత్రాల ఆధారంగా ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ యానిమేటెడ్ సిరీస్ ఇప్పుడు వస్తోంది. మే 17వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ కోసం స్టార్ డైరెక్టర్ రాజమౌళి నేడు (మే 7) మీడియా సమావేశంలో పాల్గొన్నారు. చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

యానిమేషన్ మూవీ చేస్తా

యానిమేషన్ సినిమా చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా అని ఈ సమావేశంలో రాజమౌళికి ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన స్పందించారు. యానిమేషన్ సినిమా చేయాలని ఎప్పటి నుంచో తనకు ఆలోచన ఉందని, అది ఎప్పుడో ఒకసారి జరుగుతుందని అన్నారు.

తాను సినిమాలు చేసే కొద్దీ నేర్చుకుంటూనే ఉంటానని.. వాటి ద్వారా రానున్న చిత్రాల్లో కొత్తకొత్త విషయాలు చేసేందుకు తాను ప్రయత్నిస్తానని రాజమౌళి అన్నారు. “యానిమేషన్ మూవీ ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. నేను సినిమాలు చేస్తూ నేర్చుకుంటూనే ఉంటా. దీని వల్ల రానున్న సినిమాల్లో కొత్త విషయాలు చేసేందుకు ఉపయోగపడతాయి. నా చిత్రాలతో పాటు నేను మాట్లాడే అందరి నుంచి నేర్చుకుంటా. యానిమేషన్ మూవీ చేయాలని చాలా కాలం నుంచి నాకు ఆలోచన ఉంది. నేను ఈగ చేశా. అందులో కొంత భాగం యానిమేషన్ ఉంది. ఇప్పుడు శరత్, హాట్‍స్టార్‌తో భాగస్వామ్యమవుతున్నా. ఎలా ఉంటుందో నేర్చుకునేందుకు నాకు ఉపయోగపడ్డాయి. ఇది నేను సినిమా (యానిమేషన్) చేసేందుకు స్కిల్స్ పెంచుకునేందుకు ఉపయోగపడుతుంది” అని రాజమౌళి చెప్పారు.

‘ఆర్ఆర్ఆర్’పై ప్రశ్న దాటవేత

రాజమౌళి దర్శకత్వంలో రామ్‍చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా చేసిన గ్లోబల్ హిట్ ‘ఆర్ఆర్ఆర్’పై ఓ ప్రశ్న ఎదురైంది. ఆ చిత్రంలో ఒక హీరోను ఎక్కువగా.. మరో హీరోను తక్కువగా చూపించారనే చర్చ సోషల్ మీడియాలో సాగుతోందని.. ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలని రాజమౌళిని ఓ రిపోర్టర్ అడిగారు.

ఈ వివాదాస్పద ప్రశ్నకు రాజమౌళి కాస్త అసహనం చెందారు. “ఆ ప్రశ్నకు ఇది వేదిక కాదు. సందర్భం కాదు. ఏదీ కాదు” అని ఈ ప్రశ్నపై కామెంట్ చేసేందుకు నిరాకరించారు.

బాహుబలి కొనసాగుతూనే ఉంటుంది

బాహుబలి అనేది ఈ యానిమేటెడ్ సిరీస్‍తోనే ఆగిపోదని రాజమౌళి చెప్పారు. చాలా ప్లాట్‍ఫామ్‍ల్లో.. మరిన్ని రూపాల్లో ముందుకు సాగుతూనే ఉంటుందని జక్కన్న తెలిపారు. వేరే మీడియాల్లోనూ వస్తుందని అన్నారు. దీంతో బాహుబలిపై రాజమౌళి భారీ ప్లాన్ చేస్తున్నట్టు అర్థమవుతోంది.

దర్శక ధీరుడు రాజమౌళి తదుపరి సూపర్ స్టార్ మహేశ్ బాబుతో మూవీ చేయనున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి పాపులర్ అయ్యారు. దీంతో మహేశ్ మూవీని గ్లోబల్ రేంజ్‍లో అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్‌గా భారీ బడ్జెట్‍తో రూపొందించనున్నారు. ఈ ఏడాది ఆగస్టు - సెప్టెంబర్ మధ్య ఈ మూవీ షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది.

Whats_app_banner