Family Star Day 3 Box Office Collection: ఫ్యామిలీ స్టార్ డిజాస్టరేనా.. దారుణంగా మూడు రోజుల కలెక్షన్లు
Family Star Day 3 Box Office Collection: ఫ్యామిలీ స్టార్ మూవీ డిజాస్టర్ గా మిగిలిపోయేలా కనిపిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు చాలా దారుణంగా ఉన్నాయి.
Family Star Day 3 Box Office Collection: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీపై నెగటివ్ ఎఫెక్ట్ బాగానే పని చేస్తోంది. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు చాలా దారుణంగా ఉన్నాయి. తొలి షో నుంచే సినిమాకు నెగటివ్ టాక్ రావడంతో ఈ సినిమా తొలి మూడు రోజుల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.18 కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే రాబట్టింది.
ఫ్యామిలీ స్టార్ బాక్సాఫీస్
ఫ్యామిలీ స్టార్ సినిమాపై రిలీజ్ కు ముందు నుంచే దాడి జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. తొలి షో కూడా పూర్తి కాకముందే నెగటివ్ రివ్యూలు ఇచ్చారని నిర్మాత దిల్ రాజు ఆరోపించాడు. ఆ ప్రభావం మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లపై స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.6.3 కోట్ల షేర్ వసూళ్లు సాధించింది.
అది కాస్తా రెండో రోజు ఏకంగా రూ.2 కోట్లకు పడిపోయింది. ఇక మూడో రోజైన ఆదివారం (ఏప్రిల్ 7) కలెక్షన్లు మరింత తగ్గిపోయాయి. ఈ మూవీ షేర్ రూ.1.7 కోట్లకే పరిమితమైంది. దీంతో మూడు రోజుల్లో కలిపి ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు రూ.10 కోట్ల షేర్ గా మాత్రమే ఉన్నాయి. రూ.60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ఇవి దారుణమైన కలెక్షన్లనే చెప్పాలి.
డిజాస్టర్ తప్పదా?
ఈ వారం వరుస హాలిడేస్ ఉన్నాయి. అయినా ఫ్యామిలీ స్టార్ కోలుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. సినిమాపై ఇప్పటికీ నెగటివ్ ప్రచారం జోరుగానే సాగుతోంది. నిర్మాత దిల్ రాజు కూడా తమ మూవీకి పనిగట్టుకొని నెగటివ్ రివ్యూలు ఇస్తున్నారని, ఫ్యామిలీతో కలిసి వచ్చి చూసి ఎలా ఉందో చెప్పండని వేడుకుంటున్నాడు. అయినా ప్రేక్షకుల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది.
పైగా ఫ్యామిలీ స్టార్ సినిమాకు టిల్లూ స్క్వేర్, మంజుమ్మెల్ బాయ్స్ తెలుగు సినిమాల నుంచి పోటీ కూడా బాగానే ఉంది. దీంతో ఉగాది, రంజాన్ లాంటి హాలిడేస్ ఈ వారంలో ఉన్నా కూడా విజయ్, మృణాల్ సినిమా కోలుకోవడం కష్టమే. ఈ లెక్కన్ విజయ్ కు హ్యాట్రిక్ ఫెయిల్యూర్స్ ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే లైగర్, ఖుషీ సినిమాలు విఫలమయ్యాయి.
ఇప్పుడీ సినిమా కూడా బోల్తా పడటంతో విజయ్ క్రేజ్ కూడా తగ్గిపోయేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాతోపాటు విజయ్ పై జరుగుతున్న ట్రోల్స్ పై మేకర్స్ తీవ్రంగా స్పందించారు. సైబర్ క్రైమ్ లో కేసు కూడా నమోదు చేశారు. ఇక రివ్యూలపై మూడు రోజుల వరకు నిషేధం విధించాలని కూడా నిర్మాత్ దిల్ రాజు డిమాండ్ చేస్తున్నాడు. అయితే ఇవన్నీ ఎలా ఉన్నా.. ఫ్యామిలీ స్టార్ తో నష్టాలు మాత్రం తీవ్రంగానే ఉండనున్నాయి.
గీత గోవిందంలాంటి సూపర్ హిట్ సినిమా అందించిన విజయ్, పరశురామ్ జోడీ ఈ సినిమాతో బోల్తా పడింది. ఈ నేపథ్యంలో విజయ్ తో తాను తీయాలనుకున్న మరో రెండు సినిమాలను దిల్ రాజు రద్దు చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.