Dil Raju on Famly Star: రివ్యూలు ప్రొడ్యూసర్లు, ఇండస్ట్రీని నాశనం చేస్తున్నాయి: దిల్ రాజు ఆవేదన
Dil Raju on Famly Star: తొలి షో నుంచే వచ్చే రివ్యూలు ప్రొడ్యూసర్లు, ఇండస్ట్రీని నాశనం చేస్తున్నాయని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నాడు. ఫ్యామిలీ స్టార్ సినిమా గురించి అతడు ఇలా స్పందించాడు.
Dil Raju on Famly Star: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీకి తొలి షో నుంచే మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. దీంతో ఆ ప్రభావం సినిమా కలెక్షన్లపై పడింది. దీనిపై తాజాగా ఆ సినిమా నిర్మాత దిల్ రాజు స్పందించాడు. కేరళలోలాగే ఇక్కడ కూడా మూడు రోజుల పాటు రివ్యూలను నిషేధిస్తేనే ఇండస్ట్రీ, ప్రొడ్యూసర్లు బాగుపడతారని అనడం గమనార్హం.

రివ్యూల వల్లే ఈ దుస్థితి
ఫ్యామిలీ స్టార్ మూవీపై దిల్ రాజు టీవీ9 ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. సినిమాకు చాలా నెగటివ్ ప్రచారం రావడంపై స్పందిస్తూ.. చూసిన ప్రేక్షకులు చాలా మంది మూవీ బాగుందని, బయట ఇంతలా నెగటివ్ ప్రచారం ఎందుకు వస్తుందని అడుగుతున్నారని అన్నాడు. మూడు రోజుల వరకు రివ్యూలు ఇవ్వకపోతేనే ఇండస్ట్రీకి మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డాడు.
"పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అందరూ కలిసి సినిమా చూస్తున్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఈ సినిమా రీచ్ అయింది. వాళ్లు థియేటర్లకు వచ్చి సినిమా చూసి బాగుందని చెబుతున్నారు. మేము మంచి సినిమానే తీశాం. థియేటర్లకు వచ్చి చూడండి. నచ్చితే నలుగురికి చెప్పండి. నచ్చకపోతే ఆ రోజు నేను కచ్చితంగా అంగీకరించాల్సిందే.
మేము ఎక్కడో తప్పు జరిగిందని తెలుసుకుంటాం. ఇప్పటి వరకూ సినిమా చూసిన చాలా మంది మెసేజ్ లు, కాల్స్ చేస్తున్నారు. సినిమా బాగుంది కానీ ఎందుకు ఇంత నెగటివిటీ వస్తుందని అడిగారు. రిలీజ్ కు ముందు నుంచే నెగటివ్ ప్రచారం చేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు వచ్చి సినిమా చూడండి. మీకు నచ్చుతుంది" అని దిల్ రాజు అన్నాడు.
రివ్యూలపై నిషేధం విధించాలి
ఇక రివ్యూలపైనా స్పందించాడు. "కేరళలో ఏదో కోర్టు చెప్పిందట. మొదటి మూడు రోజులు రివ్యూలు ఇవ్వకూడదని. అలాంటిది ఏదో వస్తే గానీ ఇండస్ట్రీ బాగుపడదు. ఇక్కడ ఎవరిపై ప్రభావం పడుతుందని ఎవరూ చూడటం లేదు. ఏదో నెగటివ్ వైబ్స్ పెట్టుకొని చూడటం వల్ల ఆ ప్రభావం ప్రొడ్యూసర్లపై పడుతుంది.
ఎంతో కష్టపడి చేసిన సినిమాకి ఇలా ఆడియెన్స్ ను రాకుండా చేయడం అనేది కచ్చితంగా ప్రభావం చూపుతుంది. రాను రాను ఇది చాలా నష్టం చేస్తుంది. ఇక సినిమాలు ఏం తీస్తాంలే అన్న పరిస్థితి వస్తుంది. ఇది సరికాదు. ఈ నెగటివిటీ కరెక్ట్ కాదు. మీకు సినిమా నచ్చలేదు సరే. అది మీ అభిప్రాయం. దానిని ప్రేక్షకులపై రుద్దకండి" అని దిల్ రాజు కోరాడు.
ఫ్యామిలీ స్టార్ మూవీకి తొలి షో కూడా ముగియక ముందు నుంచే నెగటివ్ రివ్యూలు రావడం దుమారం రేపింది. ఆ ప్రభావం సినిమా కలెక్షన్లపై పడింది. చాలా మంది ఆడియెన్స్ ఈ రివ్యూలు చూసి సినిమాకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ లక్ష్యంగా నెగటివ్ రివ్యూలు క్రియేట్ చేస్తున్నట్లు కూడా విమర్శలు వస్తున్నాయి. విజయ్ కి లైగర్, ఖుషీ, ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ తో హ్యాట్రిక్ ఫ్లాపులు ఎదురయ్యాయి.