Srikanth Odela: ‘బ్రోచేవారెవరురా’ సినిమాలోలా తన సర్టిఫికేట్లు కాల్చేసిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.. కారణం ఏంటంటే!-dasara director srikanth odela reveals that he burned academic certificates at saripodhaa sanivaaram pre release event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Srikanth Odela: ‘బ్రోచేవారెవరురా’ సినిమాలోలా తన సర్టిఫికేట్లు కాల్చేసిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.. కారణం ఏంటంటే!

Srikanth Odela: ‘బ్రోచేవారెవరురా’ సినిమాలోలా తన సర్టిఫికేట్లు కాల్చేసిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.. కారణం ఏంటంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 25, 2024 04:10 PM IST

Director Srikanth Odela: దసరా సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు. తన అకడమిక్ సర్టిఫికేట్లను తానే కాల్చేశానని వెల్లడించారు. దానికి కారణాన్ని కూడా చెప్పారు. సరిపోదా శనివారం సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో ఈ విషయాలను తెలిపారు.

Srikanth Odela: ‘బ్రోచేవారెవరురా’ సినిమాలోలా తన సర్టిఫికేట్లు కాల్చేసిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.. కారణం ఏంటంటే!
Srikanth Odela: ‘బ్రోచేవారెవరురా’ సినిమాలోలా తన సర్టిఫికేట్లు కాల్చేసిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.. కారణం ఏంటంటే!

వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ‘బ్రోచేవారెవరురా’ సినిమాలో డైరెక్టర్ విశాల్ పాత్రలో నటించిన సత్యదేవ్.. తన సర్టిఫికేట్లను కాల్చేశానని చెబుతాడు. ఉద్యోగం చేయాలనే వేరే ఆలోచన రాకుండా సినిమాల్లోనే ఉండాలనే కసితో సర్టిఫికేట్లను కాల్చేశానని అంటాడు. అయితే, ఈ మూవీకి ముందే ఇలాంటి ఘటన ఓ డైరెక్టర్ నిజజీవితంలో జరిగింది. నేచురల్ స్టార్ నానితో బ్లాక్‍బస్టర్ మూవీ దసరా తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.. తాను అకడమిక్ సర్టిఫేకేట్లను కాల్చేశానని వెల్లడించారు. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన సరిపోదా శనివారం సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు హాజరైన శ్రీకాంత్ ఓదెల ఈ విషయాన్ని చెప్పారు.

కావాలనే ఇంటర్ ఫెయిల్ అయ్యా

ఇంటర్మీడియట్ పాస్ అయితే ఇంజినీరింగ్ చేయిస్తారనే భయంతో తాను ముందుగా ఓ సబ్జెక్ట్ కావాలనే ఫెయిల్ అయ్యానని శ్రీకాంత్ ఓదెల చెప్పారు. సినిమాల్లోకి రావాలనే ఉద్దేశంతో తాను ఇలా చేశానని తెలిపారు. అయితే, ఫిల్మ్ స్కూల్‍లో అడ్మిషన్ కోసం తాను ఆ తర్వాత ఇంటర్ పాసయ్యానని తెలిపారు. “ఇంటర్ పాసైతే మా నాన్న బీటెక్ చేర్పించి అలా పంపిస్తారని కావాలనే ఓ సబ్జెక్ట్ ఆపా. ఫిల్మ్ స్కూల్‍ కోసం ఇంటర్ పాస్ అవ్వాలని చెప్పారు. దీంతో ఇంటర్ పాసయ్యా. కానీ మళ్లీ ఫిల్మ్ స్కూల్‍లో ఫెయిల్ అయ్యా” అని శ్రీకాంత్ ఓదెల చెప్పారు.

ఒత్తిడి వల్ల కోపంతో కాల్చేశా

ఇంటర్ పాసైనందుకు డిగ్రీలో చేరాలని తన కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారని, ఆ కోపంతో తాను విద్యార్హత సర్టిఫికేట్లను కాల్చేశానని శ్రీకాంత్ తెలిపారు. “నాకు ఇంటర్మీడియట్ సర్టిఫేకేట్ రావటంతో మా నాన్నతో పాటు బాబాయిలు కూడా డిగ్రీలో చేరాలని, కనీసం ఓపెన్ డిగ్రీ అయినా చేయాలని చెప్పారు. నాకేమో సినిమాల్లో అవకాశాలు రాలేదు. ఇంటర్ సర్టిఫికేట్ ఉంది కాబట్టే వారు డిగ్రీ చేయాలని చెబుతున్నారని నాకు అర్థమైంది. ఒకరోజు కోపం వచ్చి ఏడో తరగతి, పదో తరగతి, ఇంటర్ సర్టిఫికేట్లన్నీ తగులబెట్టేశా” అని శ్రీకాంత్ ఓదెల చెప్పారు.

నా సీన్ రాశాడనిపించింది

బ్రోచేవారెవరురా సినిమాలో సర్టిఫికేట్లు కాల్చేసిన డైలాగ్ చూసి.. తన సీనే రాశారని అనుకున్నానని శ్రీకాంత్ ఓదెల అన్నారు. వివేక్ ఆత్రేయ అప్పటి నుంచి తనకు బాగా కనెక్ట్ అయ్యారని తెలిపారు. “బ్రోచేవారెవరూ సినిమాలో ఓ క్యారెక్టర్ అలా తగులబెడుతుంది. నాకు అది బాగా కనెక్ట్ అయింది. ఎవరు నా సీన్ రాశారు అనిపించింది. అలా తక్కువ మంది డైరెక్టర్లు సినిమాల ద్వారా మనతో మాట్లాడుతుంటారు. అలా నాకు వివేక్ బాగా కనెక్ట్ అయ్యారు” అని శ్రీకాంత్ చెప్పారు.

నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం సినిమా ఆగస్టు 29న విడుదల కానుంది. ఈ మూవీని యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు దర్శకుడు వివేక్ ఆత్రేయ. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్, ఎస్‍జే సూర్య కూడా కీలకపాత్రలు పోషించారు.

మళ్లీ నానితోనే ఓదెల

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా సినిమా గతేడాది బ్లాక్‍బస్టర్ అయింది. తదుపరి నానితోనే శ్రీకాంత్ మరో సినిమా చేయనున్నారు. ఈ సినిమాపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.