Brahmamudi July 5th Episode: బ్రహ్మముడి- కల్యాణ్ ఇల్లరికం రావాలని అనామిక డిమాండ్- ఛాన్స్ ఇచ్చిన జడ్జ్- సాక్షిగా కావ్య-brahmamudi serial july 5th episode kavya discovers anamika plots judge gave chance to anamika brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi July 5th Episode: బ్రహ్మముడి- కల్యాణ్ ఇల్లరికం రావాలని అనామిక డిమాండ్- ఛాన్స్ ఇచ్చిన జడ్జ్- సాక్షిగా కావ్య

Brahmamudi July 5th Episode: బ్రహ్మముడి- కల్యాణ్ ఇల్లరికం రావాలని అనామిక డిమాండ్- ఛాన్స్ ఇచ్చిన జడ్జ్- సాక్షిగా కావ్య

Sanjiv Kumar HT Telugu
Jul 05, 2024 07:51 AM IST

Brahmamudi Serial July 5th Episode: బ్రహ్మముడి సీరియల్ జూలై 5వ తేది ఎపిసోడ్‌లో అనామికతో మాట్లాడేందుకు కావ్య వెళ్తుంది. అక్కడ తాను డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నట్లు ఒప్పుకుంటుంది. తాను అత్తింటికి కాదు కల్యాణే ఇల్లరికం రావాలని అనామిక డిమాండ్ చేస్తుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ జూలై 5వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ జూలై 5వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో రాజ్ ఆలోచిస్తుంటాడు. ఇంతలో వచ్చిన కావ్య ఏం ఆలోచిస్తున్నారండి అని అడుగుతుంది. కళ్లముందు పరిష్కారం ఏం కనిపించనప్పుడు అంతా శూన్యంగానే ఉంటుంది. ఇంకా ఆలోచించడానికి అఏముందని రాజ్ అంటాడు. ఇంట్లో అంతా కల్యాణ్‌కు శిక్ష పడుతుందనే అనుకుంటున్నారని కావ్య అంటుంది. పరిస్థితులు చూస్తుంటే నాకూ అలాగే అనిపిస్తుందని రాజ్ అంటాడు.

అవన్ని పనికిరావు

ఓసారి అనామికతో మాట్లాడి వద్దామని కావ్య అంటే.. ఇంకా వాళ్లిద్దరిని కలపాలని ఎలా ఆలోచిస్తున్నావ్ అని రాజ్ అంటాడు. కలపడం గురించి తర్వాత సంగతి. కానీ, ఇప్పుడు కవిగారిని శిక్ష నుంచి ఎలా బయటపడేయాలో అది ఆలోచించాలి. ఇంత పరపతి, బలగం ఉండి అమాయకుడిని కాపాడలేకపోతున్నామని కావ్య అంటుంది. న్యాయస్థానం ముందు అవన్ని పనికిరావు. కన్న కూతురు భవిష్యత్ ఏమైపోతుందో కూడా ఆలోచించలేకపోతున్నారు అనామిక తల్లిదండ్రులు అని రాజ్ అంటాడు.

నీకోసం మీ ఫ్యామిలీ అంతా మా కాళ్ల మీద పడేందుకు సిద్ధమయ్యారు. కానీ, వాళ్లు కూతురుని ఆయుధంలా ఉపయోగించుకున్నారు. వాళ్లు ఏం ఆశిస్తున్నారో అర్థమైంది. వాళ్లకు డబ్బు కావాలి. పెళ్లి రోజు 2 కోట్లు ఇచ్చామన్న విశ్వాసం కూడా లేదు. కల్యాణ్‌ వెనుకున్న ఆస్తి చూసే అనామిక పెళ్లి చేసుకుంది. అది వాడు, నేను గ్రహించలేదు. ఇప్పుడు అడిగితే.. వాళ్లు ఎన్ని కోట్లు డిమాండ్ చేస్తారో కూడా ఊహించలేం అని రాజ్ అంటాడు.

అత్తింటివారు వస్తారని

ఇది డబ్బు సమస్య కాదు. కల్యాణ్ కోసం ఇంట్లో ఎంతైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కానీ, మా తమ్ముడిని క్షమించి కేసు వాపసు తీసుకోమ్మని నేను అడగలేను. నీకు అంత నమ్మకం ఉంటే నువ్ వెళ్లు. నేను మాత్రం రాలేను అని రాజ్ చెబుతాడు. దాంతో అనామిక ఇంటికి కావ్య వెళ్తుంది. కావ్యను చూసి పట్టనట్లు ఉంటుంది అనామిక. అనుకున్నాను, నా పుట్టింటిని వెతుక్కుంటూ నా అత్తింటి వారు వస్తారని అనామిక అంటుంది. అనుకున్నాను నువ్ అదే కోరుకుంటున్నావ్ అని కావ్య అంటుంది.

ఎందుకువచ్చావని అనామిక అంటుంది. రాక్షసుల రాజ్యంలో కూడా ఇంటికి వచ్చినవారిని కూర్చోబెట్టి గౌరవంగా మాట్లాడుతారు. కానీ, నువ్ నీకన్న పెద్దదాన్ని, తోడి కోడలిని అదేం లేకుండా కాలు మీద కాలేసుకుని ఉన్నావంటేనే అర్థమైపోతుంది. నీకు అత్తింటికి రావాలని లేదని కావ్య అంటుంది. ఇంకా నేనెందుకు ఆ ఇంటికి వస్తాను. కల్యాణే నా పుట్టింటికి (ఇల్లరికం) రావాలి అని అనామిక అంటుంది. అలా రావాలనుకున్నదానివే అయితే ఈ కేసులేంటీ, ఈ గొడవలేంటి అని కావ్య అడుగుతుంది.

కోట్లు సంపాందించి కుమ్మరించాలి

పెళ్లాం చెబితే వినని మనిషికి కోర్టు ద్వారా అయినా చెబితే బుద్ధి వస్తుందని అని అనామిక అంటుంది. అంతా బుద్ధి లేని పని కవిగారు ఏం చేశారని, నువ్ ఏం చెబితే వినలేదని, నువ్ ఎన్ని గొడవలు పడిన ఓపిగ్గానే ఉన్నాడు కదా కావ్య అడుగుతుంది. ఆ ఓపిక నాకెందుకు. నాకు బిజినెస్ చూసుకోవాలి. కోట్లు సంపాదించి నా ముందు కుమ్మరించాలి అని అనామిక అంటుంది. అంటే నువ్ కల్యాణ్‌ను ప్రేమించింది ఆస్తి కోసమా అని కావ్య అంటుంది.

మీరు ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నారు అని అంతా అంటారు. కానీ, మీకు ఆ కోరికలేనట్లు కనిపిస్తుంది. నాకు మాత్రం లగ్జీరియస్‌గా బతకాలని ఉందని అనామిక అంటుంది. నువ్ దుగ్గిరాల కోడలివి. నువ్ అడిగితే నీకు ఎంత కావాలంటే అంతా డబ్బు ఇవ్వరా. పది లక్షల చెక్‌పై మీ నాన్న పేరు రాసి ఇస్తే అందరికీ తెలిసిన ఊరుకున్నారు కదా అని కావ్య అంటుంది. లక్షలు ఎవరికీ కావాలి, స్వరాజ్‌గ్రూప్‌కు కల్యాణ్ ఎండీ అయితే కోట్లు సంపాదించొచ్చు అని అనామిక అంటుంది.

పుట్టింటివాళ్ల కోసమే కదా

మాట్లాడితే కోట్లు అంటావ్. ఏం చేసుకుంటావ్ అన్ని కోట్లు. నాకు అర్థమైంది. పది లక్షల కోసం నీ పుట్టింటివాళ్లు అత్తింట్లో చెక్ దొంగతనం చేయించారంటే వాళ్లకు ఎన్ని కోట్ల అప్పు ఉందో అర్థమైపోతుంది. వాళ్లకు దోచి పెట్టడానికే కదా ఇదంతా చేస్తున్నావ్. పోలీస్ స్టేషన్‌కు, తర్వాత కోర్టుకు ఇదంతా నీ పుట్టింటివాళ్ల కోసమే కదా అని కావ్య అంటుంది. అలా అని నేను చెప్పానా అని అనామిక అంటుంది. చెప్పేదేముందు పెళ్లి రోజు మా ఆయన రెండు కోట్లు ఇస్తేనే కదా నీ పెళ్లి జరిగింది అని కావ్య అంటుంది.

బాగా కనిపెట్టావ్. నా పుట్టింటి అప్పులు తీర్చడానికే డబ్బులు కావాలి. అది నా మొగుడు సంపాదించి ఇవ్వడని అనామిక అంటుంది. ఇలా చేస్తే కల్యాణ్ దిగివస్తాడని అనుకుంటున్నావా అని కావ్య అంటుంది. ఎందుకు రాడు. అందరూ దిగి వస్తారు. దుగ్గిరాల ఇంట్లో ఇలాంటిది ఎప్పుడు జరగలేదు కదా. వాళ్లంతా పరువు మర్యాదా అని చూస్తారు. అందుకే కల్యాణ్ నా కాళ్లబేరానికి వస్తాడని అనామిక అంటే.. భ్రమలో ఉన్నావని కావ్య అంటుంది.

కవితలు చూసి కాదని

లేదు. పకడ్బందీగా కల్యాణ్‌ను కేసులో ఇరికించాను. చట్టాలు, న్యాయ స్థానాలు ఆడవాళ్లకే అనుకూలంగా ఉంటాయి. కాబట్టి జైలు దాకా వెళితే కల్యాణ్ దిగిరాక తప్పదు. దిగి వచ్చాకా కల్యాణ్ నాతో కాపురం చేయక తప్పదు అని అనామిక అంటుంది. నా కళ్లు తెరుచుకున్నాయి. కల్యాణ్ కవితలు చూసి కాదు ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నావని క్లియర్‌గా అర్థమైంది అని కావ్య అంటుంది. కరెక్ట్. నీకు అర్థమైంది కదా. కల్యాణ్ అనే పిచ్చోడికి చెప్పు. వాడి అమ్మ బాబులకు చెప్పు. కల్యాణ్ జైలుకు వెళ్లకుండా ఉండేందుకు వాడికే బుద్ధి చెబుతారని అనామిక అంటుంది.

ఇది నిజంగా అన్యాయం. కానీ ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది అని కావ్య అంటుంది. రేపు కల్యాణ్‌ను జైలుకు వెళ్లకుండా ఆపలేరు. కోర్టులో కలుద్దాం. నాకు నిద్రొస్తుందని అనామిక వెళ్లిపోతుంది. మరుసటి రోజు కోర్టు ముందు అంతా కల్యాణ్‌కు శిక్ష పడాలని నిరసన చేస్తుంటారు. ఈరోజు కోర్టులో తీర్పు ఎవరివైపు రానుందని మీడియా చర్చిస్తుంది. తర్వాత వుమెన్ వెల్ఫేర్ అధ్యక్షురాలు ఝాన్సీని మీడియా ఈ విషయంపై అభిప్రాయం అడుగుతుంది.

చేయి చేసుకున్నట్లు ఒప్పుకున్నాడు

నిన్న అనామికే తప్పు చేస్తందని రాజ్ అన్నారు. నిజంగానే అనామిక మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తుందా. వారు అబద్ధాలు చెబుతున్నారా అని యాంకర్ అడుగుతుంది. నిజానికి ఏ ఆడపిల్ల తన జీవితాన్ని నాశనం చేసుకునేందుకు కోర్టు మెట్లు ఎక్కదు. పైగా నిన్న కల్యాణ్ అందరిముందు తన భార్యపై చేయి చేసుకున్నట్లు ఒప్పుకున్నాడు. దీనిబట్టి అర్థం అవుతుంది కదా. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాలి. లేకుంటే మేము ఊరుకోం అని ఝాన్సీ అంటుంది.

ఇంతలో అప్పు ఆటోలో వస్తుంది. దాంతో మీడియా వాళ్లను చుట్టుముడతారు. కల్యాణ్‌కు మీకు ఎన్ని సంవత్సరాలుగా అక్రమసంబంధం ఉంది. అనామికకు మీకు గొడవలు ఉన్నాయి. లేకుంటే డబ్బు కోసమే ఈ సంబంధం పెట్టుకున్నారా. దీనికోసం కల్యాణ్ మీకు ఎన్ని డబ్బులు ఇచ్చారు. ఇది మీ అమ్మనాన్నలకు తెలిసే చేశారా సీక్రెట్‌గా చేశారా అని మీడియా అంటే.. ఆపండి ఒక ఆడదానిగా ఇలానా మాట్లాడేది అని కనకం అంటుంది. మేము నీ కూతురిలా తప్పు చేయలేదు. నిజాన్ని జనానికి చూపిస్తున్నాం అని యాంకర్ అంటుంది.

బజారుకి ఈడ్చింది

హోటల్‌లో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది కదా. ఇంకా ఎందుకు బుకాయిస్తున్నారని మరో యాంకర్ అంటుంది. మీకు తెలిసిందే సగమే. నిజాన్ని నిరూపించడానికి నా దగ్గర సాక్ష్యాలు లేవు. ఆ అనామిక మా మీద కక్ష్య కట్టి మమ్మల్ని బజారుకి ఈడ్చింది. దేవుడనే వాడు ఉంటే నిజం బయటకొస్తుందని అప్పును తీసుకెళ్తుంది కనకం. అనామికను చూసి కనకం వాళ్లు ఆగిపోతారు. దాంతో అనామిక వాళ్లు లోపలికి వెళ్తారు. అప్పు ఏం కాదు. కంగారుపడకు అని కావ్య నచ్చజెబుతుంది.

కోర్టు బోనులో నిలబడి ఉన్న కల్యాణ్‌ దగ్గరికి వెళ్లి అనామిక మాట్లాడుతుంది. ఎలా ఉంది నా ప్రతాపం అని అనామిక అంటే.. పసుపు కుంకాలకు బదులు బూడిద మిగిలే పిచ్చిదాని ప్రతాపానికి నేనెందుకు భయపడతాను. నువ్ అన్ని నాశనం చేయగలవు. కానీ, నువ్ వెళ్లినప్పటి నుంచి ప్రశాంతంగా పడుకుంటున్నాను అని కల్యాణ్ అంటాడు. ఇవాళ నిన్ను నీ ప్రియురాలిని అందరూ చీదరించుకునేలా చేస్తాను అని అనామిక అంటుంది. కల్యాణ్ ఆల్ ది బెస్ట్ చెబుతాడు.

కోర్టు దాకా తీసుకురాకుండా

అమ్మ జడ్జ్ గారు వచ్చే టైమ్ అయిందని, కోర్టు హాల్లో వాదించుకోకూడదని పోలీస్ అనడంతో అనామిక వెళ్లిపోతుంది. జడ్జ్ వస్తాడు. లాయర్ లేస్తుంటే.. నువ్ ఆగు నేనే వీళ్లతో మాట్లాడుతాను అని జడ్జ్ అంటాడు. భార్య భర్తల మధ్య గొడవలు సహజం. వాటిని కోర్టు దాకా తీసుకురాకుండా పరిష్కరించుకోవాలి. అబ్బాయి ఉన్నతమైన కుటుంబం నుంచి, మర్యాదలు ఉన్న కుటుంబం కాబట్టి మరో ఛాన్స్ ఇస్తున్నాను. వీరిద్దరి మధ్య అప్పు అనే మూడో వ్యక్తి ప్రమేయం ఉంది. కాబట్టి ఆమెను బోనులో నిల్చోబెట్టి పరువు తీయాలని అనుకోవట్లేదని జడ్జ్ అంటాడు.

ఇప్పటికీ మించిపోలేదు. మీరు కలిసి ఉంటామని, విడాకులు తీసుకోమ్మని చెబితే ఇక్కడితో అయిపోతుందని, భారత న్యాయస్థానం భార్యాభర్తలను కలిపి ఉంచడానికే చూస్తుంది. ఏవమ్మా చెప్పు. నీకు నీ భర్త కావాల అని జడ్జ్ అడుగుతాడు. కావాలి. కానీ ఇలా సింపుల్‌గా కాదు. ఆ అప్పును బోనులో నిలబెట్టాలి. వీళ్ల మధ్య సంబంధం బయటపెట్టాలి. వీటన్నింటి కారణమైన అప్పుకు శిక్ష పడాలి. నన్ను నా వాళ్లను అవమానించి ఇంట్లోంచి గెంటేసినందుకు కల్యాణ్ నా కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పాలి అని అనామిక అంటుంది.

విరక్తి కూడా వస్తుంది

కాళ్లు పట్టుకోవాలా అని జడ్జ్ అడుగుతాడు. పట్టుకుని తీరాలి అని అనామిక గట్టిగా అంటుంది. పట్టుకోకపోతే.. అని జడ్జ్ అడుగుతాడు అతన్ని కఠినంగా శిక్షించాలి. జైలుకు పంపించాలని అనామిక అంటుంది. జైలుకు వెళితే.. నీకు భర్త ఉండడు కదమ్మా అని జడ్జ్ అడుగుతాడు. తిరిగొచ్చాకా బుద్ధి వస్తుంది కదా అని అనామిక అంటుంది. తిరిగొచ్చాకా విరక్తి కూడా వస్తుంది. పెళ్లి అన్న భార్య అన్న విముఖత కూడా వస్తుందని జడ్జ్ అంటాడు.

అదంతా నాకు తెలియదు సార్. అతనితో సంబంధం పెట్టుకున్న అప్పును అస్సలు వదలకూడదు అని అనామిక అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్‌లో మళ్లీ వాదనలు జరుగుతాయి. చిత్రహింసల సంగతి ఏంటని అనామిక లాయర్ అడిగుతుంది. ఈ కేసు విషయంలో బలమైన సాక్ష్యం పట్టుకున్నాం. అది ఎవరో కాదు కావ్య అని కల్యాణ్ లాయర్ చెబుతాడు. దాంతో అంతా షాక్ అవుతారు. కావ్య వచ్చి బోనులో నిల్చుంటుంది.

WhatsApp channel