Ambajipeta Marriage Band OTT: ఓటీటీలోకి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ఆరోజే రానుందా!
Ambajipeta Marriage Band OTT Release: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకుంది. సుహాస్ హీరోగా నటించిన ఈ చిత్రానికి మంచి వసూళ్లే వచ్చాయి. అయితే, ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ అయినట్టు సమాచారం బయటికి వచ్చింది.
Ambajipeta Marriage Band OTT: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్రంతో హీరో సుహాస్‍కు మరో హిట్ దక్కింది. గతేడాది రైటర్ పద్మభూషణం చిత్రంతో హీరోగా నిలదొక్కుకున్న అతడికి.. మరోసారి సక్సెస్ లభించింది. విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో లవ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు దుష్యంత్ కటికనేని. అంబాజీపేట మ్యారేజ్‍బ్యాండ్ మంచి బజ్‍తో ఫిబ్రవరి 2వ తేదీన థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో కలెక్షన్ల విషయంలోనూ అంచనాలను అందుకుంది.
కాగా, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ అయినట్టు సమాచారం బయటికి వచ్చింది. మార్చి 1వ తేదీన ఈ చిత్రం ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తుందని తెలుస్తోంది. ఈ విషయంపై ఆహా నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మార్చి రెండు లేదా మూడో వారం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ ఓటీటీలోకి వస్తుందని ముందుగా అంచనాలు వచ్చాయి. అయితే, మార్చి 1వ తేదీనే స్ట్రీమింగ్‍కు తీసుకురావాలని ఆహా భావిస్తున్నట్టు తాజాగా సమాచారం చక్కర్లు కొడుతోంది. మరి ఈ విషయాన్ని ఆహా ఎప్పుడు అఫీషియల్‍గా వెల్లడిస్తుందో చూడాలి.
కలెక్షన్లు ఇలా..
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రూ.8కోట్ల బడ్జెట్‍లోపే రూపొందింది. మూవీ టీమ్ ఈ చిత్రం కోసం బాగా ప్రమోషన్లు చేసింది. ముందుగా పెయిడ్ ప్రీమియర్లను కూడా నిర్వహించింది. పాజిటివ్ టాక్ రావటంతో ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్ వచ్చింది. తొలి రోజే ఈ మూవీకి రూ.2.28కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఫస్ట్ వీకెండ్ మూడు రోజుల్లోనే సేఫ్ జోన్‍లోకి వచ్చింది. మొత్తంగా ఏడు రోజుల్లో ఈ చిత్రం రూ.11.7 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కొత్త చిత్రాలు రావడంతో ఈ మూవీకి ప్రస్తుతం వసూళ్ల రాక తగ్గింది.
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీని జీఏ2 పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‍మెంట్, మహాయానా మోషన్ పిక్చర్స్ పతాకాలు నిర్మించాయి. ధీరజ్ మొగిలినేని, వెంకర్ రెడ్డి నిర్మించగా.. బన్నీవాసు, వెంకటేశ్ మహా సమర్పకులుగా ఉన్నారు. దుష్యంత్ కటికనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శేకర్ చంద్ర సంగీతం అందించారు.
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్రంలో సుహాస్‍తో పాటు శరణ్య ప్రదీప్‍ది కూడా ముఖ్యమైన పాత్ర. సుహాస్‍కు జోడీగా ఈ చిత్రంలో శివానీ నగారం నటించారు. గోపరాజు రమణ, శరణ్య ప్రదీప్, స్వర్ణకాంత్, జగదీశ్ ప్రతాప్ బండారీ, నితిన్ ప్రసన్న కీరోల్స్ చేశారు. నటుడిగా సుహాస్ ఈ చిత్రంతో మరోసారి నిరూపించుకున్నారు. సీరియస్ సీన్లలోనూ మెప్పించారు.
బార్బర్‌గా పని చేసే మల్లికార్జున (సుహాస్).. మ్యారేజ్ బ్యాండ్‍లోనూ ఉంటాడు. అతడి సోదరి పద్మావతి (శరణ్య ప్రదీప్) ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా చేస్తుండగా.. ఆ గ్రామంలో వెంకట్ (నితిన్ ప్రసన్న)కు ఆమెకు సంబంధం ఉందంటూ పుకార్లు వస్తాయి. ఈ క్రమంలోనే పద్మావతిని వెంకట్ అవమానిస్తాడు. ఆ తర్వాత మల్లికార్జున, వెంకట్ మధ్య గొడవలు షురూ అవుతాయి. వెంకట్ చెల్లి లక్ష్మి (శివానీ)నే మల్లికార్జున ప్రేమిస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీలో ఉంటుంది. కులం అంశం కూడా ఈ కథలో ప్రధానంగా ఉంది. గ్రామీణ నేపథ్యంలో హార్డ్ హిట్టింగ్ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రం వచ్చింది.