Ambajipeta Marriage Band Review: అంబాజీపేట మ్యారేజీ బ్యాండు రివ్యూ - సుహాస్‌కు హ్యాట్రిక్ హిట్ దక్కిందా? లేదా?
Ambajipeta Marriage Band Review: సుహాస్, శివాని నాగరం జంటగా నటించిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండు మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. దుష్యంత్ కటికినేని దర్శకత్వం వహించిన ఈ మూవీ ఎలా ఉందంటే...
Ambajipeta Marriage Band Review:కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్ సక్సెస్‌ల తర్వాత సుహాస్ (Suhas) హీరోగా నటించిన మూవీ అంబాజీపేట మ్యారేజీ బ్యాండు. సోషల్ మెసేజ్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీతో దుష్యంత్ కటికినేని దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
శరణ్య ప్రదీప్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో శివాని నాగారం హీరోయిన్‌గా కనిపించింది. శుక్రవారం అంబాజీపేట మ్యారేజీ బ్యాండు మూవీ థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ట్రైలర్స్, టీజర్స్‌తో తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ చిన్న సినిమా ఎలా ఉంది? అంబాజీపేట మ్యారేజీ బ్యాండుతో సుహాస్‌కు హ్యాట్రిక్ సక్సెస్ దక్కిందా లేదా అన్నది చూద్దాం...
మల్లి పోరాటం…
మల్లి (సుహాస్) అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో మెంబర్‌గా కొనసాగుతూనే తండ్రి సెలూన్ షాప్‌లో పనిచేస్తుంటాడు. మల్లి కవల సోదరి పద్మ (శరణ్య ప్రదీప్) ఆఊరి స్కూల్‌లో టీచర్‌గా వర్క్ చేస్తుంటుంది. స్కూల్ విషయంలో ఊరి పెద్దగా చెలామణి అవుతోన్న వెంకట్‌బాబు (నితిన్ ప్రసన్న) తమ్ముడు శ్రీనుబాబుతో పద్మ గొడవ పడుతుంది. ఆ గొడవ కారణంగా కోపంతో రగిలిపోయిన వెంకట్ బాబు పద్మను దారుణంగా అవమానిస్తాడు.
సోదరికి జరిగిన అవమానం భరించలేక వెంకట్‌బాబు కొట్టడానికి వెళతాడు మల్లి. కానీ వెంకట్‌బాబుతో పాటు అతడి మనుషులు మల్లికి గుండుకొట్టి పంపిస్తారు. మరోవైపు వెంకట్‌బాబు చెల్లెలు లక్ష్మిని (శివాని) ప్రేమిస్తుంటాడు మల్లి. లక్ష్మి కూడా మల్లిని ఇష్టపడుతుంది. చెల్లెలు ప్రేమ విషయం తెలిసిన వెంకట్‌బాబు ఏం చేశాడు?
తనకు వెంకట్‌బాబు చేసిన అవమానంపై పద్మ ఎలా ప్రతీకారం తీర్చుకున్నది? పద్మకు వెంకట్‌బాబు ఎలాంటి ఆపద తలపెట్టాడు? వెంకట్‌బాబును ఎదురించి లక్ష్మిని మల్లి పెళ్లిచేసుకున్నాడా? లేదా? అన్నదే అంబాజీపేట మ్యారేజీ బ్యాండు మూవీ(Ambajipeta Marriage Band Review) కథ.
కుల అంతరాల కథ...
కుల అంతరాలు, పేద, ధనిక కాన్సెప్ట్ అన్నది ఎవర్‌గ్రీన్ ఫార్ములా. ఈ కాన్సెప్ట్‌తో తెలుగు తెరపై ఎన్నో సూపర్‌హిట్ సినిమాలొచ్చాయి. మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా కమర్షియల్ కోణంలో కాకుండా వాస్తవికతను పెద్దపీట ఈ ప్రేమకథలను చెప్పడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో దర్శకుడు అదే ప్రయత్నం చేశాడు.
అగ్ర వర్ణాల అధిపత్యాన్ని, కుల వివక్షను ఎదురించి ఓ సాధారణ యువకుడు ఎలాంటి పోరాటం సాగించాడన్నది సహజంగా ఈ సినిమాలో చూపించారు. ఈ పోరాటంలో అతడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నది ఎమోషనల్‌గా ఆవిష్కరించారు. కుల వివక్ష కారణంగా అట్టడుగు వర్గాల వారు పడే సంఘర్షణను ఆలోచనాత్మకంగా అంబాజీపేట మ్యారేంజీ బ్యాండులో చూపించారు. కులం పేర్లు లేకుండా ఎలాంటి వివాదాలకు తావులేకుండా దుష్యంత్ రాసిన డైలాగ్స్, కొన్ని సీన్స్ థియేటర్లలో చప్పట్లు కొట్టిస్తాయి.
మల్లి ప్రేమకథతో...
మల్లి పాత్ర పరిచయంతో సింపుల్‌గా అంబాజీపేట మ్యారేజీ బ్యాండు మూవీ మొదలవుతుంది. మల్లి, లక్ష్మిల ప్రేమకథతో సరదాగా ఫస్ట్ హాఫ్ సాగుతుంది. తన షాప్ ముందు నుంచే కాలేజీ వెళుతున్న లక్ష్మిని చూసి ప్రేమలో పడ్డ మల్లి ఆమెను లవ్ లెటర్ రాయడం, ఎవరికి కనిపించకుండా వారి ప్రేమాయణం సాగే సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ టైమ్‌పాస్ చేస్తుంది.
వెంకట్‌బాబు తమ్ముడు శ్రీనుబాబుతో పద్మ గొడవపడే సీన్ నుంచే అసలు కథ మొదలవుతుంది. ప్రేమకథ నుంచి సీరియస్ మోడ్‌లోకి ఫిప్ట్ అవుతుంది. తనకు ఎదురుతిరిగిన పద్మ, మల్లిలను వెంకట్‌బాబు అవమానించడం, ఆ తర్వాత జరిగే గొడవలను ఇంటెన్స్‌గా చూపించాడు.
రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో హీరో మాదిరిగా ఫైట్స్ చేయడం కాకుండా హీరో పడే సంఘర్షణను రా అండ్ రస్టిక్‌గా చూపించాడు. శరణ్య పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్‌గా అనిపిస్తుంది. లక్ష్మి, మల్లిల ప్రేమకథను డిఫరెంట్‌గా ఎండ్ చేశాడు డైరెక్టర్.
లవ్‌స్టోరీ రొటీన్...
లవ్ స్టోరీ రొటీన్‌గా నడుస్తుంది. మరి పూర్తిగా రా అండ్ రస్టిక్‌గా తీస్తే తెలుగు ఆడియెన్స్ చూస్తారో లేదో అనే అనుమానంతో దర్శకుడు కొన్ని చోట్ల కమర్షియల్ లిబర్జీ తీసుకున్నాడు. క్లైమాక్స్ కన్వీన్సింగ్‌గా అనిపించదు. మల్లి, పద్మ పాత్రల మధ్య ఎమోషనల్ బాండింగ్‌ను, వారి పోరాటాన్ని మరికాస్త డెప్త్‌గా రాసుకుంటే బాగుండేదని అనిపిస్తుంది.
ప్రతి పాత్ర పోటాపోటీగా...
అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాలో ప్రతి ఒక్కరు పోటాపోటీగా నటించారు. మల్లి పాత్రలో సుహాస్ ఒదిగిపోయాడు. ఈ క్యారెక్టర్‌కు పర్‌ఫెక్ట్ యాప్ట్ అనిపించాడు.. నటిగా శరణ్యలోని కొత్త కోణాన్ని ఈ సినిమా చూపించింది. సీరియస్ రోల్స్ వస్తే తాను ఏ స్థాయిలో చెలరేగగలదో ఈ సినిమాలో చూపించింది.
సెకండాఫ్‌లో కథ మొత్తం శరణ్య క్యారెక్టర్ చుట్టే సాగుతుంది. హీరోతో సమానమైన క్యారెక్టర్‌లో యాక్టింగ్‌తో మెప్పించింది. నితిన్ ప్రసన్న విలనిజం పీక్స్‌లో చూపించాడు. దర్శకుడు రాసుకున్న పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. శివాని నాగారం కూడా ఒకే అనిపించింది.
తమిళ దర్శకుల స్థాయిలో…
అంబాజీపేట మ్యారేజీ బ్యాండు బ్యూటీఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ లవ్‌స్టోరీ. కుల వివక్ష బ్యాక్‌డ్రాప్‌లో తమిళ డైరెక్టర్స్ కు పోటీగా తెలుగు దర్శకులు కూడా సినిమాలు తీయగలరని చాటిచెప్పే మూవీ ఇది.
రేటింగ్: 3/5
టాపిక్