Ambajipeta Marriage Band Day 1 Collections: సుహాస్ చిత్రానికి సూపర్ ఓపెనింగ్.. తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే..
Ambajipeta Marriage Band Day 1 Collections: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాకు అంచనాలకు తగ్గట్టుగానే మంచి ఓపెనింగ్ దక్కింది. సుహాస్ హీరోగా నటించిన ఈ చిత్రానికి తొలి రోజు ఎంత కలెక్షన్లు వచ్చాయంటే..
Ambajipeta Marriage Band Movie: టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హీరోగా నటించిన ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ చిత్రం మంచి బజ్‍తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శుక్రవారం (ఫిబ్రవరి 2) ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. హార్డ్ హిట్టింగ్ ఎమోషనల్ కామెడీ లవ్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు దుశ్యంత్ కటికనేని. ట్రైలర్‌తో మంచి అంచనాలు ఏర్పడగా.. రిలీజ్ తర్వాత వాటిని నిలబెట్టుకుంది ఈ చిత్రం. ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్'కు పాజిటివ్ టాక్ వచ్చింది. ఇందుకు తగ్గట్టే తొలి రోజు ఈ సినిమాకు మంచి ఓపెనింగ్ వచ్చింది.
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.2.28 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. అంచనాలకు మంచి మంచి ఓపెనింగ్‍ను ఈ చిత్రం సాధించింది. బడ్జెట్ పరంగా చిన్న మూవీగా వచ్చి బాక్సాఫీస్ వద్ద అద్బుతమైన ఆరంభాన్ని దక్కించుకుంది. తొలి రోజు కలెక్షన్ల వివరాలను మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. హార్డ్ హిట్టింగ్ బ్లాక్‍బాస్టర్ అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది.
పాజిటివ్ టాక్‍తో..
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్రానికి తొలి రోజు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. చాలా శాతం రివ్యూలు కూడా సానుకూలంగా వచ్చాయి. దీంతో ఈ మూవీకి రెండో రోజు నుంచి వసూళ్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. మూవీ టీమ్ కూడా ప్రమోషన్లను ఇంకా జోరుగా చేస్తోంది. నేడు హైదరాబాద్‍లోని కొన్ని థియేటర్లకు సుహాస్ మరికొందరు టీమ్ సభ్యులు వెళ్లారు. మొత్తంగా ఈ చిత్రానికి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
కులాల మధ్య అంతరాలు, లవ్ స్టోరీ ప్రధాన అంశాలుగా ఎమోషనల్, యాక్షన్‍తో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రంలో సుహాస్ సరసన శివానీ నగారం హీరోయిన్‍గా నటించారు. గోపరాజు రమణ, శరణ్య ప్రదీప్, జగదీశ్ ప్రతాప్ బండారీ, స్వర్ణకాంత్, నితిన్ ప్రసన్న కీలకపాత్రల్లో నటించారు.
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‍తో దర్శకుడిగా పరిచయం అయ్యారు దుశ్యంత్. మొదటి చిత్రాన్నే పరిణితితో తెరకెక్కించిన అతడిపై ప్రశంసలు వస్తున్నాయి. ఈ మూవీకి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. జీఏ2 పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‍మెంట్స్, మహయానా మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై బన్నీవాస్, వెంకటేశ్ మహా, ధీరజ్ మొగిలినేని, వెంకట్ రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.
స్టోరీ లైన్ ఇదే..
అంబాజీపేట అనే గ్రామంలో 2007 బ్యాక్‍డ్రాప్‍లో ఈ సినిమా సాగుతుంది. మల్లికార్జున (సుహాస్) బార్బర్‌గా ఉంటూనే మ్యారేజ్ బ్యాండ్‍లోనూ పని చేస్తుంటాడు. అతడి సోదరి పద్మావతి (శరణ్య ప్రదీప్) ప్రభుత్వ స్కూల్ టీచర్‌గా ఉద్యోగం చేస్తుంటారు. అయితే, ఆ గ్రామంలో మోతుబరిగా ఉండే వెంకట్ (నితిన్ ప్రసన్న)కు పద్మావతికి మధ్య అక్రమ బంధం ఉందంటూ పుకార్లు వస్తాయి. వెంకట్ సోదరి లక్ష్మి (శివాని నగారం)తో మల్లికార్జున ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో కులం పేరుతో పద్మను వెంకట్ అవమానిస్తాడు. దీంతో మల్లికార్జున, వెంకట్ మధ్య గొడవలు వస్తాయి. మరి ఆ తర్వాత ఏం జరిగింది? గొడవలు దేనికి దారి తీశాయి? మల్లికార్జున, లక్ష్మి ప్రేమ విజయవంతం అయిందా? అనేదే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ ప్రధాన అంశాలుగా ఉన్నాయి.