Kejriwal: ‘‘నన్ను భరించడం అంత ఈజీ కాదు. అవినీతి గురించి మోదీజీ మట్లాడకపోతేనే బెటర్’’-కేజ్రీవాల్ వ్యాఖ్యలు
‘నాలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తిని సహించడం అంత సులభం కాదు’ అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన భార్య సునీత గురించి వ్యాఖ్యానించారు. తన జీవితంలో ఆమె తనకు ఎంతో సహకరించిందన్నారు. తాను జైళ్లో ఉన్నప్పుడు తనకు, ఢిల్లీ ప్రజలకు మధ్య ఆమె వారధిలాగ వ్యవహరించిందని వివరించారు.
Kejriwal about wife Sunita: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన తర్వాత తన భార్య సునీత రాజకీయాల్లోకి రావడం, ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ పై జరిగిన దాడి, ఆప్ పై మోదీ విమర్శలు తదితర అంశాలపై అరవింద్ కేజ్రీవాల్ వార్తాసంస్థ పీటీఐకి ఇంటర్వ్యూలో స్పందించారు. తన భార్య సునీత గురించి అడిగినప్పుడు ‘నాలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తిని సహించడం అంత సులభం కాదు’ అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్మొహమాటంగా అంగీకరించారు.
సునీత రాజకీయాల్లోకి వస్తారా?
తన జీవితంలో సునీత ఎప్పుడూ తనకు సపోర్ట్ చేశారని, ఆమె లాంటి భాగస్వామి దొరకడం తన అదృష్టమని అన్నారు. ‘‘నాలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తిని సహించడం అంత సులభం కాదు. నేను 2000 సంవత్సరంలో ఆదాయ పన్ను శాఖకు రాజీనామా చేసి ఢిల్లీలోని మురికివాడల్లో పనిచేయడం ప్రారంభించాను. నేను పదేళ్లు ఢిల్లీలోని మురికివాడల్లో పనిచేశాను. ఆ సమయంలో కూడా ఆమె నాకు మద్దతు ఇచ్చింది’’ అని కేజ్రీవాల్ గుర్తు చేసుకున్నారు. సునీతా కేజ్రీవాల్ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తారా అని అడిగిన ప్రశ్నకు ఢిల్లీ ముఖ్యమంత్రి సమాధానమిస్తూ, ‘‘నన్ను అరెస్టు చేసినప్పుడు, ఆమె నాకు మరియు ఢిల్లీ ప్రజలకు మధ్య వారధిలా పనిచేశారు. కానీ అది తాత్కాలికమైన విషయమే. క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొనేందుకు ఆమెకు ఆసక్తి లేదు. భవిష్యత్తులో ఆమె ఏ ఎన్నికల్లోనూ పోటీ చేసే అవకాశం కనిపించడం లేదు’’ అన్నారు.
స్వాతి మలివాల్ పై దాడి విషయంలో రెండు వర్షన్లు
ఆప్ నేత స్వాతి మలివాల్ (Swati Maliwal) పై జరిగిన 'దాడి' గురించి కూడా అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. ఈ వివాదానికి రెండు వెర్షన్లు ఉన్నాయని ఆయన నొక్కి చెప్పారు. అయితే, ఈ విషయం కోర్టు పరిధిలో ఉందని, దీనిపై తాను వ్యాఖ్యానించదలుచుకోలేదని, ఎందుకంటే ఇది విచారణపై ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. కానీ నిష్పాక్షిక దర్యాప్తు జరుగుతుందని తాను ఆశిస్తున్నాననన్నారు. ‘‘న్యాయం జరగాలి. ఈ కార్యక్రమానికి రెండు వెర్షన్లు ఉన్నాయి. ఈ రెండు వెర్షన్లపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి న్యాయం చేయాలి’’ అని అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.
'అవినీతి గురించి మోదీజీకి మాట్లాడటమా?
అవినీతి గురించి మాట్లాడటం మోదీజీకి తగదని, ఆయన అవినీతిపరులందరినీ తన పార్టీలో చేర్చుకున్నారని కేజ్రీవాల్ విమర్శించారు. మోదీజీ అవినీతి గురించి మాట్లాడకపోవడమే మంచిదని హితవు పలికారు. ‘‘అది అతనికి సరిపోదు. అవినీతిపరులందరినీ ఆయన తన పార్టీలో చేర్చుకుని ఇతరులను అవినీతిపరులుగా అభివర్ణిస్తున్నారు. అవినీతిపరులంతా ఆయన పార్టీలోనే ఉన్నారు. ఈ సమయంలో, దేశాన్ని రక్షించడానికి మేము అవసరమైనదంతా చేస్తాము’’ అని అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. రెండు అవినీతి పార్టీలు (కాంగ్రెస్, ఆప్) ఒకదానికొకటి ముసుగుగా మారాయని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు కేజ్రీవాల్ పై సమాధానమిచ్చారు.
ఎలక్టోరల్ బాండ్లు ఒక క్విడ్ ప్రో కో కుంభకోణం
ఎలక్టోరల్ బాండ్లను దేశంలో క్విడ్ ప్రో కో కుంభకోణంగా అరవింద్ కేజ్రీవాల్ అభివర్ణించారు. ఎలక్టోరల్ బాండ్ అనేది స్వతంత్ర భారతంలో అతిపెద్ద కుంభకోణమని, ఇది ఒక్క కుంభకోణం కాదని, ఇందులో వేలాది కుంభకోణాలు ఉన్నాయని అన్నారు. ‘‘బీజేపీకి వెళ్లిన ప్రతి విరాళం ఒక ఉపకారానికి బదులుగానే అందింది.. ఇది క్విడ్ ప్రోకో. ఎవరికైనా కాంట్రాక్ట్ దక్కించుకుని కానీ, వేరే ఏదైనా లాభం పొంది కానీ, లేదా తమకు, తమవారికి బెయిల్ వస్తే కానీ ప్రతిఫలంగా వారు బీజేపీకి భారీగా విరాళాలు ఇచ్చారు’’ అని కేజ్రీవాల్ ఆరోపించారు.