Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా కొనసాగవచ్చా? చట్టాలు ఏం చెబుతున్నాయి?
నాటకీయ పరిణామాల మధ్య ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను గురువారం రాత్రి అరెస్ట్ చేసింది. అనంతరం, కేజ్రీవాల్ ను ఈడీ ఆఫీస్ కు తరలించారు. ఎక్సైజ్ పాలసీ కేసులో ప్రమేయం, తొమ్మిది సమన్లను దాటవేయడం వంటి కారణాలతో కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసింది.
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను గురువారం రాత్రి అరెస్ట్ చేసిన ఈడీ.. అతడిని ఫ్లాగ్ స్టాఫ్ రోడ్డులోని తన నివాసం నుంచి ఈడీ ఆఫీస్ కు తరలించింది. కేజ్రీవాల్ అరెస్ట్ బీజేపీ కుట్ర అని ఆప్ ఆరోపించింది.
సీఎంగా కొనసాగుతారా?
ప్రస్తుతానికి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ఢిల్లీ సీఎంగా కొనసాగుతారని, జైలు నుంచే పరిపాలన సాగిస్తారని ఆప్ నేతలు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఢిల్లీ మంత్రి అతిషి స్పష్టం చేశారు. అయితే, ఇది న్యాయపరంగా సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ పరిస్థితి అసాధారణమైనదే కాని పూర్తిగా అసాధ్యమైనది కాదని రాజకీయ నిపుణులు, న్యాయవాదులు చెబుతున్నా రు. అయితే, చట్టబద్ధంగా సీఎంగా కొనసాగవచ్చేమో కానీ, జైలు నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం ఆచరణ సాధ్యం కాదని వారు వివరించారు.
ఏ చట్టంలోనూ లేదు..
క్రిమినల్ కేసులో అరెస్టయిన తర్వాత సిట్టింగ్ సీఎం రాజీనామా చేయాలని రాజ్యాంగంలో గానీ, ఏ చట్టంలో కానీ లేదు. నేరం రుజువై జైలు శిక్ష విధించిన తర్వాతే వారు రాజీనామా చేయాల్సి ఉంటుంది. లేదా వారు ఎమ్మెల్యే పదవికి అనర్హులుగా తేలుతారు. అయితే, అరెస్టు అయిన తర్వాత, నైతిక బాధ్యత వహించి, సీఎం పదవికి రాజీనామా చేయడం కొన్ని సందర్బాల్లో జరిగింది.
జైల్ లో నుంచే సీఎం విధులు
ఒకవేళ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకూడదని కేజ్రీవాల్ భావిస్తే, రాజ్యాంగం ప్రకారం, జైలు లోపలి నుంచే సీఎంగా విధులు నిర్వర్తించవచ్చని రాజ్యాంగ నిపుణులు, న్యాయవాదులు చెబుతున్నారు. కానీ, ‘‘ప్రతిరోజూ సంతకాల కోసం అన్ని ఫైళ్లను జైలుకు పంపడం ఎంతవరకు ఆచరణ సాధ్యం? జైలు అధికారులు అందుకు అనుమతిస్తారా? జైలు అధికారులు ఎలాంటి నిబంధనలు పాటిస్తారనే దానిపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది’’ అని లోక్ సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీ తంగప్పన్ ఆచారి అన్నారు.
వేరెవరికైనా బాధ్యతలు..
ఒకవేళ సీఎం పదవికి రాజీనామా చేస్తే, తన మంత్రివర్గంలోని ఎవరికైనా ఆ బాధ్యతలను కేజ్రీవాల్ అప్పగించవచ్చు. లేదా తన భార్య సునీత కేజ్రీవాల్ ను కూడా ఆ పీఠం పై కూర్చోబెట్టవచ్చు. ఒకవేళ సునీత కేజ్రీవాల్ ను సీఎం చేస్తే, ఆమె 6 నెలల లోపు ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణంలో అరెస్టైనప్పుడు తన భార్య రబ్రీ దేవిని సీఎంగా నియమించారు.
రాష్ట్రపతి పాలనకు అవకాశం?
ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ వీకే సక్సేనా కు, అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నేతృత్వంలోని ప్రభుత్వానికి చాన్నాళ్లుగా సత్సంబంధాలు లేవు. నిజానికి, లిక్కర్ స్కామ్ పై విచారణ జరపాలని మొదట ఆదేశాలు జారీ చేసిందే లెఫ్ట్ నెంట్ గవర్నర్. ఈ పరిస్థితుల్లో లెఫ్ట్ నెంట్ గవర్నర్ వీకే సక్సేనా రంగంలోకి దిగి, ఆప్ ప్రభుత్వాన్ని రద్దు చేసి, తానే పరిపాలన పగ్గాలు చేపట్టే అవకాశం ఉందా? అనే విషయంలో కూడా వాదోపవాదాలు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీలో చట్టపరంగా రాష్ట్రపతి పాలనకు అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం మెజారిటీ కోల్పోయి పడిపోతేనే రాష్ట్రపతి పాలన విధించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల వరకు పరిపాలనా బాధ్యతలన్నీ లెఫ్టినెంట్ గవర్నర్ వద్దే ఉంటాయి.