Graduate Mlc Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య హోరా హోరీ-tg graduate mlc election tough fight between brs and congress leaders ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Graduate Mlc Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య హోరా హోరీ

Graduate Mlc Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య హోరా హోరీ

HT Telugu Desk HT Telugu
May 23, 2024 12:35 PM IST

Graduate Mlc Elections: నల్లగొండ - ఖమ్మం - వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పక్షాలు హోరా హోరీ తలపడుతున్నాయి. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 4.61లక్షల మంది ఓటరు పట్టభద్రులను ప్రసన్నం చేసుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పోరాడుతున్నాయి.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పీఠాన్ని ఎక్కేదెవరు?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పీఠాన్ని ఎక్కేదెవరు?

Graduate Mlc Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే కనిపిస్తుండగా, బీజేపీ మాత్రం ఉనికిని కాపాడుకునేందుకు తంటాలు పడుతోంది. బీఆర్ఎస్ నుంచి ఏనుగు రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్, బీజేపీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ఈ ఎన్నికల్లో తలపడుతున్నాయి. మొత్తంగా బరిలో 52 మంది అభ్యర్థులు ఉండగా, స్వతంత్ర అభ్యర్థుల బక్క జడ్సన్, పాలకూరి అశోక్ కుమార్ పోటీ ఇస్తున్నారు.

బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ శాసన మండలి పునరుద్దరణ జరిగిన నాటి నుంచి ఈ నియోజకవర్గానికి ఇప్పటి వరకు నాలుగు పర్యాయాలు ఎన్నికలు జరగగా, బీఆర్ఎస్ ఇప్పటి దాకా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చింది. ఈ ఉప ఎన్నికల్లో సైతం విజయం సాధించి తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని శ్రమిస్తోంది. మరో వైపు గత ఏడాది చివరలో జరిగిన తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో ఈ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో అత్యధిక సంఖ్యంలో ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్.. అదే ఊపులో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలన్న కసితో ఉంది.

52 మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఈ నియోజకవర్గ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే కొనసాగుతోంది. ఇప్పటికే ఆ పార్టీల నాయకులు తమ అభ్యర్థులను వెంకటేసుకుని ప్రచారం చేస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు, మూడు జిల్లాల్లోని మాజీ ఎమ్మెల్యేలు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

కాంగ్రెస్ నుంచి మూడు జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు అభ్యర్థిని కలుపుకొని ప్రచారం చేస్తున్నాయి. అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన వాగ్థానాలను గట్టున పెట్టిందని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపైనే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల హామీల అమలు విషయంలో కాంగ్రెస్ అనివార్యంగా జవాబులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది.

బీఆర్ఎస్ ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతూనే.. ఆ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తోంది. మరో వైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరును ఎండగడుతూ ప్రచారం చేస్తోంది. ఆత్మీయ సమావేశాలే ప్రచార వేదికలు వాస్తవానికి ఇరు పార్టీలూ గ్రాడ్యుయేట్ ఓటర్లను కలిసేందుకు ఆత్మీయ సమావేశాలను ఎక్కువగా నమ్ముకుంటున్నాయి.

అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలూ ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో తమ పార్టీకి చెందిన గ్రాడ్యుయేట్స్ సహా మరికొందరు పట్టభద్రులను సమీకరించి ఒకే చోట సమావేశాలను నిర్వహిస్తున్నాయి. మరో వైపు బీజేపీ సైతం ఇదే వ్యూహాన్ని అనుసరిస్తోంది.

బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రేమేందర్ రెడ్డి 2021 ఎన్నికల్లోనూ పోటీ చేసి నాలుగో స్థానంలో నిలిచారు. ఈ ఉప ఎన్నికల్లో సైతం బీజేపీ ఆయనకే టికెట్ ఇచ్చింది. బీజేపీ తరపున ఆ పార్టీ సీనియర్ నాయకులు ఈటల రాజేందర్, డి.కే.అరుణ ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీకి సంబంధంలేని న్యూట్రల్ ఓటర్లను కలవడానికి పార్టీల అభ్యర్థులు పార్కులు, ప్లే గ్రౌండ్స్, స్టేడియాలను సందర్శిస్తున్నారు. ఇక్కడ వాకర్స్ ను కలుస్తున్నారు. ఓటర్లను కలిసి ప్రచారం చేస్తున్నారు.

ప్రభావం చూపలేక పోతున్న ఇండిపెండెంట్లు

ఎమ్మెల్సీ బరిలో మూడు ప్రధాన పార్టీలే కాకుండా, చిన్న పార్టీల నుంచి అదే మాదిరిగా ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కానీ, వీరి ప్రభావం బయట ఎక్కడా ఎక్కువగా కనిపించడం లేదు. మూడు ఉమ్మడి జిల్లాల విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పట్టభద్రులను కలిసే ప్రయత్నాలు పెద్దగా చేస్తున్నట్లు కనిపించడం లేదు.

ఇండిపెండెంట్లుగా పోటీలో ఉన్న కాంగ్రెస్ మాజీ నేత బక్క జడ్సన్, పాలకూరి అశోక్ కుమార్ పట్టభద్రులను కలిసి ఓట్లు అడగడంలో కొంత ముందున్నట్లు కనిపిస్తోంది. పార్టీలకు జిల్లాల వ్యాప్తంగా విస్త్రుత యంత్రాంగం ఉండడంతో అభ్యర్థులు చేస్తున్నంతంగా ప్రచారం వీరు చేయలేక పోతున్నారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమదే విజయమంటే.. తమదే అన్న ధీమాలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉన్నారు.

( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, HT TELUGU నల్గొండ )

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం