Graduate Mlc Election : ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక వంతు, బరిలో 52 మంది
Graduate Mlc Election : తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హడావుడి ముగిసిన ఆ మూడు జిల్లాల్లో మాత్రం ఇంకా ఎన్నికల వాతావరణ కొనసాగుతోంది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ఈ నెల 27 జరగనున్నాయి. ఈసారి 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
Graduate Mlc Election : తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హడావిడి ముగిసింది. జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాల కోసం అంతా ఎదురు చూడాల్సిందే. కానీ, ఈ మధ్యలో రాష్ట్రంలోని మరో మూడు జిల్లాల్లో మాత్రం ఎన్నికల వాతావరణం కొనసాగనుంది. నల్గొండ - ఖమ్మం - వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ఈ నెల 27వ తేదీన జరగనుంది. ఈ మూడు జిల్లాల పరిధిలో 4.63 లక్షల మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా, నామినేషన్ల విత్ డ్రా అంకం ముగిశాక ఈ నియోజకవర్గం బరిలో 52 మంది అభ్యర్థులు మిగిలారు. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య కొనసాగనుంది.
ఖాయంగా త్రిముఖ పోటీ ?
నల్గొండ - ఖమ్మం - వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జరుగుతున్న ఈ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఖాయంగా కనిపిస్తోంది. వరసగా ఇప్పటి వరకు నాలుగు సార్లు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన బీఆర్ఎస్ ఈసారి తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు శ్రమిస్తోంది. ఆ పార్టీ తరపున ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రాకేష్ రెడ్డి పోటీలో ఉన్నారు. గతంలో ఈ స్థానంలో బీఆర్ఎస్ నుంచి కపిలవాయి దిలీప్ కుమార్ రెండు సార్లు, పల్లా రాజేశ్వర్ రెడ్డి రెండు సార్లు విజయం సాధించారు. 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి రెండో సారి విజయం సాధించగా, 2023 శాసనసభ ఎన్నికల్లో ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.
తమ సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుండగా, మరో వైపు అధికార కాంగ్రెస్ ఈ సారి ఇక్కడ గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ పోటీ లో ఉన్నారు. ఆయన గత 2021 మార్చి ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఈ సారి ఎలాగైనా గెలుస్తామన్న ధీమాతో ఉన్న ఆయన ముమ్మరం చేశారు. మరో వైపు గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసిన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మరో మారు బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో ఆయన కేవలం 39,268 ఓట్లు మాత్రమే సాధించి నాలుగో స్థానంలో నిలిచిపోయారు. కానీ, ఈ సారి అందివచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దన్న లక్ష్యంతో ఉన్నారు. ప్రేమేందర్ రెడ్డి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నాయకుడే కావడం విశేషం.
లోక్ సభ ఎన్నికల ఊపును కొనసాగించాలని..
రాష్ట్రంలో జరిగిన లోక్ సభ ఎన్నికల వల్ల లభించిన ఊపును కొనసాగించి ఈ ఎన్నికల్లో బయట పడాలన్న వ్యూహంతో అభ్యర్థులు ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం మూడు జిల్లాల్లో విస్తరించి ఉండగా, ఇక్కడ ఆరు లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు మూడు పార్టీలూ నువ్వా నేనా అన్నట్టు ప్రచారం చేశాయి. లోక్ సభ ఎన్నికల ప్రచారం జరుగుతున్న క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. సోమవారం లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగియగా, ఈ నెల 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
నమోదు చేసుకున్న పట్టభద్రులు మాత్రమే ఓటర్లుగా ఉండే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ముందు నుంచే వ్యూహంతో ఉన్నాయి. పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించేందుకు పనిచేశాయి. ఇపుడు ఎన్నికల్లో ఓట్లు సాధించేందుకు ప్రచారం మొదలు పెట్టాయి. అయితే, పలువురు పట్టభద్రులు సైతం స్వతంత్రంగా బరిలోకి దిగారు. వీరిలో కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన నాయకుడు జడ్సన్ ఇండిపెండెంట్ గా పోటీలో ఉన్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులను ఆయన నుంచి గట్టి పోటీ ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మొత్తంగా 4.63 లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో పట్టభద్రులు ఎవరి వైపు నిలబడతారో అన్న చర్చ మొదలైంది.
( రిపోర్టింగ్ క్రాంతీపద్మ, HT TELUGU నల్గొండ )
సంబంధిత కథనం