Graduate Mlc election: వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎటు వైపు? మూడు పార్టీల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు-graduates which side the mlc candidates of the three parties have been finalized ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Graduate Mlc Election: వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎటు వైపు? మూడు పార్టీల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు

Graduate Mlc election: వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎటు వైపు? మూడు పార్టీల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు

HT Telugu Desk HT Telugu
May 09, 2024 10:36 AM IST

Graduate Mlc election: నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికకు మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి. ఎన్నికల్లో పట్టభధ్రులు ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తికరంగా మారింది.

వరంగల్ పట్టభద్రుల పీఠం ఎక్కేది ఎవరు
వరంగల్ పట్టభద్రుల పీఠం ఎక్కేది ఎవరు

Graduate Mlc election: పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్ రెడ్డి బరిలో నిలవగా.. బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మరోసారి అధిష్ఠానం అవకాశం కల్పించింది.

yearly horoscope entry point

హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం దామెరకు చెందిన ఆయన 2021లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి.. జనగామ ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయడంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కాగా.. ఉప ఎన్నికకు మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో గ్రాడ్యుయేట్ పోరు హోరాహోరీగా సాగనుంది.

ఇప్పటికే కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్ రెడ్డి నామినేషన్ వేయగా.. గురువారం బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు.

2021లో హోరాహోరీ

వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 2021 మార్చిలో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు, ఇండిపెండెంట్లు అందరూ కలిపి మొత్తంగా 76 మంది బరిలో నిలిచారు.

మొత్తంగా 5,05,565 మంది ఓట్లు ఉండగా.. అందులో 3,87,969 ఓట్లు పోలయ్యాయి. వివిధ కారణాలతో 21,636 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీ చేయగా.. కాంగ్రెస్ నుంచి రాములు నాయక్, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీ చేశారు. పోటీ మాత్రం అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి, ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మధ్యే జరిగింది.

ఆ ఎన్నికల్లో ఓవరాల్ గా పల్లా రాజేశ్వర్ రెడ్డికి 1,61,811 ఓట్లు రాగా.. తీన్మార్ మల్లన్నకు 1,49,005 ఓట్లు పోలయ్యాయి. దీంతో 12,806 ఓట్ల తేడాతో పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించి, రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తెలంగాణ జనసమితి నుంచి బరిలో నిలిచిన ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం 71,126 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.

బీజేపీ నుంచి పోటీ చేసిన ప్రేమేందర్ రెడ్డికి 39,306, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాములు నాయక్ కు 27,729 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులను వెనక్కి నెట్టి తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ అభ్యర్థికి గట్టి పోటీనివ్వగా.. తుది ఫలితాల వరకు ఉత్కంఠ కొనసాగింది. చివరకు ఎమ్మెల్సీగా పల్లా గెలవగా.. రెండో స్థానంలో తీన్మార్ మల్లన్న నిలిచారు.

12 జిల్లాలు.. 4.61 లక్షల ఓటర్లు

వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలోని 12 జిల్లాల పరిధిలో గత ఎన్నికల్లో 5 లక్షలకు పైగా ఓటర్లు నమోదు కాగా.. ఈ సారి మొత్తంగా 4,61,806 మంది ఓటర్లున్నట్లు అధికారులు ప్రకటించారు. వీరిలో 2,87,007 మంది పురుషులు కాగా.. 1,74,794 మంది మహిళలు, ఇతరులు ఐదుగురున్నారు.

మొత్తంగా 600 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కాగా ఈ ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో 80,559 మంది, సూర్యాపేటలో 51,293, భువనగిరిలో 33,926, ఖమ్మంలో 83,606, భద్రాద్రికొత్తగూడెంలో 39,898, భూపాలపల్లిలో 12,460, ములుగు 10,237, మహబూబాబాద్ 34,759, వరంగల్ 43,594, హనుమకొండ 43,483, జనగామ 23,320, సిద్దిపేటలో 4,671 మంది ఓటర్లు నమోదై ఉన్నారు.

ఎవరికి పట్టం కడతారో..

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై మూడు ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా, ఈసారి అధికార పార్టీ నుంచి బరిలో నిలిచిన తీన్మార్ మల్లన్న ఇప్పటికే ప్రచారాలు మొదలుపెట్టారు. జిల్లాల వారీగా టెలీ కాన్ఫరెన్సులు నిర్వహిస్తూ గ్రాడ్యుయేట్ల ఓపీనియన్స్ తెలుసుకుంటున్నారు. వారితో ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి కూడా తనవంతుగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆయనకు కొంత పట్టు ఉండగా.. ఎక్కువ ఓటర్లున్న ఖమ్మం, నల్గొండ జిల్లాలపై ఫోకస్ పెట్టారు. ఇక బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఇంకా ప్రచారం మొదలు పెట్టలేదు.

గ్రాడ్యుయేట్ ఎన్నికల్లోనైనా గెలిచి ఉనికిని చాటుకోవాలని బీఆర్ఎస్ భావిస్తుండగా.. బీజేపీలో కూడా అదే భావన వ్యక్తమవుతోంది. అధికార పార్టీ అయిన కాంగ్రెస్ లో కొంత జోష్ కనిపిస్తుండగా.. పట్టభద్రులు ఎటువైపు మొగ్గుచూపుతారో చూడాలి.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner

సంబంధిత కథనం