next Delhi CM: ఢిల్లీ తదుపరి సీఎం అతిషి యేనా? లేక భార్య సునీతకు కేజ్రీవాల్ అవకాశమిస్తారా?.. ఇంతకీ ఎవరీ అతిషి?
Who is Atishi?: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ కావడంతో, ఢిల్లీ తదుపరి సీఎం ఎవరనే విషయంపై చర్చ ప్రారంభమైంది. జైలు నుంచే కేజ్రీవాల్ పాలన సాగిస్తారన్న వాదన ఒక వైపు కొనసాగుతుండగా.. ఆప్ డైనమిక్ లీడర్ అతిషి మర్లెనాకి సీఎంగా అవకాశమిస్తారన్న వార్తలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.
Who is Atishi?: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయరని, అవసరమైతే జైలు నుండి తన ప్రభుత్వాన్ని నడపుతారని ఢిల్లీ మంత్రి అతిషి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఇతర నాయకులు చెబుతున్నారు. అయితే, జైలు నుంచి పాలన అంత ఆచరణసాధ్యమైన ఆలోచన కాదని న్యాయ నిపుణులు వాదిస్తున్నారు. ఎక్సైజ్ పాలసీ కేసులో గురువారం అరెస్టయిన కేజ్రీవాల్ ఈ నెల 28 వరకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉండనున్నారు.
కొత్త సీఎం ఎవరు?
ఒకవేళ, సీఎం పదవికి కేజ్రీవాల్ (Arvind Kejriwal) రాజీనామా చేస్తే, ఢిల్లీ తదుపరి సీఎం ఎవరు అవుతారన్న చర్చ దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా సాగుతోంది. కేజ్రీవాల్ తరువాత సీనియర్ నేతగా ఉన్న మనీశ్ సిసోడియా కూడా ఇదే కేసులో అరెస్టై జైళ్లో ఉన్న నేపథ్యంలో.. ఆమ్ ఆద్మీ పార్టీలో డైనమిక్ లీడర్ గా పేరు గాంచిన అతిషి మర్లెనా (Atishi Marlena) పేరు తదుపరి ఢిల్లీ సీఎంగా బలంగా వినిపిస్తోంది. అతిషి ప్రస్తుతం కేజ్రీవాల్ మంత్రివర్గంలో పలు కీలక శాఖలను నిర్వహిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సీఎం మార్పును ఖండించినప్పటికీ, రాబోయే రోజుల్లో ఢిల్లీ ఆర్థిక మంత్రి అతిషిమే సీఎం పదవితో పాటు పార్టీ పగ్గాలు చేపడతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
కేజ్రీవాల్ భార్య సునీతకు అవకాశం?
ఢిల్లీ తదుపరి సీఎంగా అతిషితో పాటు అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సతీమణి సునీత పేరు కూడా ఎక్కువగా వినిపిస్తోంది. కూడా వెలుగులోకి వచ్చారు. అయితే తన స్థానంలో ఢిల్లీ సీఎం పీఠంపై సునీతనే కేజ్రీవాల్ కూర్చోబెడ్తారని పలువురు ఆప్ నేతలు భావిస్తున్నారు. గతంలో దాణా కుంభకోణంలో అరెస్టైన సందర్భంలో బిహార్ సీఎంగా ఉన్న లాలు ప్రసాద్ యాదవ్, తన పదవికి రాజీనామా చేసి, ఆ పీఠంపై తన భార్య రబ్రీ దేవిని కూర్చోబెట్టిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. తన భార్య సునీతను ముఖ్యమంత్రిని చేసి, సీనియర్ నాయకురాలు, పాలనలో అనుభవం ఉన్న అతిషి (Atishi Marlena) కి ఇతర కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉందని పలువరు నేతలు భావిస్తున్నారు. లేదా, ముఖ్యమంత్రి బాధ్యత తన భార్య సునీతకు, పార్టీ బాధ్యత అతిషికి కేజ్రీవాల్ అప్పగిస్తారన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.
ఎవరీ అతిషి మర్లెనా?
అతిషి ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు విజయ్ కుమార్ సింగ్, త్రిప్తా వాహి దంపతులకు జన్మించారు. న్యూఢిల్లీలోని స్ప్రింగ్ డేల్ స్కూల్ లో ఆమె పాఠశాల విద్యను అభ్యసించారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో హిస్టరీ చదివిన ఆమె ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో చెవెనింగ్ స్కాలర్ షిప్ పై మాస్టర్స్ చేశారు. కొన్ని సంవత్సరాల తరువాత, ఆమె ఆక్స్ ఫర్డ్ నుండి ఎడ్యుకేషనల్ రీసెర్చ్ లో రోడ్స్ స్కాలర్ గా తన రెండవ మాస్టర్స్ ను పొందారు.
చిన్న గ్రామంలో ఏడేళ్లు..
అతిషి (Atishi Marlena) మధ్యప్రదేశ్ లోని ఒక చిన్న గ్రామంలో ఏడు సంవత్సరాలు గడిపింది, అక్కడ ఆమె సేంద్రీయ వ్యవసాయం, ప్రగతిశీల విద్యా విధానాలలో నిమగ్నమయ్యారు. అక్కడ పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసిన ఆమె తొలిసారిగా కొందరు ఆప్ సభ్యులను అక్కడే కలుసుకున్నారు.
రాజకీయ జీవితం
ఆప్ ఆవిర్భావ సమయంలోనే అతిషి (Atishi Marlena) ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ కమిటీలో కీలక సభ్యురాలిగా ఉన్నారు. పార్టీ ఆవిర్భావం తొలిదశలో పార్టీ విధానాలను రూపొందించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. అతిషి ఆప్ అధికార ప్రతినిధిగా తన ఉనికిని చాటుకున్నారు.
కల్కాజీ నియోజకవర్గం ఎమ్మెల్యే
ఢిల్లీలోని కల్కాజీ నియోజకవర్గం నుంచి అతిషి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమె ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యురాలుగా కూడా ఉన్నారు. ఇటీవల ఆమెను తూర్పు ఢిల్లీ లోక్ సభ నియోజకవర్గ విభాగానికి ఇన్ ఛార్జిగా నియమించారు. ఆప్ వెబ్ సైట్ లోని ఆమె ప్రొఫైల్ ప్రకారం, అతిషి 2018 ఏప్రిల్ వరకు అప్పటి విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియా సలహాదారుగా పనిచేశారు. దేశ రాజధానిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా స్థితిగతులను పునరుద్ధరించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న ఆప్ ముఖ్య నేతల్లో ఆమె ఒకరు.
కీలక శాఖల మంత్రిగా
కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తర్వాత 2023 మార్చి లో అతిషి మర్లెనా (Atishi Marlena) అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ క్యాబినెట్ లో అత్యధిక శాఖలను నిర్వహిస్తున్న ఏకైక మహిళా మంత్రి ఆమె. ప్రస్తుతం ఆమె ఆర్థిక, జల, విద్య, ప్రజాపనుల శాఖ, విద్యుత్, రెవెన్యూ, న్యాయ, ప్రణాళిక, సేవలు, సమాచార, ప్రచార, విజిలెన్స్ శాఖల మంత్రిగా అతిషి ఉన్నారు.