Kejriwal dares PM Modi: ‘రేపు మీ పార్టీ హెడ్ ఆఫీస్ కు వస్తాం.. ధైర్యముంటే అరెస్ట్ చేయండి’: మోదీకి కేజ్రీవాల్ సవాల్
Kejriwal dares PM Modi: ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు తాను, తనతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ అగ్ర నేతలంతా ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయానికి వస్తామని, తమను అరెస్ట్ చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీకి సవాల్ విసిరారు.
Kejriwal dares PM Modi: ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలతో కలిసి ఆదివారం (మే 19) భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్తానని, ధైర్యముంటే తామందరినీ అరెస్టు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు. స్వాతి మలివాల్ పై దాడి కేసులో తన అనుచరుడు బిభవ్ కుమార్ ను అరెస్టు చేసిన కొన్ని గంటల తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ఆప్ నేతలతో 'ప్రధాని మోదీ 'జైలు' ఆట ఆడుతున్నారని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
స్వాతి మలివాల్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు..
అక్రమ రిక్రూట్ మెంట్ కేసులో డీసీడబ్ల్యూ మాజీ చీఫ్ స్వాతి మలివాల్ అరెస్టు అయ్యే అవకాశముందని కేజ్రీవాల్ తెలిపారు. అరెస్ట్ ను బూచిగా చూపి కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా కుట్రలో భాగం కావాలని స్వాతి మలివాల్ ను బీజేపీ బ్లాక్ మెయిల్ చేస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఆప్ నేతలను జైలుకు పంపే గేమ్ ను ప్రధాని ఆడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, సంజయ్ సింగ్ వంటి ఆప్ నాయకులను జైలుకు పంపించారని తెలిపారు. త్వరలో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, ఢిల్లీ మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ లను కూడా బీజేపీ జైలుకు పంపుతుందని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
మీ పార్టీ ఆఫీస్ కు వస్తాం..
రేపు మధ్యాహ్నం 12 గంటలకు తనతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలంతా ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి వస్తామని, తమను అరెస్ట్ చేయాలని కేజ్రీవాల్ ప్రధానికి సవాలు విసిరారు. ‘‘మీరు మా అందరినీ జైల్లో పెట్టవచ్చు. అందరినీ జైలుకు పంపిన తర్వాత ఆప్ ను అణగదొక్కగలరని మీరు భావిస్తున్నారా? ఆప్ అనేది ఒక పార్టీ కాదు.. అది ఒక ఐడియా. దాన్ని అణచివేయడం సాధ్యం కాదు’’ అని కేజ్రీవాల్ ప్రధానికి సవాలు చేశారు. ‘‘ఆప్ అనేది ఒక ఆలోచన. మీరు ఎంత మంది ఆప్ నేతలను జైల్లో పెట్టినా అంతకు వంద రెట్లు ఎక్కువ నాయకులు తయారు అవుతారు’’ అన్నారు.
మంచి చేస్తుంటే చూడలేక..
ఢిల్లీలో తమ ప్రభుత్వం మంచి పాఠశాలలను నిర్మించడం, మొహల్లా క్లినిక్లను ఏర్పాటు చేయడం, ఉచితంగా చికిత్స అందించడం, నగరంలో 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేయడం.. బీజేపీ జీర్ణించుకోలేకపోతోందని కేజ్రీవాల్ మండిపడ్డారు. అది బీజేపీ చేయలేకపోయిందని, అందువల్ల ఆప్ ను నాశనం చేయాలనుకుంటోందని విమర్శించారు. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం కోసం ఆయనకు సుప్రీంకోర్టు జూన్ 1 వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేసింది. సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ ముగిసిన మరుసటి రోజైన జూన్ 2న సీఎం లొంగిపోయి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.