Electoral bonds : అత్యధిక ఎలక్టోరల్ బాండ్లు కొన్న ఈ ‘లాటరీ కింగ్’ ఎవరు?
Electoral bonds donors list : అత్యధిక ఎలక్టోరల్ బాండ్లు కొన్న లాటరీ కింగ్ ఎవరు? ఆయన కంపెనీ.. రాజకీయ పార్టీలకు ఎంత విరాళం ఇచ్చింది? ఇక్కడ తెలుసుకోండి..
Lottery King Santiago Martin : రాజకీయ విరాళాల కోసం ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన సంస్థల జాబితాను ఎన్నికల సంఘం.. తన వెబ్సైట్లో పెట్టింది. ఎస్బీఐ నుంచి వెలువడిన వివరాలను గురువారం ప్రకటించింది. ఇందులో.. "లాటరీ కింగ్" పేరు టాప్‌లో ఉండటం.. ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసింది. అశలు ఎవరు ఈ శాంటియాగో మార్టిన్? ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో.. రాజకీయ పార్టీలకు ఆయన కంపెనీ ఎంత డొనేట్ చేసింది? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
శాంటియాగో మార్టిన్ ఎవరు?
అత్యధిక ఎలక్టోరల్ బాండ్లు కొన్న శాంటియాగో మార్టిన్ చారిటబుల్ ట్రస్ట్ వెబ్సైట్ ప్రకారం.. ఆయన మయన్మార్‌లోని యాంగూన్‌లో సాధారణ కార్మికుడిగా తన వృత్తిని ప్రారంభించాడు. 1988లో ఇండియాకు తిరిగి వచ్చి.. తమిళనాడులో లాటరీ వ్యాపారం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కర్ణాటక, కేరళలో వ్యాపారాన్ని విస్తరించి.. ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లాడు.
ఈశాన్య రాష్ట్రాల్లో ప్రభుత్వ లాటరీ పథకాలను నిర్వహించడం ద్వారా తన వ్యాపారాన్ని విస్తరించుకున్నాడు శాంటియాగో మార్టిన్. ఆ తర్వాత భూటాన్, నేపాల్‌లలో సంస్థలను ప్రారంభించడం ద్వారా ఇతర వ్యాపారాల్లోకి అడుగుపెట్టాడు.
Santiago Martin electoral bonds : నిర్మాణం, రియల్ ఎస్టేట్, టెక్స్టైల్, హాస్పిటాలిటీ వంటి ఇతర వ్యాపారాల్లో లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ బిజినెస్ చేశాడని వెబ్సైట్ పేర్కొంది.
"అయను ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ లాటరీ ట్రేడ్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్‌కి అధ్యక్షుడు. భారతదేశంలో లాటరీ వాణిజ్యానికి విశ్వసనీయతను పెంపొందించడానికి, వ్యాపారాన్ని పెంచడానికి కృషి చేశారు. ఆయన నాయకత్వంలో, సంస్థ, ఫ్యూచర్ గేమింగ్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిష్ఠాత్మక వరల్డ్ లాటరీ అసోసియేషన్‌లో సభ్యత్వం పొందింది. ఆన్లైన్ గేమింగ్ అండ్ కాసినోస్, స్పోర్ట్స్ బెట్టింగ్ రంగంలోకి విస్తరిస్తోంది," అని వెబ్సైట్ పేర్కొంది.
ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్.. 2019-2024 మధ్య రూ.1368 కోట్లు విలువ చేసే ఎలక్టోరల్ బాండ్లు కొని.. రాజకీయ పార్టీలకు విరాళంగా ఇచ్చింది.
కంపెనీపై ఈడీ దర్యాప్తు..
Future Gaming and Hotel Services Private Limited : పీఎంఎల్ఏ చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. 2019 నుంచి ఈ ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై దర్యాప్తు చేస్తోంది. 2023 మేలో కోయంబత్తూరు, చెన్నైలో సోదాలు నిర్వహించింది.
ఈ కంపెనీ.. సిక్కిం ప్రభుత్వం నుంచి లాటరీలను కేరళలో విక్రయించిందని ఆరోపిస్తూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఛార్జిషీట్ చెబుతోంది.. సంబంధిత వర్గాలు హెచ్‌టీ తెలిపారు.
2009 ఏప్రిల్ నుంచి 2010 ఆగస్టు వరకు ప్రైజ్ విన్నింగ్ టికెట్ల క్లెయిమ్ ను పెంచడం వల్ల మార్టిన్, ఆయన కంపెనీలు సిక్కింకు రూ.910 కోట్ల నష్టం కలిగించాయని ఈడీ ఆరోపించింది.
ఎస్బీఐ జాబితాలోని ఇతర డోనర్లు..
మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్.. రూ.966 కోట్లు విరాళంగా ఇచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ఈ సంస్థ ప్రస్తుతం పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై పనిచేస్తోంది.
Electoral bonds Election commission : ఎన్నికల సంఘం అప్లోడ్ చేసిన సమాచారం ప్రకారం.. ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలుదారుల్లో స్పైస్ జెట్, ఇండిగో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, మేఘా ఇంజనీరింగ్, పిరమల్ ఎంటర్ప్రైజెస్, టొరెంట్ పవర్, భారతీ ఎయిర్టెల్, డీఎల్ఎఫ్ కమర్షియల్ డెవలపర్స్, వేదాంత లిమిటెడ్, అపోలో టైర్స్, ఎడెల్వీస్, పీవీఆర్, కెవెంటర్, సులా వైన్స్, వెల్స్పన్, సన్ ఫార్మా, వర్ధమాన్ టెక్స్టైల్స్ ఉన్నాయి. జిందాల్ గ్రూప్, ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్, సియట్ టైర్లు, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, ఐటీసీ, కైపీ ఎంటర్ప్రైజెస్, సిప్లా, అల్ట్రాటెక్ సిమెంట్ కూడా ఉన్నాయి.
అయితే.. ఈ కంపెనీలు ఏ రాజకీయ పార్టీకి డొనేట్ చేశాయి? అన్న వివరాలు డేటాలో లేవు.
సంబంధిత కథనం