New election commissioners: కొత్త ఎన్నికల కమిషనర్లుగా జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు
New election commissioners: లోక్ సభ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ.. ఎన్నికల నిర్వహణ బాధ్యతలు చేపట్టాల్సిన ఎన్నికల సంఘంలోకి కొత్తగా ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు వచ్చారు. బ్యూరోక్రాట్లు బల్బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్ లను ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్యానెల్ ఎన్నికల కమిషనర్లుగా ఎంపిక చేసింది.
New election commissioners: మాజీ బ్యూరోక్రాట్లు బల్బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్ లను ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కొత్త ఎన్నికల కమిషనర్లుగా ఎంపిక చేసిందని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి గురువారం తెలిపారు. అయితే ప్యానెల్ లో ప్రతిపక్ష సభ్యుడిగా ఉన్న అధిర్ రంజన్ చౌధురి తన అసమ్మతిని నమోదు చేసి, ఎలక్షన్ కమిషనర్ల ఎంపిక ప్రక్రియను ప్రశ్నించారు. షార్ట్ లిస్ట్ చేసిన అధికారుల పేర్లను తనకు ముందుగానే అందుబాటులో ఉంచలేదని ఆయన ఆరోపించారు. కాగా, ఎన్నికల కమిషనర్ గా ఎంపికైన మాజీ బ్యూరోకాట్ జ్ఞానేష్ కుమార్ 1988 బ్యాచ్ కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారి. ఆయన కేంద్ర సహకార శాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారు.
బల్బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్
సమావేశం ముగిసిన వెంటనే అధిర్ రంజన్ చౌదరి తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఎంపిక కోసం ఆరుగురు పేర్లు ప్యానెల్ ముందుకు వచ్చాయని, బల్బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్ పేర్లను హైపవర్ ప్యానెల్ లోని మెజారిటీ సభ్యులు ఖరారు చేశారని చెప్పారు. అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సెలెక్షన్ ప్యానెల్ లో ఉండాల్సిందని, న్యాయశాఖ మంత్రి నేతృత్వంలోని సెర్చ్ కమిటీ ముందు వచ్చినట్లు చెబుతున్న 200 మంది అభ్యర్థుల నుంచి ఆరుగురి పేర్లను ఎలా షార్ట్ లిస్ట్ చేశారనే దానిపై స్పష్టత లేదని ఆయన అన్నారు. ఈ ఎంపిక కోసం ఉత్పల్ కుమార్ సింగ్, ప్రదీప్ కుమార్ త్రిపాఠి, జ్ఞానేష్ కుమార్, ఇందేవర్ పాండే, సుఖ్బీర్ సింగ్ సంధు, సుధీర్ కుమార్ గంగాధర్ రహతే పేర్లను షార్ట్ లిస్ట్ చేశారు.
మెజారిటీ ఉందని…
‘‘వారికి (ప్రభుత్వానికి) మెజారిటీ ఉంది. గతంలో 212 మంది పేర్లు చెప్పారు. అపాయింట్ మెంట్ కు 10 నిమిషాల ముందు మళ్లీ ఆరు పేర్లు మాత్రమే చెప్పారు. ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి లేరని నాకు తెలుసు. సీజేఐ జోక్యం చేసుకోకుండా, కేంద్ర ప్రభుత్వం అనుకూలమైన పేరును ఎంచుకునేలా ప్రభుత్వం చట్టం చేసింది. ఇది ఏకపక్షమని నేను అనడం లేదు. కానీ అనుసరిస్తున్న విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయి" అని కాంగ్రెస్ నాయకుడు ఆధిర్ రంజన్ చౌధరి సెలెక్షన్ కమిటీ సమావేశం తర్వాత విలేకరుల సమావేశంలో అన్నారు.