Electoral Bonds Data 2024: సుప్రీంకోర్టు విధించిన గడువుకు ఒక రోజు ముందే ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds) డేటాను తన వెబ్‌సైట్‌లో ప్రచురించింది భారత ఎన్నికల సంఘం. మార్చి 12వ తేదీన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి డేటాను(SBI Electoral Bonds Data) స్వీకరించబడినట్లుగా ఈసీ పేర్కొంది. రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఎన్ని నిధులు అందాయి..? ఎన్ని బాండ్లు కొనుగోలు చేశారనే వివరాలతో కూడిన డేటాను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ డేటాకు సంబంధించి మార్చి 15 సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ వివరాలను రెండు పార్టులుగా వెల్లడించింది భారత ఎన్నికల సంఘం. పార్ట్ - 1,పార్ట్ -2 పేరుతో వెబ్ సైట్ లో ఉంచింది.
మొదటి పార్ట్ ను 337 పేజీలతో రూపొందించింది. రెండో జాబితాను 426 పేజీలతో అందుబాటులోకి తీసుకువచ్చింది. మొత్తం 763 పేజీలతో కూడిన డేటాను అందుబాటులో ఉంచింది భారత ఎన్నికల సంఘం.
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులను స్వీకరించిన జాబితాలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, అన్నాడీఎంకే, బీఆర్ఎస్, శివసేన, తెలుగుదేశం, YSR కాంగ్రెస్, DMK, జేడీఎస్, ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్, JDU, RJD, అమ్ అద్మీ, సమాజ్ వాదీ పార్టీలు ఉన్నాయి. ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన జాబితాలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్, మేఘా ఇంజినీరింగ్, టోరెంట్ పవర్, భారతీ ఎయిర్‌టెల్, DLF కమర్షియల్ డెవలపర్స్, వేదాంత లిమిటెడ్. అపోలో టైర్స్, లక్ష్మీ మిట్టల్, ఎడెల్వీస్, పివిఆర్, కెవెంటర్, సులా వైన్, వెల్స్పన్, సన్ ఫార్మా కంపెనీల పేర్లు ఉన్నాయి. అయితే ఈ జాబితాలో అదానీ కానీ రిలయన్స్ సంస్థల పేర్లు కనిపించలేదు.
వివాదాస్పద ఎలక్టోరల్ బాండ్ కేసులో మార్చి 11న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చి 13వ తేదీన కంప్లయన్స్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 15 వరకు కొనుగోలు చేసిన, రిడీమ్ చేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ తన అఫిడవిట్లో పంచుకుంది.