UGC Fellowship hike : యూజీసీ గుడ్ న్యూస్, ఫెలో షిప్ లు పెంచుతూ కీలక నిర్ణయం
UGC Fellowship hike : విద్యార్థులకు అందించే ఫెలో షిప్ లను యూజీసీ పెంచింది. పెంచిన ఫెలో షిప్ లు ఈ ఏడాది జనవరి 1 నుంచి వర్తిస్తుందని పేర్కొంది.
UGC Fellowship hike : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వివిధ ఫెలో షిప్ ల కింద అందించే ఆర్థికసాయాన్ని పెంచింది. ఇటీవల జరిగిన యూజీసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫెలోషిప్ ను పెంచే ప్రతిపాదనకు కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెంచిన ఫెలోషిప్ లు జనవరి 1, 2023 నుంచి వర్తిస్తాయని ప్రకటించింది. అయితే పెరిగిన ఫెలో షిప్ లు ప్రస్తుత లబ్ధిదారులకే లబ్ధి చేకూరుతుందని యూజీసీ పేర్కొంది. సెప్టెంబర్ 20న జరిగిన 572వ సమావేశంలో ఫెలోషిప్ సవరణకు యూజీసీ ఆమోదించింది.
ఫెలోషిప్ పెంపు
అయితే ఇప్పటి వరకూ యూజీసీ... జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కింద నెలకు రూ.31 వేల చొప్పున రెండేళ్లపాటు ఆర్థిక సాయం చేస్తుంది. ఈ మొత్తాన్ని రూ.37 వేలకు పెంచారు. సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కింద అందించే రూ.35 వేలను రూ.42 వేలకు పెంచారు. సావిత్రిబాయి జ్యోతిరావు ఫులే ఫెలోషిప్ ఫర్ సింగిల్ గర్ల్ చైల్డ్ కింద ఇచ్చే మొత్తానికి ఇది వర్తిస్తుందని యూజీసీ ప్రకటించింది. డీఎస్ కొఠారి పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్‌నకు రూ.47 వేల నుంచి రూ.54 వేల వరకు మూడేళ్లు ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని రూ.58 వేల నుంచి రూ.67 వేలకు పెంచారు. పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ చేసే మహిళలతో పాటు ఎస్సీ, ఎస్టీలకు ఇది వర్తిస్తుందని యూజీసీ తెలిపింది.
హెచ్ఆర్ఏ చెల్లింపు
పెంచిన ఫెలోషిప్ లు జనవరి 1, 2023 నుండి అమలులోకి వస్తాయని యూజీసీ తెలిపింది. ఇంటి అద్దె భత్యాన్ని (HRA) గణించే శాతం, వర్తించే చోట, ఫెలోషిప్ మొత్తంపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. యూజీసీ పథకాలలో ఫెలోషిప్ పెంపు ఇప్పటికే ఉన్న లబ్ధిదారులకు మాత్రమే వర్తిస్తాయి. ఇంటి అద్దె అలవెన్స్ (HRA) యూజీసీ నమూనాలోనే ఉంటుంది. హాస్టల్ వసతి కల్పించని విద్యార్థులకు హెచ్ఆర్ఏ చెల్లిస్తారు. విశ్వవిద్యాలయం/సంస్థ అందించే హాస్టల్ వసతి నిరాకరించబడినట్లయితే, విద్యార్థి తన హెచ్‌ఆర్‌ఏ, వైద్య సదుపాయాలు వంటి ఇతర సౌకర్యాలను కోల్పోతారు. వారి ఫెలోషిప్ ప్రోగ్రామ్ విషయంలో యూజీసీ మార్గదర్శకాల ప్రకారం ప్రసూతి సెలవులతో సహా సెలవులు నిర్ణయిస్తారు.