AP Capital : మూడు రాజధానులే అంటున్న జగన్..! ఏపీ ఓటరు తీర్పు ఏంటి..?
YSR Congress Party Manifesto 2024: వైసీపీ మళ్లీ మూడు రాజధానులకే(Three Capitals in AP) కట్టుబడి ఉన్నామని చెప్పేసింది. ఇదే విషయాన్ని తాజాగా విడుదల చేసిన మెనిఫెస్టోలో కూడా పొందుపర్చింది. మరోసారి అధికారంలోకి వస్తే… 3 రాజధానులను అభివృద్ధి చేస్తామని తెలిపింది.
YSR Congress Party Manifesto 2024: నవ్యాంధ్ర ఏర్పాటు నుంచి రాజధాని అంశంపై చర్చ జరుగుతూనే ఉంది. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం(TDP) పార్టీ… ఏపీకి కొత్త రాజధానిగా అమరావతిని ప్రకటించింది. ఇందుకోసం పెద్ద ఎత్తున భూసేకరణ జరగటంతో పాటు పలు భవనాలను కూడా నిర్మించింది. కట్ చేస్తే…. 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. అమరావతి (Amaravthi)అనేది అతిపెద్ద కుంభకోణమని బలంగా చెప్పే ప్రయత్నం చేసింది. అంతేకాదు… ఒక్కటి కాదు… ఏపీకి మూడు రాజధానులు ఉంటాయని స్పష్టమైన ప్రకటన కూడా చేసింది.
వైసీపీ వికేంద్రీకరణ నినాదం…
అధికారంలోకి వచ్చిన వైసీపీ…వికేంద్రీకరణ నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది. కేవలం ఒక్కచోటనే అభివృద్ధి జరగవద్దని…. కొత్తగా ఏర్పడిన నవ్యాంధ్ర మొత్తం అభివృద్ధి కావాలన్నదే తమ లక్ష్యమని చెప్పుకుంటూ వచ్చింది. ఇందులో భాగంగా… మూడు రాజధానులను తెరపైకి తీసుకొచ్చింది. పరిపాలన రాజధానిగా విశాఖ ఉంటుందని, శానస రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును చేస్తామని తెలిపింది. తద్వారా… అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగినట్లు అవుతుందని చెప్పింది. ఆయా ప్రాంతాల్లో భారీ ర్యాలీలను కూడా చేపట్టింది వైసీపీ. స్థానికంగా ఉన్న పలు సంఘాలు కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యేలా పలు కార్యక్రమాలను నిర్వహించింది.
జగన్ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత… తొలిసారిగా అంటే 2019 డిసెంబర్ 17వ తేదీన అసెంబ్లీ వేదికగా మూడు రాజధానుల(three capitals in ap)పై ప్రకటన చేశారు. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా పేరు ఉదహరిస్తూ…. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేస్తామమన్నారు. కర్నూలును న్యాయ రాజధానిగా ప్రతిపాదిస్తూ అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉంటుందని తెలిపారు. ఈ ప్రకటన తర్వాత… స్పీడ్ పెంచింది వైసీపీ. 2020 జనవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే ఏపీ పాలనా వికేంద్రీకరణ బిల్లును తీసుకొచ్చి ఆమోదముద్రవేశారు. అసెంబ్లీలో ఆమోదం పొందినప్పటికీ… మండలిలో బ్రేక్ పడినప్పటికీ…మరోసారి అసెంబ్లీ ముందుకు బిల్లును తీసుకొచ్చి ఆమోదముద్ర వేశారు. గవర్నర్ సంతకంతో 2020 సెప్టెంబర్‌లో మూడు రాజధానుల చట్టం రూపొందించారు. అయితే మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ.. అమరావతి ఉద్యమం తెరపైకి వచ్చింది. రాజధాని ప్రాంతంలోని రైతులు… ఆందోళనకు దిగారు. మూడు రాజధానులను సవాల్ చేస్తూ చాలా మంది కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ చట్టానికి న్యాయపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనిపై 2022లో ఏపీ హైకోర్టు కీలకమైన తీర్పునిచ్చింది. రాజధానులను మార్చే విషయంలో శాసనసభకు అధికారం లేదని స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సర్కార్… సుప్రీంను ఆశ్రయించినప్పటికీ ఊరట లభించలేదు. చివరగా మూడు రాజధానుల చట్టంపై వెనక్కి తగ్గింది ఏపీ ప్రభుత్వం. దీనిపై అసెంబ్లీ వేదికగా జగన్ ప్రకటన చేశారు. మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకుంటున్నామని తెలిపారు. అయితే ఈ సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. భవిష్యత్తులో మరింత బలంగా చట్టాన్ని తీసుకువస్తామని చెప్పుకొచ్చారు. తద్వారా… తమ విధానం మూడు రాజధానులే అని పరోక్షంగా మరోసారి చెప్పే ప్రయత్నం చేశారు.
గత ఏడాది కాలంగా పలు వేదికలపై మాట్లాడిన జగన్… విశాఖ నుంచి పాలన అంటూ స్పష్టమైన ప్రకటన చేశారు. మరోవైపు విశాఖనే రాజధాని అంటూ కొందరూ మంత్రులు చెబుతూ వచ్చారు. ఫలితంగా గత నాలుగేళ్లుగా ఏపీ రాజధాని అంశంపై చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా వైసీపీ విడుదల చేసిన మెనిఫెస్టోలో మూడు రాజధానుల విషయాన్ని ప్రస్తావించింది. మూడు రాజధానులే తమ వైఖరి అనే విషయాన్ని స్పష్టంగా మరోసారి చెప్పేసింది. విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఉంటుందని, అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని తెలిపింది. కర్నూలు న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తామని తెలిపింది. మరోసారి తాము అధికారంలోకి రాగానే…. ఈ రాజధానులను అభివృద్ధి చేస్తామని పేర్కొంది.
ఎన్నికల్లో కీలకంగా రాజధాని అంశం,,,
మేనిఫెస్టోలో మూడు రాజధానుల(three capitals) విషయాన్ని వైసీపీ ప్రస్తావించటంతో మరోసారి ఈ అంశంపై చర్చ మొదలైంది. ఈసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజధాని అంశం కూడా కీలకంగానే ఉంది. అయితే తాము అధికారంలోకి వస్తే తిరిగి అమరావతిని పునరుద్ధరిస్తామని చంద్రబాబుతో పాటు కూటమిలోని నేతలు ఉద్ఘాటించారు. మరోవైపు తమ నినాదం మాత్రం మూడు రాజధానులే అని వైసీపీ చెప్పటంతో…. నవ్యాంధ్ర ప్రజలు ఏటువైపు ఉంటారనేది కూడా ఆసక్తికరంగా మారింది. నిజానికి కూడా ఈ ఎన్నికల్లో కూటమి గెలిస్తే…. ఏపీ రాజదానిగా అమరావతి ఉంటుందని చెప్పటంలో ఎలాంటి సందేహాం లేదు. ఇక మరోసారి వైసీపీ వస్తే…. మూడు రాజధానుల దిశగానే అడుగులు వేస్తుంది. ఇలాంటి సమీకరణాల నేపథ్యంలో… ఏపీ ఓటర్లు ఇచ్చే తీర్పు ఏ దిశగా ఉంటుందనేది కొద్దిరోజుల్లోనే తేలిపోనుంది…!