Rishabh Pant Fit: రిషబ్ పంత్ ఫిట్.. ఎన్సీఏ క్లియరెన్స్.. 14నెలల తర్వాత మళ్లీ క్రికెట్‌లోకి..
Rishabh Pant Fit: టీమిండియా వికెట్ కీపర్ 14 నెలల తర్వాత మళ్లీ క్రికెట్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు బీసీసీఐ మంగళవారం (మార్చి 12) అధికారికంగా ప్రకటించింది.
Rishabh Pant Fit: క్రికెట్ చరిత్రలో అద్భుతమైన కమ్‌బ్యాక్ లలో ఇదీ ఒకటి. 14 నెలల కిందట కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, తృటిలో ప్రాణాలతో బయటపడిన టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ మళ్లీ క్రికెట్ ఫీల్డ్ లో అడుగుపెట్టబోతున్నాడు. అతడు 100 శాతం ఫిట్‌నెస్ సాధించినట్లు బీసీసీఐ మంగళవారం (మార్చి 12) అధికారికంగా ప్రకటించడం గమనార్హం.
రిషబ్ పంత్ వచ్చేస్తున్నాడు
డిసెంబర్ 30, 2022లో రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలు కావడంతో అప్పటి నుంచీ మూడు సర్జరీలు చేయించుకొని, కష్టమ్మీద తన కాళ్ల మీద తాను నిలబడుతూ, నడుస్తూ.. మొత్తానికి 14 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడేంత ఫిట్‌నెస్ సంపాదించాడు. చాలా రోజుల పాటు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడెమీలోనే ఉన్న పంత్.. మొత్తానికి ఫిట్‌గా ఉన్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది.
"డిసెంబర్ 20, 2022న రోడ్డు ప్రమాదంలో గాయపడి.. 14 నెలల పాటు కఠోరమైన రీహ్యాబిలిటేషన్, రికవరీ ప్రక్రియ తర్వాత రిషబ్ పంత్ ఇప్పుడు ఫిట్‌గా ఉన్నట్లు డిక్లేర్ చేస్తున్నాం. రానున్న ఐపీఎల్ 2024 ఆడటానికి అతడు సిద్ధంగా ఉన్నాడు" అని బీసీసీఐ సోసల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా ఉన్న పంత్.. తన తొలి మ్యాచ్ ను మార్చి 23న పంజాబ్ కింగ్స్ తో మొహాలీలో ఆడనున్నాడు.
కెప్టెన్ రిషబ్ పంతేనా?
రిషబ్ పంత్ పూర్తి ఫిట్ నెస్ సాధించినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించడంతో ఇప్పుడతడు ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా పూర్తి స్థాయిలో ఉంటాడా అన్న ప్రశ్నకు కూడా సమాధానం దొరికినట్లయింది. ఈ విషయం ఆ టీమ్ కోచ్ రికీ పాంటింగ్ కూడా ఈ మధ్యే స్పందించాడు. ఐసీసీ రివ్యూలో భాగంగా మాట్లాడిన పాంటింగ్.. పంత్ కెప్టెన్ గానే జట్టులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్పాడు.
"ఇది చాలా పెద్ద నిర్ణయం.ఎందుకంటే అతడు ఫిట్ గా ఉంటే నేరుగా కెప్టెన్ గానే మళ్లీ జట్టులోకి వస్తాడని అందరూ భావిస్తారు. అతడు పూర్తిగా ఫిట్ గా లేకపోతే, అతన్ని మరో రోల్ అప్పగించాలని మేము భావిస్తే మాత్రం మేము కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది" అని పాంటింగ్ చెప్పాడు. అయితే ఇప్పుడు బోర్డే అతన్ని పూర్తి ఫిట్ గా డిక్లేర్ చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణయంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
"అతడు గత రెండు వారాలుగా కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడాడు. అది మమ్మల్ని నిజంగా ఎంతో ప్రోత్సహించేదే. ఇప్పుడీ స్థాయి ఫిట్ నెస్ సాధించడానికి అతడు ఎంతలా కష్టపడ్డాడో నాకు తెలుసు. అతనితో ఫీల్డింగ్ చేయించాం. వికెట్ కీపింగ్ చేయించాం. బ్యాటింగ్ అయితే అసలు సమస్యే కాదు. అతడు ఐపీఎల్లోపు కోలుకుంటాడో లేదో అన్న సందేహాలు మాకు ఉండేవి" అని పాంటింగ్ అన్నాడు.
ఇప్పుడు బీసీసీఐ అధికారికంగా పంత్ ను ఫిట్ గా ఉన్నట్లు డిక్లేర్ చేయడం ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కే కాదు.. టీమిండియాకు కూడా ఎంతో ఊరట కలిగించేదే. 14 నెలలుగా ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ లో పంత్ సేవలను టీమిండియా మిస్ అయిందనే చెప్పాలి. ఇక ఐపీఎల్ ముగియగానే టీ20 వరల్డ్ కప్ కూడా ఉండటంతో ఈ మెగా లీగ్ లో పంత్ రాణించడం ఇండియన్ టీమ్ కు ఎంతో అవసరం.