Rishabh Pant: టీ20 ప్రపంచకప్‍లో రిషబ్ పంత్ ఆడతాడా?: బీసీసీఐ కార్యదర్శి జైషా చెప్పిన ఆన్సర్ ఇదే
Rishabh Pant - T20 World Cup 2024: భారత స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్.. త్వరలోనే మళ్లీ మైదానంలోకి బరిలోకి దిగనున్నాడు. అతడు ఐపీఎల్ ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‍లో పంత్ ఆడతాడా లేదా అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో బీసీసీఐ కార్యదర్శి జైషా ఈ విషయంపై మాట్లాడారు.
Rishabh Pant - Jay Shah: ప్రస్తుతం క్రికెట్ అభిమానుల దృష్టి అంతా భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‍పైనే ఉంది. ఐపీఎల్ 2024 టోర్నీలో అతడు బరిలోకి దిగడం దాదాపు ఖరారైంది. గాయాల నుంచి పూర్తి కోలుకున్న పంత్ ఫిట్‍గా కనిపిస్తున్నాడు. బ్యాటింగ్, వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. 2022 డిసెంబర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు పంత్. అప్పటి నుంచి ఆటకు దూరమయ్యాడు. ఇప్పుడు కోలుకోవడంతో ఐపీఎల్ 2024లో అతడు బరిలోకి దిగేందుకు రెడీ అయ్యాడు. అయితే, ఈ ఏడాది జూన్‍లో జరగనున్న టీ20 ప్రపంచకప్‍లో పంత్ ఆడతాడా అనే సందేహాలు ఉన్నాయి.
రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యాక పంత్‍కు సర్జరీ కూడా జరిగింది. అయితే, అతడు తీవ్రంగా శ్రమించి వేగంగా కోలుకున్నాడు. కొన్నాళ్లుగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో ఉంటున్నాడు. అయితే, ఐపీఎల్ 2024 సీజన్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ పంత్ బరిలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మార్చి 22న ఈ ఏడాది ఐపీఎల్ మొదలుకానుంది. ఈ తరుణంలో పంత్ విషయంపై బీసీసీఐ కార్యదర్శి జైషా స్పందించారు. ఈ విషయంలో అప్‍డేట్ ఇచ్చారు.
బ్యాటింగ్, కీపింగ్ చేస్తున్నాడు
రిషబ్ పంత్ ప్రస్తుతం బ్యాటింగ్, వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడని జైషా వెల్లడించారు. అతడు టీ20 ప్రపంచకప్ ఆడితే టీమిండియాకు పెద్ద ప్లస్ అవుతుందని అన్నారు. “పంత్ ప్రస్తుతం బాగున్నాడు. బ్యాటింగ్, వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. త్వరలోనే మేం అతడిని పూర్తి ఫిట్‍గా ప్రకటిస్తాం. ఒకవేళ అతడు టీ20 ప్రపంచకప్ ఆడగలిగితే.. అతి పెద్ద విషయంగా ఉంటుంది. అతడు చాలా పెద్ద అసెట్” అని పీటీఐతో జైషా చెప్పారు.
కీపింగ్ చేస్తేనే టీ20 ప్రపంచకప్‍లో..
కీపింగ్ చేయగలిగితేనే టీ20 ప్రపంచకప్‍లో రిషబ్ పంత్ ఆడతాడని జైషా స్పష్టం చేశారు. “ఒకవేళ కీపింగ్ చేయగలిగితే.. అతడు ప్రపంచకప్ ఆడతాడు. ఐపీఎల్‍లో అతడు ఎలా ఉంటాడో చూడాలి” అని జైషా వెల్లడించారు.
ఐపీఎల్ 2024 సీజన్‍లో మార్చి 23న తన తొలి మ్యాచ్‍ను పంజాబ్ కింగ్స్ జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడనుంది. 15 నెలల విరామం తర్వాత బరిలోకి దిగనున్న పంత్‍కు ఢిల్లీ వెంటనే కెప్టెన్సీ ఇస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంది. అయితే, కీపింగ్ చేయకుండా కేవలం బ్యాటర్‌లానే కొన్ని ఐపీఎల్ మ్యాచ్‍లను పంత్ ఆడతాడని కూడా టాక్ వినిపిస్తోంది. ఫిట్‍నెస్‍ను బట్టి కీపింగ్, కెప్టెన్సీ విషయాలపై ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‍మెంట్ నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది.
ఎన్‍సీఏలో రిషబ్ పంత్ కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్‍లు ఆడాడు. బ్యాటింగ్‍తో పాటు వికెట్ కీపింగ్ కూడా చేశాడు. ఈ ఏడాది సీజన్ మొత్తం పంత్ ఆడతాడని ఇటీవల ఆశాభావం వ్యక్తం చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కోచ్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్.
గతేడాది ఐపీఎల్ 2023 సీజన్‍కు పంత్ దూరమవడంతో ఢిల్లీ జట్టుకు డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ చేశాడు. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంతో ఢిల్లీ గతేడాది నిరాశ పరిచింది.
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ 2024 జూన్‍లో జరగనుంది. వెస్టిండీస్, అమెరికా వేదికగా ఈ మెగాటోర్నీ జరుగుతుంది.