IPL 2024: రిషబ్ పంత్‍ విషయంలో కీలకంగా ‘మార్చి 5’: గంగూలీ చెప్పిన విషయాలు ఇవే-ipl 2024 news only after march 5 delhi capitals director sourav ganguly on rishabh pant captaincy ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2024: రిషబ్ పంత్‍ విషయంలో కీలకంగా ‘మార్చి 5’: గంగూలీ చెప్పిన విషయాలు ఇవే

IPL 2024: రిషబ్ పంత్‍ విషయంలో కీలకంగా ‘మార్చి 5’: గంగూలీ చెప్పిన విషయాలు ఇవే

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 02, 2024 05:35 PM IST

IPL 2024 - Rishabh Pant: ఈ ఏడాది ఐపీఎల్‍లో రిషబ్ పంత్ ఆడతాడా లేదా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ క్రమంలో ఈ విషయంపై ఢిల్లీ క్యాపిటర్స్ జట్టు డైరెక్టర్ సౌరవ్ గంగూలీ కీలక విషయాలను వెల్లడించారు.

రిషబ్ పంత్
రిషబ్ పంత్ (PTI)

IPL 2024 - Delhi Capitals: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ మళ్లీ మైదానంలోకి బరిలోకి దిగేందుకు శ్రమిస్తున్నాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడు.. ఇప్పుడిప్పుడే పూర్తిగా కోలుకుంటున్నాడు. ఇటీవలే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఈ ఏడాది ఐపీఎల్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తరఫున పంత్ మళ్లీ ఆడే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. పంత్ బరిలోకి దిగితే ఢిల్లీకి ఐపీఎల్ 2024 సీజన్‍లో చాలా ప్లస్ కానుంది. అయితే, ఈ విషయంపై టీమిండియా మాజీ కెప్టెన్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు డైరెక్టర్ సౌరవ్ గంగూలీ కీలక విషయాలు వెల్లడించారు.

2022 డిసెంబర్‌లో జరిగిన కారు ప్రమాదంలో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి క్రికెట్‍‍కు దూరమయ్యాడు. గతేడాది ఐపీఎల్ కూడా ఆడలేదు. జాతీయ క్రికెట్ ఆకాడమీ(NCA)లోనే పంత్ కోలుకుంటున్నాడు. కొంతకాలంగా వికెట్ కీపింగ్, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు రిషబ్ పంత్. దీంతో మార్చి 22న మొదలయ్యే ఐపీఎల్ 2024 సీజన్‍లో పంత్ ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, పంత్ విషయంలో ఎన్‍సీఏ క్లియరెన్స్ కోసం తాను ఎదురుచూస్తున్నామని సౌరవ్ గంగూలీ తాజాగా చెప్పారు.

మార్చి 5వ తేదీన ఎన్‍సీఏ నుంచి పంత్‍కు క్లియరెన్స్ రావాల్సి ఉందని, ఆ తర్వాత ఈ సీజన్‍లో అతడికి కెప్టెన్సీ ఇవ్వడం గురించి ఆలోచిస్తామని తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాతో చెప్పాడు సౌరవ్ గంగూలీ. ఈ సీజన్ మొత్తానికి అతడు అందుబాటులో ఉంటే జట్టుకు చాలా మేలని దాదా అన్నాడు. “రిషబ్ పంత్ పూర్తి ఫిట్‍గా రావడం మాకు చాలా బలాన్ని చేకూరుస్తుంది. అతడు పూర్తి సీజన్ ఆడాలని మేం కోరుకుంటున్నాం. ఎందుకంటే అతడు చాలా స్పెషల్ ప్లేయర్. అన్ని ఫార్మాట్లలో రాణించిన కొందరు దేశవాళీ ఆటగాళ్లను గుర్తించాం. అయితే, రిషబ్ చాలా ముఖ్యం” అని గంగూలీ చెప్పాడు.

ఆ తర్వాతే కెప్టెన్సీపై నిర్ణయం

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్సీని రిషబ్ పంత్ కొనసాగిస్తాడా.. లేదా అనే విషయంపై సౌరవ్ గంగూలీ క్లారిటీ ఇవ్వలేదు. ఎన్‍సీఏ నుంచి అనుమతి వచ్చాకే ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఎన్‍సీఏ క్లియరెన్స్ వచ్చాక డీసీ క్యాంప్‍లోకి పంత్ వస్తాడని తెలిపాడు.

“పూర్తి ఫిట్‍నెస్ సాధించేందుకు చేయాల్సిందల్లా పంత్ చేసేశాడు. అందుకే ఎన్‍సీఏ క్లియరెన్స్ ఇస్తుంది. మార్చి 5న అతడు క్లియరెన్స్ పొందాలి. ఆ తర్వాత కెప్టెన్సీ బ్యాకప్ గురించి మేం మాట్లాడతాం. అతడికి మున్ముందు సుదీర్ఘ కెరీర్ ఉండటంతో చాలా జాగ్రత్త వహిస్తాం. ఏదో తొందరలో అతడిపై ఒత్తిడి పెట్టం. ఎన్‍సీఏ క్లియరెన్స్ ఇచ్చాక అతడు క్యాంప్‍లో జాయిన్ అవుతాడు. మ్యాచ్ మ్యాచ్‍కు అతడిని చూస్తాం” అని గంగూలీ చెప్పాడు.

పంత్ గతేడాది ఐపీఎల్ ఆడకపోవటంతో ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్సీ చేశాడు. అయితే, గత సీజన్‍లో ఢిల్లీ రాణించలేకపోయింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచి నిరాశపరిచింది.

ఒకవేళ రిషబ్ పంత్ కేవలం బ్యాటర్‌గా ఆడినా.. తమ వద్ద వేరే వికెట్ కీపింగ్ ఆప్షన్లు ఉన్నాయని సౌరవ్ గంగూలీ చెప్పారు. “వికెట్ కీపింగ్ ఆప్షన్ల విషయానికి వస్తే కుమార్ కుషాగ్ర ఉన్నాడు. రికూ భుయ్, షాయ్ హోప్, ట్రిస్టన్ స్టబ్స్ ఉన్నారు” అని గంగూలీ వెల్లడించారు. ఈ సీజన్‍లో పంత్‍ను వికెట్ కీపింగ్ చేయించకుండా బ్యాటర్‌లా ఆడించాలని ఢిల్లీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

ఐపీఎల్ 2024 సీజన్ తొలి దశ షెడ్యూల్‍ను బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. మార్చి 22వ తేదీన టోర్నీ షూరూ కానుంది. తొలి 21 మ్యాచ్‍ల షెడ్యూల్‍ వెల్లడైంది. ఆ తర్వాతి మ్యాచ్‍ల షెడ్యూల్‍ను బీసీసీఐ త్వరలో ప్రకటించనుంది.