Rishabh Pant: నేనెప్పుడూ ఏడవలేదు.. ఏడవను.. స్క్రిప్ట్ మార్చండి: రిషబ్ పంత్ యాడ్ షూట్ వైరల్
Rishabh Pant: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ యాడ్ షూట్ లో పాల్గొన్న అతడు.. తానెప్పుడూ ఏడవలేదు.. ఏడవను అని స్పష్టంగా చెబుతుండటం విశేషం.
Rishabh Pant: కారు ప్రమాదానికి గురైన తర్వాత ఏడాదికిపైగా క్రికెట్ కు దూరమైన ఇప్పుడు ఐపీఎల్ ఆడటానికి సిద్ధమవుతున్నాడు వికెట్ కీపర్ రిషబ్ పంత్. అయితే ఈ మెగా లీగ్ కంటే ముందు చేయాల్సిన ఓ యాడ్ షూట్ విషయంలో డైరెక్టర్ ఇచ్చిన స్క్రిప్ట్ పై పంత్ మండిపడ్డాడు. తాను ఎప్పుడూ ఏడవలేదని, ఏడవబోనని.. స్క్రిప్ట్ మార్చాల్సిందిగా అసిస్టెంట్ డైరెక్టర్ కు చెబుతున్న వీడియో బయటకు వచ్చింది.
రిషబ్ పంత్ వైరల్ వీడియో
ఈ మధ్యే ఓ అసిస్టెంట్ డైరెక్టర్ పై హార్దిక్ పాండ్యా మండిపడిన ఘటన మరవక ముందే అలాంటిదే రిషబ్ పంత్ కు చెందిన వీడియో బయటకు వచ్చింది. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అయిన పంత్.. ఈ సీజన్ మొత్తం ఆడాలని ప్లాన్ చేస్తున్నాడు. దీనికోసం మొదట అన్ని జట్ల కెప్టెన్లు యాడ్ షూట్లో పాల్గొంటారు. అలా పంత్ కూడా ఓ షూట్ లో పాల్గొనాల్సి ఉండగా.. అతడు స్క్రిప్ట్ పై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
బహుశా తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకొని మళ్లీ ఇన్నాళ్ల తర్వాత క్రికెట్ లోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆ ఎమోషన్ ను క్యాష్ చేసుకోవాలని నిర్వాహకులు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే దీనికి పంత్ మాత్రం అంగీకరించలేదు. నన్నెప్పుడైనా ఏడుస్తున్నప్పుడు చూశారా.. నేను ఏడవలేదు. ఏడవను.. వెళ్లి డైరెక్టర్ తో చెప్పి స్క్రిప్ట్ మార్చమని పంత్ ఓ అసిస్టెంట్ డైరెక్టర్ కు చెబుతున్నట్లు వీడియోలో స్పష్టమవుతోంది.
ఐపీఎల్ ప్రమోషనల్ వీడియో
ఐపీఎల్ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. దీంతో దానికి ముందు స్టార్ ఓ ప్రమోషనల్ వీడియో రూపొందిస్తోంది. కానీ ఈ వీడియో స్క్రిప్ట్ పంత్ కు అస్సలు నచ్చలేదు. తాను సెంటీ కాబోనని, ఎమోషనల్ కానని, స్క్రిప్ట్ మార్చాల్సిందే అని పదేపదే పంత్ చెప్పడం ఆ వీడియోలో చూడొచ్చు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.
ఈ మధ్యే హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఇలాంటి వీడియోనే సోషల్ మీడియాలోకి వచ్చింది. యాడ్ షూట్ సమయంలో తనకు జిలేబీ, డోక్లాలాంటి ఆహారాలను లంచ్ కు ఇవ్వడంతో హార్దిక్ సహనం కోల్పోయాడు. అసిస్టెంట్ డైరెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో వైరల్ అయింది. పంత్ ఏడాదికిపైనే ఇండియన్ టీమ్ కు దూరంగా ఉండగా.. గతేడాది వరల్డ్ కప్ లో గాయపడిన హార్దిక్ ఇప్పటి వరకూ మళ్లీ ఆడలేదు.
ఈ ఇద్దరూ ఐపీఎల్ తో మళ్లీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో అప్పటిలోగా ఫిట్‌నెస్ సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. హార్దిక్ ఈసారి ముంబై ఇండియన్స్ కు కెప్టెన్సీ చేపట్టనుండగా.. రిషబ్ మరోసారి తన ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కు కెప్టెన్ గా తిరిగి రానున్నాడు. ఈ సీజన్ లో అతడు ప్రతి మ్యాచ్ ఆడటానికి సిద్ధంగా ఉన్నట్లు ఆ టీమ్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ గతంలో వెల్లడించాడు. ఐపీఎల్ తొలి దశ షెడ్యూల్ ప్రకారం మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకూ 21 మ్యాచ్ లు జరగనున్నాయి.