BCCI: భారత ప్లేయర్లకు బంపర్ ఆఫర్.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ-bcci announces test cricket incentive scheme for indian cricketers explained ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Bcci: భారత ప్లేయర్లకు బంపర్ ఆఫర్.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ

BCCI: భారత ప్లేయర్లకు బంపర్ ఆఫర్.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 09, 2024 04:06 PM IST

BCCI - Test Cricket Incentives: టెస్టు క్రికెట్ కోసం ప్రత్యేక ఇన్సెంటివ్‍లను బీసీసీఐ ప్రకటించింది. సంప్రదాయ ఫార్మాట్ ఆడే విధంగా ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇన్సెంటివ్‍లు ఎలా ఉండనున్నాయంటే..

BCCI: భారత ప్లేయర్లకు బంపర్ ఆఫర్.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ
BCCI: భారత ప్లేయర్లకు బంపర్ ఆఫర్.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ (PTI)

BCCI: ప్రస్తుత టీ20 యుగంలో టెస్టు క్రికెట్ ఆడేందుకు కొందరు ఆటగాళ్లు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఎక్కువగా ధనాధన్ ఫార్మాట్‍పైనే దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు యువ ప్లేయర్లు టెస్టు సిరీస్‍లపై ఎక్కువగా దృష్టి పెట్టడం లేదు. ఇది గుర్తించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టెస్టు క్రికెట్ ఆడేలా ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు “టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్‍ స్క్రీమ్”ను ప్రవేశపెట్టింది. ఎక్కువ టెస్టులు ఆడే ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజుకు అదనంగా భారీ ప్రత్యేక ప్రోత్సహకాలను ప్రకటించింది.

ఇన్సెంటివ్ ఎంతంటే..

ఓ సీజన్‍లో 75 శాతం కంటే ఎక్కువ టెస్టు మ్యాచ్‍లు ఆడిన ఆటగాళ్లకు.. ఒక్కో టెస్టుకు మ్యాచ్ ఫీజుకు అదనంగా రూ.45లక్షలను బీసీసీఐ చెల్లించనుంది. అలాగే, ఆ సీజన్‍లో 50 శాతం కంటే ఎక్కువ టెస్టులు ఆడిన ప్లేయర్లకు ఒక్కో టెస్టుకు రూ.22.5లక్షలను ఇన్సెంటివ్‍ను అదనంగా ఇవ్వనుంది.

ప్రస్తుతం ఒక్కో టెస్టుకు ప్రతీ ఆటగాడికి రూ.15లక్షల మ్యాచ్ ఫీజు ఉంది. సీజన్‍లో 75 శాతం టెస్టుల కంటే ఎక్కువగా ఆడితే.. మ్యాచ్‍ ఫీజుకు అదనంగా ఇన్సెంటివ్‍గా ప్రతీ మ్యాచ్‍కు రూ.45లక్షలు, 50 శాతం దాటితే అదనంగా రూ.22.5లక్షలు ఆటగాళ్లకు దక్కనున్నాయి. ఒకవేళ ఆ సీజన్‍లో 50 శాతం కంటే తక్కువ టెస్టులు ఆడితే.. ఆ ఆటగాడికి అదనపు ఇన్సెంటివ్‍ లేకుండా మ్యాచ్ ఫీజు మాత్రమే దక్కుతుంది. 2022-23 సీజన్ నుంచే దీన్ని వర్తింపజేస్తామని బీసీసీఐ కార్యదర్శి జైషా నేడు వెల్లడించారు.

“సీనియర్ పురుషుల టీమ్ కోసం టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్ ప్రారంభిస్తున్నామని చెప్పేందుకు సంతోషిస్తున్నా. ఆటగాళ్లకు ఆర్థికపరమైన వృద్ధి, స్థిరత్వాన్ని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. 2022-23 సీజన్ నుంచి ప్రస్తుతం ఉన్న మ్యాచ్ ఫీజు రూ.15లక్షలపై అదనపు చెల్లింపుగా ఇది ఉంటుంది” అని జైషా నేడు (మార్చి 9) ట్వీట్ చేశారు.

ఇటీవలి కాలంలో కొందరు యువ ఆటగాళ్లు టెస్టు క్రికెట్‍పై విముఖంగా ఉన్నట్టు బీసీసీఐ దృష్టికి వచ్చింది. టీ20లు, లీగ్‍ల హవా కొనసాగుతుండటంతో వాటినే లక్ష్యంగా కొందరు ప్లేయర్లు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో టెస్టు క్రికెట్ ఆడేందుకు ప్రోత్సహించేలా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

సిరీస్ భారత్ కైవసం

స్వదేశంలో ఇంగ్లండ్‍తో జరిగిన టెస్టు సిరీస్‍లో టీమిండియా దుమ్మురేపింది. 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇంగ్లిష్ జట్టు బజ్‍బాల్‍ను చిత్తుచేసింది. ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్టులో నేడు (మార్చి 9) ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. మూడో రోజు ఇంగ్లండ్‍ను రెండో ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే భారత బౌలర్లు కుప్పకూల్చారు. టీమిండియాకు ఏ మాత్రం పోటీని ఇవ్వలేకపోయింది ఇంగ్లండ్.

ఈ మ్యాచ్‍లో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 218 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత భారత్ ఏకంగా 477 రన్స్ చేసి భారీ ఆధిక్యాన్ని సాధించింది. ఆ తర్వాత ఇంగ్లండ్ 195 పరుగులకే చాపచుట్టేసింది. కేవలం 48 ఓవర్లలోనే ఆలౌటైంది. ఈ సిరీస్‍లో తొలి మ్యాచ్ ఓడిన రోహిత్ శర్మ సేన.. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకొని 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది.

ఇక తదుపరి ఐపీఎల్‍లో ప్లేయర్లు బరిలోకి దిగనున్నారు. మార్చి 22న ఐపీఎల్ 2024 టోర్నీ మొదలుకానుంది.

IPL_Entry_Point