RCB vs SRH: రికార్డుల హోరుతో సన్‍రైజర్స్ గ్రాండ్ విక్టరీ.. కార్తీక్ అద్భుత పోరాటం.. 549 పరుగులతో కొత్త చరిత్ర-rcb vs srh ipl 2024 sunrisers hyderabad records shattering performance beat royal challengers bengaluru ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rcb Vs Srh: రికార్డుల హోరుతో సన్‍రైజర్స్ గ్రాండ్ విక్టరీ.. కార్తీక్ అద్భుత పోరాటం.. 549 పరుగులతో కొత్త చరిత్ర

RCB vs SRH: రికార్డుల హోరుతో సన్‍రైజర్స్ గ్రాండ్ విక్టరీ.. కార్తీక్ అద్భుత పోరాటం.. 549 పరుగులతో కొత్త చరిత్ర

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 15, 2024 11:22 PM IST

RCB vs SRH IPL 2024: చిన్నస్వామి స్టేడియంలో రికార్డుల హోరుతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై సన్‍రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఈ సీజన్‍లో హ్యాట్రిక్ విజయంతో జోష్‍ను కంటిన్యూ చేసింది. ఐపీఎల్‍లో అత్యధిక స్కోరు రికార్డును మరోసారి లిఖించి అద్భుతం చేసింది ఎస్‍ఆర్‌హెచ్.

RCB vs SRH: రికార్డుల హోరుతో సన్‍రైజర్స్ గ్రాండ్ విక్టరీ.. కార్తీక్ అద్భుత పోరాటం.. 549 పరుగులతో కొత్త చరిత్ర
RCB vs SRH: రికార్డుల హోరుతో సన్‍రైజర్స్ గ్రాండ్ విక్టరీ.. కార్తీక్ అద్భుత పోరాటం.. 549 పరుగులతో కొత్త చరిత్ర (PTI)

RCB vs SRH IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ (SRH) మరోసారి దుమ్మురేపింది. ధనాధన్ బ్యాటింగ్‍తో పరుగుల సునామీ సృష్టించి.. ఐపీఎల్‍ చరిత్రలో అత్యధిక స్కోరు రికార్డును ఈ సీజన్‍లో మరోసారి సాధించింది. దీంతో చిన్నస్వామి స్టేడియంలో నేడు (ఏప్రిల్ 15) జరిగిన మ్యాచ్‍లో హైదరాబాద్ 25 పరుగుల తేడాతో హోం టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై గ్రాండ్ విక్టరీ సాధించింది.

ఎస్ఆర్‌హెచ్ విధ్వంసం

ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‍రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 287 పరుగుల కొండంత స్కోరు చేసింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల రికార్డును సాధించింది. ఎస్ఆర్‌హెచ్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ (41 బంతుల్లో 102 పరుగులు; 9 ఫోర్లు, 8 సిక్స్‌లు) మెరుపు శకతం చేయగా.. హెన్రిచ్ క్లాసెన్ (31 బంతుల్లో 67 పరుగులు; 2 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరిపించాడు. అబ్దుల్ సమద్ (10 బంతుల్లో 37 పరుగులు నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) చివర్లో రెచ్చిపోయాడు. ఐడెన్ మార్క్‌రమ్ (17 బంతుల్లో 32 పరుగులు నాటౌట్) అదరగొట్టాడు. మొత్తంగా సన్‍రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు మెరుపు హిట్టింగ్‍తో చిన్నస్వామి స్టేడియాన్ని మోతెక్కించారు. బెంగళూరు బౌలర్లలో లూకీ ఫెర్గ్యూసన్ రెండు, రీస్ టాప్లీ ఓ వికెట్ తీశారు. అయితే, ఆర్సీబీ బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఐదుగురు బౌలర్లు 50 కంటే ఎక్కువ పరుగులు ఇచ్చుకున్నారు.

కార్తీక్ విరోచిత పోరాటం

పర్వతమంత లక్ష్యఛేదనలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 262 పరుగులు చేయగలిగింది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (20 బంతుల్లో 42 పరుగులు) ఉన్నంతసేపు దూకుడుగా ఆడాడు. మరో ఓపెనర్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (28 బంతుల్లో 62 పరుగులు) ధనాధన్ హాఫ్ సెంచరీ చేశాడు. వీరి తర్వాత విల్ జాక్స్ (7), రజత్ పాటిదార్ (9), సౌరవ్ చౌహాన్ (0) విఫలమవడంతో బెంగళూరుకు భారీ పరాజయం తప్పదని భావించారు. అప్పుడు స్టార్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ వీరోచిత పోరాటం చేశాడు.

35 బంతుల్లోనే 83 పరుగులతో దినేశ్ కార్తీక్ మెరిపించాడు. తన మార్క్ వెరైటీ షాట్లతో భారీ హిట్టింగ్ చేశాడు. 5 ఫోర్లు, 7 సిక్సర్లతో దుమ్మురేపాడు డీకే. కాసేపు హైదరాబాద్ బౌలర్లలో టెన్షన్ పెంచాడు. అయితే, మరో ఎండ్ నుంచి సహకారం లభించకున్నా కార్తీక్ మాత్రం పోరాడాడు. 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత కూడా దూకుడుగా ఆడాడు. 108 మీటర్ల పాటు బంతిని బాది.. ఈ సీజన్‍లో లాంగెస్ట్ సిక్స్ సాధించాడు కార్తీక్. అయితే, 19వ ఓవర్ చివరి బంతికి ఔటయ్యాడు.

సన్‍రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మూడో వికెట్లతో రాణించాడు. స్పిన్నర్ మయాంక్ మార్కండే రెండు వికెట్లు తీశాడు. ఏడో ఓవర్లో విరాట్ కోహ్లీని ఔట్ చేసి బ్రేక్ త్రూ ఇచ్చాడు. నటరాజన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.

549 పరుగులతో హిస్టరీ

టీ20 చరిత్రలో ఒకే మ్యాచ్‍లో అత్యధిక పరుగుల రికార్డు నమోదైంది. ఈ మ్యాచ్‍లో రెండు జట్లు కలిపి 549 రన్స్ చేశాయి. ఈ ఐపీఎల్ 2024 సీజన్‍లోనే మార్చి 27న హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన పోరులో 523 పరుగులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ రికార్డు బ్రేక్ అయింది. హైదరాబాద్, బెంగళూరు మధ్య నేటి మ్యాచ్‍లో 549 పరుగులు వచ్చాయి. దీంతో ఐపీఎల్‍లోనే కాకుండా ఓవరాల్ టీ20 చరిత్రలోనే ఓ మ్యాచ్‍లో అత్యధిక రన్స్ రికార్డు నమోదైంది.

ఎస్ఆర్‌హెచ్ హ్యాట్రిక్ గెలుపు

సన్‍రైజర్స్ హైదరాబాద్ వరుసగా మూడో గెలుపుతో హ్యాట్రిక్ కొట్టింది. దీంతో ఈ సీజన్‍లో ఇప్పటి వరకు 6 మ్యాచ్‍ల్లో 4 గెలిచి ప్రస్తుతం 8 పాయింట్లతో ఉంది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇక 7 మ్యాచ్‍ల్లో 6 ఓడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చివరిదైన 10వ స్థానంలో కొనసాగింది.

హైదరాబాద్ రికార్డులు

ఈ మ్యాచ్‍తో ఐపీఎల్‍లో అత్యధిక స్కోరు రికార్డును తన పేరిట లిఖించుకుంది సన్‍రైజర్స్ హైదరాబాద్. తన రికార్డును తానే తిరిగిరాసింది. మార్చి 27న ముంబైపై 277 రన్స్ చేసి అత్యధిక స్కోరు నమోదు చేసింది ఎస్ఆర్‌హెచ్. అది జరిగిన 20 రోజుల్లోనే బెంగళూరుతో ఈ మ్యాచ్‍లో 287 రన్స్ చేసి దాన్ని తిరగరాసింది. ఐపీఎల్‍లో కొత్త అత్యధిక పరుగుల రికార్డును సాధించింది. అలాగే, ఐపీఎల్‍లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్ (22)ల రికార్డును కూడా దక్కించుకుంది. టీ20 చరిత్రలో రెండుసార్లు 250కు పైగా రన్స్ చేసిన తొలి జట్టుగా నిలిచింది హైదరాబాద్.

IPL_Entry_Point