SRH Records: అత్యధిక స్కోరు, సిక్స్‌లు: సన్‍రైజర్స్ హైదరాబాద్ సృష్టించిన 5 రికార్డులు ఇవే
Sunrisers Hyderabad Records - RCB vs SRH: సన్‍రైజర్స్ హైదరాబాద్ మరోసారి రికార్డులను బద్దలుకొట్టేసింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‍లో దుమ్మురేపే బ్యాటింగ్‍తో రెచ్చిపోయింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరుతో పాటు మరిన్ని రికార్డులను తన పేరిట లిఖించుచుకుంది. ఆ వివరాలివే..
SRH IPL Records: ఐపీఎల్ 2024లో సన్‍రైజర్స్ హైదరాబాద్ మరోసారి హిస్టరీ సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల రికార్డును తన పేరిట లిఖించుకుంది. చిన్నస్వామి స్టేడియంలో పరుగుల సునామీ సృష్టించి.. కొన్ని రికార్డులను ముంచేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో నేడు (ఏప్రిల్ 15) జరిగిన మ్యాచ్‍లో హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 287 పరుగులతో అద్భుతం చేసింది. ఐపీఎల్‍లో అత్యధిక స్కోరు రికార్డును సృష్టించిన 20 రోజుల్లోనే మళ్లీ తానే బద్దలుకొట్టేసింది. ట్రావిస్ హెడ్ (41 బంతుల్లో 102 పరుగులు) సెంచరీతో దుమ్మురేపగా.. హెన్రిచ్ క్లాసెన్ (31 బంతుల్లో 67 పరుగులు), అబ్దుల్ సమాద్ (10 బంతుల్లో 37 రన్స్; నాటౌట్) అదరగొట్టారు. ఈ మ్యాచ్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ సృష్టించిన రికార్డులు ఇవే.
అత్యధిక స్కోరు
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు రికార్డును సన్‍రైజర్స్ హైదరాబాద్ మరోసారి తన పేరిట లిఖించుకుంది. బెంగళూరుతో ఈ మ్యాచ్‍తో 287 రన్స్ చేసింది ఎస్‍ఆర్‌హెచ్. ఈ 2024 సీజన్‍లోనే మార్చి 27న ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‍లో ముంబై ఇండియన్స్‌పై 277 పరుగులు చేసి ఐపీఎల్ హిస్టరీలో హయ్యస్ట్ స్కోరు రికార్డును హైదరాబాద్ సాధించింది. 263 పరుగుల 11 ఏళ్ల బెంగళూరు రికార్డును బద్దలుకొట్టింది. అయితే, ఈ సీజన్‍లోనే 20 రోజుల వ్యవధిలోనే సన్‍రైజర్స్ హైదరాబాద్ మరోసారి తన రికార్డు తానే తిరగరాసింది. బెంగళూరుతో నేడు 287 పరుగులు చేసి.. ఐపీఎల్‍లో అత్యధిక స్కోరు రికార్డు సాధించింది. ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఎస్‍ఆర్‌హెచ్ ఉండగా.. మూడో ప్లేస్‍లో కోల్‍కతా నైట్ రైడర్స్ (272) ఉంది. కేకేఆర్ కూడా ఈ సీజన్‍లోనే ఆ స్కోరు చేసింది.
అత్యధిక సిక్స్‌లు
ఐపీఎల్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌ల రికార్డును కూడా ఈ మ్యాచ్‍లో కొల్లగొట్టింది సన్‍రైజర్స్ హైదరాబాద్. ఈ మ్యాచ్‍లో ఎస్‍ఆర్‌హెచ్ బ్యాటర్లు ఏకంగా 22 సిక్సర్లు బాదేశారు. 2013లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఒకే ఇన్నింగ్స్‌లో 21 సిక్స్‌లు కొట్టి టాప్ ప్లేస్‍లో ఉండగా.. హైదరాబాద్ దాన్ని ఇప్పుడు బద్దలుకొట్టింది. ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డును దక్కించుకుంది.
రెండు సార్లు 250కు పైగా..
ఐపీఎల్ చరిత్రలో 250కు పైగా స్కోర్లను రెండుసార్లు చేసిన తొలి జట్టుగా సన్‍రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. ఈ సీజన్‍లోనే రెండుసార్లు అద్భుతాలను చేసింది.
టీ20 హిస్టరీలో రెండో హెయ్యెస్ట్
అంతర్జాతీయ, లీగ్‍లు మొత్తంగా టీ20 చరిత్రలోనే రెండో అత్యధిక స్కోరును సన్‍రైజర్స్ హైదరాబాద్ సాధించింది. నేపాల్ గతేడాది ఏషియన్ గేమ్స్ టోర్నీలో మంగోలియాపై 314 పరుగులు చేసి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఈ మ్యాచ్‍లో హైదరాబాద్ 284 రన్స్ చేసి.. టీ20 చరిత్రలో రెండో అత్యధిక స్కోరు నమోదు చేసింది.
ఈ ఫీట్ సాధించిన తొలిజట్టుగా..
ఓవరాల్ టీ20 చరిత్రలో రెండుసార్లు 270కుపైగా పరుగులు చేసిన తొలి జట్టుగా సన్‍రైజర్స్ నిలిచింది.
హెడ్ రికార్డు
ఈ మ్యాచ్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ 39 బంతుల్లోనే సెంచరీ చేశాడు. దీంతో ఎస్‍ఆర్‌హెచ్ తరఫున అత్యధిక వేగంగా శతకం చేసిన బ్యాటర్‌గా రికార్డు సాధించాడు.