KKR vs RCB: అయ్యో ఆర్సీబీ.. ఉత్కంఠ పోరులో ఒక్క పరుగు తేడాతో ఓడిన బెంగళూరు.. వరుసగా ఆరో ఓటమి - అంపైర్లపై కోహ్లీ ఆగ్రహం-rcb lose by one run against kkr in thrilling match in ipl 2024 virat kohli shows anger on umpires about his dismisal ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Kkr Vs Rcb: అయ్యో ఆర్సీబీ.. ఉత్కంఠ పోరులో ఒక్క పరుగు తేడాతో ఓడిన బెంగళూరు.. వరుసగా ఆరో ఓటమి - అంపైర్లపై కోహ్లీ ఆగ్రహం

KKR vs RCB: అయ్యో ఆర్సీబీ.. ఉత్కంఠ పోరులో ఒక్క పరుగు తేడాతో ఓడిన బెంగళూరు.. వరుసగా ఆరో ఓటమి - అంపైర్లపై కోహ్లీ ఆగ్రహం

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 21, 2024 07:52 PM IST

KKR vs RCB IPL 2024: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మరో ఓటమి ఎదురైంది. ఉత్కంఠ పోరులో ఒక్క పరుగు తేడాతో కోల్‍కతా చేతిలో ఆర్సీబీ పరాజయం పాలైంది.

KKR vs RCB: అయ్యో ఆర్సీబీ.. ఉత్కంఠ పోరులో ఒక్క పరుగు తేడాతో ఓడిన బెంగళూరు.. వరుసగా ఆరో ఓటమి - అంపైర్లపై కోహ్లీ ఆగ్రహం
KKR vs RCB: అయ్యో ఆర్సీబీ.. ఉత్కంఠ పోరులో ఒక్క పరుగు తేడాతో ఓడిన బెంగళూరు.. వరుసగా ఆరో ఓటమి - అంపైర్లపై కోహ్లీ ఆగ్రహం (AFP)

KKR vs RCB IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఓటముల పరంపర కొనసాగింది. కోల్‍కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుతో నేడు జరిగిన మ్యాచ్‍లో ఒక్క పరుగు తేడాతో బెంగళూరు ఓటమి పాలైంది. ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా నేడు (ఏప్రిల్ 21) జరిగిన ఉత్కంఠ పోరులో ఆర్సీబీ పరాజయం చెందింది. ఈ సీజన్‍లో బెంగళూరుకు వరుసగా ఇది ఆరో పరాజయంగా ఉంది. 8 మ్యాచ్‍ల్లో ఏడో ఓటమి.

ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‍కతా నైట్‍రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఫిల్ సాల్ట్ (14 బంతుల్లో 48 పరుగులు; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (50) హాఫ్ సెంచరీ చేశాడు. చివర్లో రమణ్‍దీప్ సింగ్ (9 బంతుల్లో 24 పరుగులు నాటౌట్) దూకుడుగా ఆడాడు. బెంగళూరు బౌలర్లలో యశ్ దయాల్, కామెరూన్ గ్రీన్ తలా రెండు వికెట్లు తీశారు. మహమ్మద్ సిరాజ్, లూకీ ఫెర్గ్యూసన్‍ చెరో వికెట్ తీసుకున్నారు.

అనంతరం లక్ష్యఛేదనలో 20 ఓవర్లలో 221 పరుగులకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆలౌలైంది. విల్ జాక్స్ (32 బంతుల్లో 55 పరుగులు; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), రజత్ పటిదార్ (23 బంతుల్లో 52 పరుగులు; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) ధనాధన్ ఆటతో అర్ధ శతకాలు చేశారు. వీరిద్దరి దూకుడుతో ఆర్సీబీ సునాయాసంగానే గెలుస్తుందనిపించింది. అయితే, వారిద్దరూ ఔటయ్యాక కష్టాల్లో పడింది. దినేశ్ కార్తీక్ (25) కాసేపు నిలువగా.. చివర్లో కర్ణ్ శర్మ (7 బంతుల్లో 20 పరుగులు) మూడు సిక్స్‌లతో గెలుపు ఆశలు చిగురింపజేసి ఔటయ్యాడు. కోల్‍కతా బౌలర్లలో ఆండ్రే రసెల్ మూడు వికెట్లతో సత్తాచాటాడు. హర్షిత్ రాణా, సునీల్ నరైన్ తలా రెండు, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి చెరో ఓ వికెట్ పడగొట్టారు.

చివరి ఓవర్లో మూడు సిక్సర్లు కొట్టినా..

బెంగళూరు గెలవాలంటే చివరి ఓవర్లో 21 పరుగులు చేయాల్సి వచ్చింది. అయితే, కోల్‍కతా పేసర్, ఐపీఎల్ చరిత్రలో ఖరీదైన ప్లేయర్ మిచెల్ స్టార్క్ వేసిన ఆ ఓవర్లో తొలి బంతికే బెంగళూరు బ్యాటర్ కర్ణ్ శర్మ సిక్స్ బాదాడు. ఆ తర్వాత డాట్ బాల్ పడింది. అనంతరం తర్వాతి రెండు బంతులకు రెండు సిక్సర్లు కొట్టి అదరగొట్టాడు కర్ణ్ శర్మ. దీంతో చివరి రెండు బంతులకు ఆర్సీబీ మూడు రన్స్ చేయాల్సి వచ్చింది. గెలిచేలా కనిపించింది. ఆ సమయంలో కర్ణ్ శర్మ ఔటయ్యాడు. చివరి బంతికి మూడు పరుగులు చేయాల్సి వచ్చింది. లాస్ట్ బాల్‍కు ఓ పరుగు పూర్తి చేసి.. రెండో పరుగు తీసే ప్రయత్నంలో లూకీ ఫెర్గ్యుసన్ రనౌట్ అయ్యాడు. దీంతో చివరి వరకు పోరాడి బెంగళూరు ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది.

అంపైర్లపై కోహ్లీ ఆగ్రహం

ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (18) ఈ మ్యాచ్‍లో అంపైర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేకేఆర్ పేసర్ హర్షిత్ రాణా వేసిన మూడో ఓవర్ తొలి బంతికి కోహ్లీ ఔటయ్యాడు. ఆ బంతి హై ఫుట్ టాస్‍గా రాగా.. హర్షిత్‍కే విరాట్ క్యాచ్ ఇచ్చాడు. అయితే, థర్డ్ అంపైర్ ఆ హైఫుల్ టాస్ బంతిని నోబాల్‍గా ప్రకటించలేదు. కోహ్లీ నడుము కంటే కిందే ఆ ఫుల్‍టాస్ ఉందని భావించి ఔట్‍గా ప్రకటించాడు. దీంతో కోహ్లీ ఫీల్డ్ అంపైర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అది నో బాల్ కాదా.. అంటూ వాదించాడు. ఆ తర్వాత కోపంగా పెవిలియన్‍పైపుగా నడుచుకుంటూ వెళ్లాడు. కోహ్లీ క్రీజు బయట ఉండటంతో థర్డ్ అంపైర్ దాన్ని నోబాల్ ఇవ్వలేదు. మ్యాచ్ తర్వాత కూడా అంపైర్లతో విరాట్ కోహ్లీ వాదించాడు.

ఆర్సీబీకి ఇక ప్లేఆఫ్స్ కష్టమే..

ఈ ఐపీఎల్ 2024 సీజన్‍లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‍ల్లో ఏడు ఓడింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరిదైన ఆఖరి స్థానంలో ఉంది. దీంతో ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరడం ఇక కష్టమే. మిగిలిన ఆరు మ్యాచ్‍లు గెలిస్తేనే.. కాస్త అవకాశం ఉండొచ్చు. ఇక, ఏడు మ్యాచ్‍ల్లో ఐదు గెలిచిన కోల్‍కతా 10 పాయింట్లను దక్కించుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది.

IPL_Entry_Point