PM Modi on Shami: భారత పేసర్ మహమ్మద్ షమీ గురించి ట్వీట్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. రిప్లై ఇచ్చిన స్టార్-prime minister narendra modi wishes indian star pacer mohammed shami speedy recovery ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Pm Modi On Shami: భారత పేసర్ మహమ్మద్ షమీ గురించి ట్వీట్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. రిప్లై ఇచ్చిన స్టార్

PM Modi on Shami: భారత పేసర్ మహమ్మద్ షమీ గురించి ట్వీట్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. రిప్లై ఇచ్చిన స్టార్

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 27, 2024 03:08 PM IST

PM Narendra Modi on Mohammed Shami: భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీకి శస్త్ర చికిత్స జరిగింది. ఈ సందర్భంగా ఈ విషయంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

నరేంద్ర మోదీ
నరేంద్ర మోదీ (ANI)

Mohammed Shami: భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ కొంతకాలంగా కాలి చీలమండ గాయంతో జట్టుకు దూరంగా ఉంటున్నాడు. గతేడాది వన్డే ప్రపంచకప్‍లో అద్భుత బౌలింగ్ చేసి టోర్నీలో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచిన షమీ.. ఆ తర్వాత టీమిండియా తరఫున మళ్లీ బరిలోకి దిగలేదు. వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్, దక్షిణాఫ్రికా పర్యటన, ఇంగ్లండ్‍తో టెస్టు సిరీస్‍ ఆడలేకపోయాడు. గాయం నయమైనట్టు అనిపించటంతో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‍కు ఎంపిక చేసినా.. ఇంకా తగ్గకపోవటంతో వెళ్లలేకపోయాడు. అయితే, షమీ గాయానికి శస్త్రచికిత్స అవసరమైంది. దీంతో అతడు తాజాగా సర్జరీ చేయించుకున్నాడు.

షమీ ఎడమ కాలి మడమకు శస్త్రచికిత్స జరిగింది. తనకు జరిగిన సర్జరీ విజయవంతం అయిందని మహమ్మద్ షమీ వెల్లడించాడు. తాను బెడ్‍పై ఉన్న ఫొటోలను పోస్ట్ చేశాడు. షమీకి శస్త్రచికిత్స గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు ట్వీట్ చేశారు.

నమ్మకం ఉంది

గాయాన్ని షమీ త్వరగా అధిగమిస్తారని తనకు నమ్మకం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. “మీరు (మహమ్మద్ షమీ) త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యం పొందాలని కోరుకుంటున్నా. మీలోని ధైర్యంతో గాయాన్ని అధిగమిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది” అని మోదీ ట్వీట్ చేశారు.

స్పందించిన షమీ

ప్రధాని మోదీ ట్వీట్‍కు మహమ్మద్ షమీ స్పందించాడు. ప్రధాని తన గురించి వ్యక్తిగతంగా ట్వీట్ చేయడం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేశాడు. “నేను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా తెలుపడం చాలా సర్‌ప్రైజ్‍గా ఉంది. ఆయన దయ, ఆలోచన విధానం నాకు ఎంతో అమూల్యమైనవి. ఇలాంటి సమయంలో నాకు విషెస్, మద్దతు తెలిపిన మోదీ సర్‌కు ధన్యవాదాలు. నేను కోలుకునేందుకు పూర్తిస్థాయిలో నిరంతరం కష్టపడతా. మీ నిరంతర ప్రేమ, మద్దతు పట్ల చాలా ధన్యవాదాలు” అని షమీ రిప్లై ఇచ్చాడు.

ఐపీఎల్‍కు దూరం

శస్త్రచికిత్స జరగడంతో మహమ్మద్ షమీ కనీసం మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీకి అతడు పూర్తిగా దూరం కానున్నాడు. మార్చి 22వ తేదీన ఐపీఎల్ 2024 టోర్నీ మొదలుకానుంది. షమీ దూరం కావడం గుజరాత్ టైటాన్స్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. 2022లో గుజరాత్ టైటిల్ గెలిచేందుకు, గతేడాది ఫైనల్ వరకు చేరడంలో షమీ కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్‍కు అతడు దూరం కావడం టైటాన్స్ టీమ్‍కు పెద్ద ఇబ్బందే.

గుజరాత్ టైటాన్స్ జట్టుకు గత రెండేళ్లు కెప్టెన్సీ చేసిన హార్దిక్ పాండ్యా.. మళ్లీ ముంబై ఇండియన్స్ జట్టుకు వెళ్లిపోయాడు. దీంతో గుజరాత్‍కు ఐపీఎల్ 2024లో శుభ్‍మన్ గిల్ కెప్టెన్సీ చేయనున్నాడు. ఈ తరుణంలో సీనియర్ స్టార్ పేసర్ మహమ్మద్ షమీ కూడా దూరం కావటంతో ఈ ఏడాది సీజన్‍‍లో గుజరాత్‍కు పెద్ద ఎదురుదెబ్బే.

టీ20 ప్రపంచకప్‍కైనా..?

ఈ ఏడాది జూన్‍లో వెస్టిండీస్, అమెరికా వేదికలుగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగాటోర్నీకైనా టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ సిద్ధమవుతాడా లేదా అనేది సందిగ్ధంగా మారింది. షమీ మాత్రం ఆ టోర్నీ లక్ష్యంగా సిద్ధమయ్యేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. మరి జూన్ కల్లా షమీ పూర్తిగా కోలుకుంటాడేమో చూడాలి.

Whats_app_banner