Mohammed Shami Surgery: వరల్డ్ కప్ 2023లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచిన తర్వాత మళ్లీ ఫీల్డ్ లో కనిపించలేదు మహ్మద్ షమి. తాజాగా ఇప్పుడతడు తన మడమ గాయానికి సర్జరీ చేయించుకున్నట్లు వెల్లడించాడు. తాను హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫొటోలను అతడు సోషల్ మీడియా ఎక్స్ లో షేర్ చేశాడు. ఈ సర్జరీతో అతడు ఐపీఎల్ 2024 మొత్తానికి దూరం కానున్నాడు.
మహ్మద్ షమి గతేడాది వరల్డ్ కప్ లో 24 వికెట్లు తీసి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. అయితే ఆ వరల్డ్ కప్ ఫైనల్లో ఆడిన తర్వాత షమి మళ్లీ క్రికెట్ ఫీల్డ్ లో కనిపించలేదు. ఆ వరల్డ్ కప్ లోనే మడమ గాయానికి గురైన షమి.. సుమారు మూడున్నర నెలలుగా టీమిండియాకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్, ఇంగ్లండ్ సిరీస్ లకు దూరమయ్యాడు.
గాయం ఎంతకీ మానకపోవడంతో సర్జరీ తప్పదన్న నేషనల్ క్రికెట్ అకాడెమీ ఫిజియోల సూచన మేరకు షమి.. తాజాగా మడమకు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ సర్జరీతో అతడు ఐపీఎల్ 2024 మొత్తానికి దూరమయ్యాడు. దీంతో గుజరాత్ టైటన్స్ కు గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే వాళ్ల కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కు వెళ్లిపోయాడు.
ఇప్పుడు స్టార్ బౌలర్ షమి కూడా మొత్తం సీజన్ కు దూరమయ్యాడు. దీంతో 2022 ఛాంపియన్, గతేడాది రన్నరప్ అయిన గుజరాత్ టైటన్స్ బలహీన పడింది. 33 ఏళ్ల షమి తనకు సర్జరీ అయిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించినా.. మళ్లీ క్రికెట్ లో ఎప్పుడు అడుగుపెడతాడన్నది మాత్రం చెప్పలేదు.
టీ20 వరల్డ్ కప్ కు మరో మూడు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీకి కూడా షమి దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. తన తాజా ప్రకటనలో షమి ఏమన్నాడంటే.. "నా మడమ కండర గాయానికి విజయవంతంగా సర్జరీ చేయించుకున్నాను. కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. కానీ సాధ్యమైనంత త్వరగా నా కాళ్లపై నిలబడాలని అనుకుంటున్నా" అని అన్నాడు.
మడమ గాయానికి గురైనప్పటి నుంచీ షమి నేషనల్ క్రికెట్ అకాడెమీలో కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే గాయం తీవ్రత పెరిగిందే తప్ప తగ్గలేదు. సర్జరీ లేకుండా గాయం నుంచి బయటపడాలని చూసినా ఫలితం లేకపోయింది. ఈ సమయంలో సర్జరీ చేయించుకోవడం అంటే రెండు మెగా టోర్నీలకు షమి దూరమయ్యే పరిస్థితి నెలకొంది.
జూన్ 1 నుంచి జూన్ 29 వరకూ కరీబియన్ దీవులు, అమెరికాల్లో టీ20 వరల్డ్ కప్ 2024 జరగనుంది. ఇండియా తన తొలి మ్యాచ్ ను జూన్ 5న ఐర్లాండ్ తో ఆడనుంది. జూన్ 11న పాకిస్థాన్ తో న్యూయార్క్ లో తలపడుతుంది. గతేడాది వన్డే వరల్డ్ కప్ లో మహ్మద్ షమి 7 మ్యాచ్ లలోనే 24 వికెట్లతో చెలరేగిన విషయం తెలిసిందే.