IPL 2024: గుజరాత్ టైటాన్స్‌కు షాక్.. ఐపీఎల్ నుంచి స్టార్ పేసర్ షమీ ఔట్! కారణమిదే..-ipl 2024 mohammed shami ruled out of indian premier league 17th season big blow for gujarat titans ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2024: గుజరాత్ టైటాన్స్‌కు షాక్.. ఐపీఎల్ నుంచి స్టార్ పేసర్ షమీ ఔట్! కారణమిదే..

IPL 2024: గుజరాత్ టైటాన్స్‌కు షాక్.. ఐపీఎల్ నుంచి స్టార్ పేసర్ షమీ ఔట్! కారణమిదే..

IPL 2024 - Mohammed Shami: ఐపీఎల్ 2024 సీజన్‍కు స్టార్ పేసర్ మహమ్మద్ షమీ దూరం కానున్నాడని తెలుస్తోంది. ఇది గుజరాత్ టైటాన్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బగా మారింది.

IPL 2024: గుజరాత్ టైటాన్స్‌కు షాక్.. ఐపీఎల్ నుంచి స్టార్ పేసర్ షమీ ఔట్!

IPL 2024 - Mohammed Shami: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 17వ సీజన్ కోసం పది జట్లు సిద్ధమవుతున్నాయి. మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ 2024 టోర్నీ మొదలవుతుందని కూడా సమాచారం బయటికి వచ్చింది. ఈ తరుణంలో గతేడాది రన్నరప్‍గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ఐపీఎల్ 2024 టోర్నీ మొత్తానికి దూరం కానున్నాడని తెలుస్తోంది. ప్రధాన బౌలర్‌ షమీ లేకపోవడం గుజరాత్ టీమ్‍కు ఈ సీజన్‍లో చాలా ఇబ్బందిగా మారనుంది.

చీలమండ గాయం అవడం, శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి ఉండటంతో ఐపీఎల్ 2024 సీజన్‍కు షమీ దూరం కానున్నాడని బీసీసీఐ విశ్వసనీయ వర్గాలు చెప్పినట్టు న్యూస్ ఏజెన్సీ పీటీఐ వెల్లడించింది. బ్రిటన్‍లో షమీకి సర్జరీ జరగాల్సిన అవసరం ఉందని, ఈ కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ అతడు ఆడలేడని వెల్లడించినట్టు పేర్కొంది. ఈ సీజన్‍లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఇది షాక్‍గా మారింది.

2022లో ఐపీఎల్‍లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ అద్భుతమైన ప్రదర్శన చేసింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో 2022లో టైటిల్ గెలిచిన ఆ జట్టు.. గతేడాది సీజన్‍లో ఫైనల్ వరకు వెళ్లి రన్నరప్‍గా నిలిచింది. ఈ రెండు సీజన్లలోనూ గుజరాత్ గెలుపుల్లో పేసర్ మహమ్మద్ షమీ కీలకపాత్ర పోషించాడు. 2022 సీజన్‍లో షమీ 20 వికెట్లను పడగొట్టగా.. 2023 సీజన్‍లో 28 వికెట్లను దక్కించుకొని మరింత సత్తాచాటాడు.

హార్దిక్ పాయె.. ఇప్పుడు షమీ

గుజరాత్ టైటాన్స్ జట్టును రెండు సీజన్ల పాటు అద్భుతంగా నడిపిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ఐపీఎల్ 2024 సీజన్ కోసం మళ్లీ ముంబై ఇండియన్స్ జట్టుకు వెళ్లాడు. ముంబై అతడిని ట్రేడ్ చేసుకొని తీసుకెళ్లి.. కెప్టెన్‍ను చేసింది. హార్దిక్ వెళ్లిపోవటంతో ఈ సీజన్‍లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు శుభ్‍మన్ గిల్ కెప్టెన్సీ చేయననున్నాడు. ఇప్పుడు స్టార్ పేసర్ మహమ్మద్ షమీ కూడా లేకపోతే ఈ సీజన్‍లో గుజరాత్‍కు మరింత ఇబ్బందే.

గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‍లో టీమిండియా తరఫున మహమ్మద్ షమీ చెలరేగాడు. టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. భారత్ ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. అయితే, గాయం ఉన్నా ప్రపంచకప్‍లో షమీ అలాగే ఆడాడని తెలుస్తోంది. ప్రపంచకప్ తర్వాతి నుంచి టీమిండియాకు షమీ దూరంగానే ఉన్నాడు. స్వదేశంలో ఇంగ్లండ్‍తో టెస్టు సిరీస్‍కు కూడా దూరమయ్యాడు. ఇప్పుడు శస్త్ర చికిత్స చేయించుకుంటే కనీసం మరో మూడు నెలలైనా ఆటకు దూరం కావాల్సి వస్తుంది.