Orange Cap IPL 2024: ఆరెంజ్ క్యాప్ రేసులో విరాట్ కోహ్లీకి పోటీగా సంజూ శాంసన్.. టాప్ 5 ప్లేయర్స్ వీళ్లే!-orange cap ipl 2024 list sanju samson goes 2nd after kkr won on lsg and compete to virat kohli orange cap top 5 players ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Orange Cap Ipl 2024: ఆరెంజ్ క్యాప్ రేసులో విరాట్ కోహ్లీకి పోటీగా సంజూ శాంసన్.. టాప్ 5 ప్లేయర్స్ వీళ్లే!

Orange Cap IPL 2024: ఆరెంజ్ క్యాప్ రేసులో విరాట్ కోహ్లీకి పోటీగా సంజూ శాంసన్.. టాప్ 5 ప్లేయర్స్ వీళ్లే!

Sanjiv Kumar HT Telugu
Apr 28, 2024 01:07 PM IST

Orange Cap IPL 2024 Sanju Samson: లక్నో సూపర్ జెయింట్స్‌పై రాజస్థాన్ రాయల్స్ గెలుపుతో ఆరెంజ్ క్యాప్ ఐపీఎల్ 2024 జాబితా మారిపోయింది. టాప్‌ 1లో కొనసాగుతోన్న విరాట్ కోహ్లీకి సంజూ శాంసన్ గట్టి పోటినిస్తూ ఆరెంజ్ క్యాప్ రేసులోకి దిగాడు. పూర్తి వివరాలు చూస్తే..

ఆరెంజ్ క్యాప్ రేసులో విరాట్ కోహ్లీకి పోటీగా సంజూ శాంసన్.. టాప్ 5 ప్లేయర్స్ వీళ్లే!
ఆరెంజ్ క్యాప్ రేసులో విరాట్ కోహ్లీకి పోటీగా సంజూ శాంసన్.. టాప్ 5 ప్లేయర్స్ వీళ్లే!

Orange Cap IPL 2024 Virat Kohli: శనివారం (ఏప్రిల్ 27) లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కేవలం 33 బంతుల్లోనే అజేయంగా 71 పరుగులు చేసిన విషయం తెలిసిందే. దాంతో ఆరెంజ్ క్యాప్ ఐపీఎల్ 2024 జాబితాలో విరాట్ కోహ్లీ సరసన నిలిచాడు. అలాగే అతని ప్రత్యర్థి ఆటగాడు కేఎల్ రాహుల్ ఓటమి పాలైనప్పటికీ 78 పరుగులతో తన జట్టు తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

మూడో స్థానంలో కేఎల్ రాహుల్

దాంతో ఆరెంజ్ క్యాప్ ఐపీఎల్ 2024 జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు కేఎల్ రాహుల్. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 9 ఇన్నింగ్స్‌లో 430 పరుగులతో ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కానీ, విరాట్ కోహ్లీకి చేరువగా రెండో స్థానంలోకి ఎగబాకాడు సంజూ శాంసన్. 385 పరుగులతో సంజూ శాంసన్ ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో నిలిచాడు. ఇక కేఎల్ రాహుల్ 378 పరుగులతో టాప్ 3 స్థానంలో ఉన్నాడు. ఈ ముగ్గురు ఇప్పటికీ 9 ఇన్నింగ్స్ ఆడారు.

పంత్-సునీల్ స్థానాలు

శనివారం మధ్యాహ్నం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ (10 ఇన్నింగ్స్) 31 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. రిషబ్ పంత్ 371 పరుగులతో నాలుగో స్థానంలో ఉండగా, కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడు సునీల్ నరైన్ 8 మ్యాచుల్లో 357 పరుగుల చేసి ఐదో స్థానంలో నిలిచాడు.

ఏడో స్థానంలో తిలక్ వర్మ

శనివారం మధ్యాహ్నం జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్‌ను ఓడించిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్ అర్హత అవకాశాలను క్లిష్టతరం చేసుకుంది. అయితే ఎమ్ఐ తరఫున 259 పరుగుల లక్ష్య ఛేదనలో వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన తిలక్ వర్మ ఆరెంజ్ క్యాప్ జాబితాలో ఏడో స్థానానికి ఎగబాగాడు. అతను తొమ్మిది ఇన్నింగ్స్‌లో 336 పరుగులు చేశాడు.

ఆరు పాయింట్ల ఆధిక్యం

ఏప్రిల్ 27న సాయంత్రం జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు లక్నో సూపర్ జెయింట్స్ 197 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే తొమ్మిది మ్యాచ్‌ల్లో ఎనిమిదో విజయాన్ని నమోదు చేయడానికి లక్ష్యాన్ని ఛేదించడంలో కొంచెం కష్టపడింది ఆర్ఆర్. ఐపీఎల్ 2024 పాయింట్స్ టేబుల్‌లో రెండో అగ్ర స్థానంలో ఉన్న కేకేఆర్‌పై ఆరు పాయింట్ల ఆధిక్యాన్ని పెంచుకుంది. దాంతో మొదటి అగ్ర స్థానానికి చేరుకుంది.

అహ్మదాబాద్ వేదికగా

ఇకపోతే ఆదివారం (ఏప్రిల్ 28) అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ మరోసారి తన ఆధిక్యాన్ని పెంచుకునే అవకాశం ఉంది. జీటీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా ఆరెంజ్ క్యాప్ జాబితాలో మళ్లీ టాప్ టెన్‌లో చోటు దక్కించుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటివరకు 9 ఇన్నింగ్స్‌లో అతడు 304 పరుగులు చేశాడు.

ట్రావిస్ వర్సెస్ రుతురాజ్

ఏప్రిల్ 28 సాయంత్రం జరిగే మ్యాచ్‌లో పది పాయింట్లతో మూడో స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఎస్ఆర్‌హెచ్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ 7 ఇన్నింగ్స్ ఆడి 325 పరుగులతో ఆరెంజ్ క్యాప్ బరిలో 10వ స్థానంలో ఉన్నాడు. స్ట్రైక్ రేట్ 212.41గా ఉన్న ట్రావిస్ హెడ్‌ అప్పటికే ఆరెంజ్ క్యాప్ రేసులో ఆరో స్థానంలో ఉన్న సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌పై ఆధిక్యం సాధిస్తాడో చూడాలి. రుతురాజ్ 8 ఇన్నింగ్స్‌కు 349 రన్స్ చేశాడు.

Whats_app_banner