IPL 2024 Winner: ఈసారి ఐపీఎల్ గెలిచేది ఎవరు? సీఎస్కేతో సమానంగా సన్‌రైజర్స్‌పై బెట్టింగ్.. ఇవీ లేటెస్ట్ ఆడ్స్
IPL 2024 Winner: ఐపీఎల్ 2024 గెలిచే జట్టు ఏది? ప్రపంచవ్యాప్తంగా నడిచే బెట్టింగ్ ఆడ్స్ ప్రకారం చూస్తే.. ఈ లిస్టులో రాజస్థాన్ రాయల్స్ టాప్ లో ఉండగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది.
IPL 2024 Winner: ఐపీఎల్ 2024లో అప్పుడే నాలుగు వారాలు గడిచాయి. ఈ మెగా లీగ్ మరో నెల రోజులకుపైనే ఉంది. గురువారానికి (ఏప్రిల్ 18) ఆరు టీమ్స్ తమ సగం మ్యాచ్ లు ఆడేశాయి. మరో నాలుగు టీమ్స్ ఆరేసి మ్యాచ్ లు ఆడాయి. వీటి ప్రకారం బెట్టింగ్ ఆడ్స్ మొత్తం మారిపోయాయి. బుకీల ఫేవరెట్ టీమ్ ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ కావడం గమనార్హం.
ఐపీఎల్ 2024 గెలిచేదెవరు?
ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్ చూస్తే గురువారం (ఏప్రిల్ 18) పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ ముగిసిన తర్వాత టాప్ 4లో రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉన్నాయి. పది జట్లలో లీగ్ స్టేజ్ ముగిసే సమయానికి టాప్ 4లో నిలిచిన టీమ్స్ ప్లేఆఫ్స్ చేరతాయన్న విషయం తెలిసిందే.
నాలుగు వారాల తర్వాత ప్రస్తుత పాయింట్ల టేబుల్ ను బట్టి పందెం రాయుళ్లు ఈసారి ట్రోఫీ గెలిచే అవకాశం ఎక్కువగా రాజస్థాన్ రాయల్స్ కు ఉందని తేల్చేశారు. ఆ జట్టుపై ప్రస్తుతం రూపాయికి రూ.4.2 బెట్టింగ్ నడుస్తోంది. మొత్తం పది జట్లలో ఇదే అతి తక్కువ. దీంతో ఆ టీమే ఫేవరెట్ అని తేల్చేశారు. ఇక రెండోస్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. ఈ జట్టుపై 5.00 ఆడ్స్ నడుస్తున్నాయి.
రేసులో సన్ రైజర్స్
ఈ సీజన్లో బ్యాటుతో చెలరేగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల టేబుల్లోనే కాదు.. బెట్టింగ్ ఆడ్స్ లోనూ దూసుకెళ్తోంది. ప్రస్తుతానికి చెన్నై సూపర్ కింగ్స్ తో సమానంగా సన్ రైజర్స్ పైనా 5.00 ఆడ్స్ నడుస్తున్నాయి. ఇక ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ పై 5.5 ఆడ్స్ ఉండటం విశేషం. ఆడిన ఏడు మ్యాచ్ లలో మూడే గెలిచిన ముంబై ఇండియన్స్ పైనా ఇప్పటికీ చాలా మందికి నమ్మకం ఉన్నట్లుంది.
ఆ టీమ్ పై ఇప్పటికీ 7.5 ఆడ్స్ నడుస్తున్నాయి. ఈ టీమ్ ఐదోస్థానంలో ఉంది. ఇక ఆరు నుంచి పది స్థానాలు చూస్తే లక్నో సూపర్ జెయిట్స్ (21.00), ఢిల్లీ క్యాపిటల్స్ (34.00), గుజరాత్ టైటన్స్ (34.00), పంజాబ్ కింగ్స్ (126.00), ఆర్సీబీ (201.00) ఉన్నాయి. అత్యధికంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకే ఉండటం గమనార్హం. అంటే ఆ జట్టు గెలుస్తుందన్న నమ్మకం ఎవరికీ లేదు.
ప్రస్తుతం పాయింట్ల టేబుల్లోనూ ఆర్సీబీ చివరి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఏడు మ్యాచ్ లలో ఆరు ఓడిన ఆర్సీబీ.. ప్లేఆఫ్స్ చేరడం కూడా దాదాపు అసాధ్యమనే చెప్పొచ్చు. పంజాబ్ కింగ్స్ పై విజయంతో ముంబై ఇండియన్స్ మాత్రం తమ అవకాశాలకు కాస్త మెరుగుపరచుకుంది.
టాప్ లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ తాము ఆడాల్సిన ఏడు మ్యాచ్ లలో రెండు గెలిచినా ప్లేఆఫ్స్ కు వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సన్ రైజర్స్ మరో 8 మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా.. కనీసం నాలుగైనా గెలవాల్సి ఉంది.