MI vs RR: ముంబైకు హ్యాట్రిక్ ఓటమి.. హోం గ్రౌండ్‍లోనూ నిరాశే..బౌల్ట్, చాహల్ విజృంభణ.. రాజస్థాన్‍కు వరుసగా మూడో గెలుపు
IPL 2024 MI vs RR Result: ఐపీఎల్ 2024 సీజన్‍లో ముంబై ఇండియన్స్ జట్టుకు వరుసగా మూడో ఓటమి ఎదురైంది. రాజస్థాన్‍తో నేడు జరిగిన మ్యాచ్‍లోనూ పరాజయం పాలైంది. ఆర్ఆర్ హ్యాట్రిక్ గెలుపుతో పాయింట్ల పట్టికలో టాప్‍కు దూసుకెళ్లింది.
Mumbai Indians vs Rajasthan Royals Result: ఐపీఎల్ 2024 టోర్నీలో ముంబై ఇండియన్స్ (MI) జట్టు పేలవ ప్రదర్శన కొనసాగింది. ఈ సీజన్‍లో వరుసగా మూడో పరాజయాన్ని ఆ జట్టు మూటగట్టుకుంది. ఈ సీజన్‍లో తన హోం గ్రౌండ్‍లో ఆడిన తొలి మ్యాచ్‍లోనూ హార్దిక్ పాండ్యా సేన తీవ్రంగా నిరాశపరిచింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో నేడు (ఏప్రిల్ 1) జరిగిన మ్యాచ్‍లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ (RR) చేతిలో పరాజయం పాలైంది. రాజస్థాన్ ఈ సీజన్‍లో వరుసగా మూడో విజయాన్ని సాధించింది.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, యుజువేంద్ర చాహల్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ తడబడింది. 20 ఓవర్లలో 9 వికెట్లకు కేవలం 125 రన్స్ చేసింది ముంబై. రోహిత్ శర్మ (0) సహా మరో ఇద్దరు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (34), తిలక్ వర్మ (32) మినహా మిగిలిన బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. రాజస్థాన్ స్పిన్నర్ చాహల్ 4 ఓవర్లలో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన మూడు వికెట్లు తీశాడు. పేసర్ ట్రెంట్ బౌల్ట్ 4 ఓవర్లలో 22 రన్స్ ఇచ్చి తొలి మూడు వికెట్లు పడగొట్టి ముంబైని దెబ్బ తీశాడు. నాండ్రే బర్గర్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.
స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఊదేసింది రాజస్థాన్ రాయల్స్. 15.3 ఓవర్లలో 4 వికెట్లకు 127 రన్స్ చేసి గెలిచింది. రాజస్థాన్ యంగ్ స్టార్ రియాన్ పరాగ్ (54) హాఫ్ సెంచరీతో కదం తొక్కగా.. రవిచంద్రన్ అశ్విన్ (16), సంజూ శాంసన్ (12) సహా మిగిలిన బ్యాటర్లు తలా కొన్ని రన్స్ చేశారు. ముంబై బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్ మూడు వికెట్లతో అదరగొట్టాడు. అయితే, మిగిలిన బౌలర్లు రాజస్థాన్‍ను ఇబ్బంది పెట్టలేకపోయారు.
బౌల్ట్, చాహల్ అదుర్స్.. ముంబై ఢమాల్
టాస్ ఓడి ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్‍కు దిగిన ముంబై ఇండియన్స్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ముంబై స్టార్ ఓపెనర్, మాజీ రోహిత్ శర్మ(0)ను తొలి ఓవర్ ఐదో బంతికే డకౌట్ చేశాడు రాజస్థాన్ రాయల్స్ పేసర్ ట్రెంట్ బౌల్ట్. గోల్డెన్ డక్ అయి నిరాశగా వెనుదిరిగాడు హిట్‍మ్యాన్. ఆ తర్వాతి బంతికే నమన్ ధీర్ (0)ను బౌల్ట్ ఎల్‍బీడబ్ల్యూ చేశాడు. ఇక మూడో ఓవర్ మూడో బంతికి ముంబై బ్యాటర్ డేవాల్డ్ బ్రెవిస్(0)ను పెవిలియన్‍కు పంపాడు కివీస్ స్టార్ బౌల్ట్. దీంతో 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ముంబై ఇండియన్స్.
కాసేపు నిలిచిన ఇషాన్ కిషన్ (16) కూడా వెనుదిరిగాడు. ముంబై మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు తిలక్ వర్మ (32), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (34) కాసేపు నిలకడగా ఆడారు. అయితే, పదో ఓవర్లో హార్దిక్‍ను ఔట్ చేసి.. వారి భాగస్వామ్యాన్ని విడదీశాడు రాజస్థాన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్. దీంతో 56 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కాసేపటికే తిలక్ వర్మను కూడా చాహల్ వెనక్కి పంపడంతో ముంబై ఆ తర్వాత కోలుకోలేకపోయింది. పియూష్ చావ్లా (3) విఫలం కాగా.. టిమ్ డేవిడ్ (17) నెమ్మదిగా ఆడాడు. గెరాల్డ్ కొయిట్జీ (4)ని చాహల్ ఔట్ చేశాడు. చివర్లో కూడా ముంబై ఎక్కువ పరుగులు చేయలేకపోయింది. 125 పరుగులతోనే సరిపెట్టుకుంది.
హార్దిక్‍కు మరింత ఇబ్బంది
జట్టుకు ఐదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి ఐపీఎల్ 2024 సీజన్ కోసం హార్దిక్ పాండ్యాకు ఆ బాధ్యతలను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అప్పజెప్పింది. గుజరాత్ టైటాన్స్ నుంచి తీసుకొచ్చి మరీ సారథ్య బాధ్యతలు ఇచ్చింది. ఇప్పటికే రోహిత్‍ను కెప్టెన్సీ నుంచి తప్పించటంతో ముంబై అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తొలి మూడు మ్యాచ్‍ల్లోనూ హార్దిక్‍ను చూసినప్పుడు ప్రేక్షకులు బూ అంటూ అరిచారు. ఈ సీజన్‍లో నేడు తొలిసారి ముంబై హోం గ్రౌండ్ వాంఖడేలో బరిలోకి దిగినా సేమ్ సీన్ రిపీట్ అయింది. అసంతృప్తికి తోడు వరుసగా మూడు పరాజయాలు ఎదురవడం హార్దిక్ పాండ్యా, ముంబై ఇండియన్స్ మేనేజ్‍మెంట్‍కు చాలా ఇబ్బందిగా మారింది.
ఈ సీజన్‍లో తదుపరి ఏప్రిల్ 7న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ముంబై తలపడనుంది.
రాజస్థాన్ టాప్.. ముంబై లాస్ట్
ఐపీఎల్ 2024 సీజన్‍లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‍ల్లోనూ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు పాయింట్ల పట్టికలో ప్రస్తుతం అగ్రస్థానానికి చేరింది. ఆరు పాయింట్లతో టాప్‍కు దూసుకెళ్లింది. ఇక, ఆడిన మూడూ ఓడిన ముంబై ఇండియన్స్ పట్టికలో ఆఖరిదైన పదో స్థానానికి పడిపోయింది.
రాజస్థాన్ రాయల్స్ తన నెక్ట్స్ మ్యాచ్‍ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఏప్రిల్ 6న ఆడనుంది.