Womens T20 World Cup: ఒక్క మ్యాచ్‌తోనే ఎగిరిపోయిన భారత్ సెమీస్ ఆశలు.. ఇక కష్టమే!
India Women Cricket Team Semis Race: టీ20 వరల్డ్‌కప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే పేలవంగా ఓడిపోయిన భారత ఉమెన్స్ టీమ్.. సెమీస్ అవకాశాల్ని సంక్లిష్టంగా మార్చేసుకుంది. ఇక మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచినా.. సెమీస్‌కి చేరడం కష్టంగా కనిపిస్తోంది.
ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌కి ఆదిలోనే చుక్కెదురైంది. న్యూజిలాండ్ ఉమెన్స్ టీమ్‌తో దుబాయ్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పేలవ బౌలింగ్, బ్యాటింగ్‌తో తేలిపోయిన భారత్ ఉమెన్స్ టీమ్ 58 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. టోర్నీలో భారత్ జట్టుకి ఇదే తొలి మ్యాచ్‌కాగా.. ఈ ఒక్క ఓటమితోనే భారత్ సెమీస్ అవకాశాలు కూడా సంక్లిష్టంగా మారిపోయాయి.
టోర్నీలోనే పేలవ నెట్ రన్‌రేట్
గ్రూప్-ఎలో ఉన్న భారత్ జట్టు 58 పరుగుల తేడాతో ఓడిపోవడంతో.. ఐదు టీమ్స్ ఉన్న ఈ గ్రూప్ పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానానికి పరిమితమైంది. అన్నింటికి మించి కాంగారు పెట్టే విషయం నెట్ రన్‌రేట్. పేలవ ఓటమి తర్వాత భారత్ జట్టు -2.900 నెట్ రన్‌రేట్‌తో ఉంది. టోర్నీలో మిగిలిన 9 జట్లలో ఏ టీమ్‌కి ఇంత చెత్తగా నెట్‌రన్‌రేట్ లేకపోవడం గమనార్హం.
టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో భాగంగా భారత్ జట్టు ఇక తర్వాత మూడు మ్యాచ్‌లను వరుసగా పాకిస్థాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లతో ఆడనుంది. భారత్ సెమీస్ ఆశలు నిలవాలంటే ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ భారీ తేడాతో విజయం సాధించాలి. టీమ్ కేవలం విజయం సాధించడంతో పాటు నెట్ రన్‌రేట్‌పై కూడా దృష్టిపెట్టాలి. ఈ మూడింటిలో ఒక్క మ్యాచ్‌లో ఓడినా.. టోర్నీ నుంచి భారత్ జట్టు నిష్క్రమించే అవకాశం ఉంది.
పాక్‌పై ఓకే.. కానీ ఆసీస్‌పై పేలవ రికార్డ్
వాస్తవానికి టీ20 క్రికెట్‌లో పాకిస్థాన్, శ్రీలంకలపై భారత్ ఉమెన్స్ టీమ్‌కి మెరుగైన రికార్డ్ ఉంది. అయితే.. ఆస్ట్రేలియాపై మాత్రం చెప్పుకోదగ్గ రికార్డ్ లేదు. పాకిస్థాన్‌తో ఇప్పటి వరకు 15 టీ20 మ్యాచ్‌లు ఆడిన భారత్ 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. శ్రీలంకతో 25 మ్యాచ్‌లాడి 19 విజయాలు సాధించింది. ఈ నేపథ్యంలో.. సెమీస్ చేరాలంటే తొలుత ఈ రెండు జట్లనీ భారత్ జట్టు ఓడించాల్సి ఉంది.
ఆస్ట్రేలియా విషయానికొస్తే ఈ ఫార్మాట్‌లో కంగారూలపై భారత్ జట్టు రికార్డు చాలా పేలవంగా ఉంది. ఇప్పటి వరకు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య 34 టీ20 మ్యాచ్‌లు జరగగా.. అందులో భారత్ కేవలం 7 మ్యాచ్‌ల్లోనే గెలిచింది. కాంగారూలు 25 మ్యాచ్‌ల్లో విజయం సాధించారు. మరీ ముఖ్యంగా.. టీ20 వరల్డ్‌కప్‌లో 6 మ్యాచ్‌లకిగానూ భారత్ జట్టు ఆస్ట్రేలియాపై గెలిచింది రెండు సార్లు మాత్రమే.
టాప్-2లో నిలిస్తే సెమీస్‌కి
గ్రూప్ దశలో పాయింట్ల పట్టికలో టాప్ -2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలో ఇప్పటికే శ్రీలంకను ఓడించిన పాక్ శుభారంభాన్ని అందుకోగా.. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిచినా పాక్ సెమీస్ చేరుతుంది. న్యూజిలాండ్ కూడా పాకిస్థాన్, శ్రీలంక, ఆస్ట్రేలియాలతో మ్యాచ్‌లు ఆడనుండగా.. మరో రెండింటిలో గెలిస్తే సెమీ రేసులో ఉంటుంది. ఆస్ట్రేలియా ఈరోజు శ్రీలంకతో తన తొలి మ్యాచ్‌ను ఆడబోతోంది.
భారత్ జట్టు మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచినా సెమీస్ చేరడం.. మిగిలిన జట్ల ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది. దానికి కారణం.. దారుణంగా పడిపోయిన నెట్‌రన్‌రేట్. పాయింట్లు సమానమైన దశలో నెట్ రన్‌రేట్ కీలకంగా మారనుంది.