Ind-W vs NZ-W: టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లోనే ఇండియా వుమెన్ టీమ్ ఘోర పరాజయం.. కుప్పకూలిన బ్యాటింగ్ లైనప్
Ind W vs NZ W live: వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లోనే ఇండియన్ టీమ్ దారుణ పరాజయం పాలైంది. బ్యాటింగ్ లైనప్ కుప్పకూలడంతో న్యూజిలాండ్ చేతుల్లో ఓటమి తప్పలేదు.
Ind W vs NZ W live: వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024 తొలి మ్యాచ్ లో భారత మహిళల జట్టు బోల్తా పడింది. న్యూజిలాండ్ వుమెన్స్ టీమ్ తో జరిగిన మ్యాచ్ లో 58 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా టీమ్.. 102 పరుగులకే కుప్పకూలింది. టాప్, మిడిలార్డర్ బ్యాటర్లు చేతులెత్తేయడంతో హర్మన్‌ప్రీత్ సేనకు తొలి మ్యాచ్ లోనే ఓటమి తప్పలేదు.
కుప్పకూలిన బ్యాటింగ్ లైనప్
ఈ మ్యాచ్ లో ఇండియన్ టీమ్ టాస్ ఓడింది. న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 4 వికెట్లకు 160 పరుగులు చేసింది. తర్వాత 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియన్ టీమ్.. ఏ దశలోనూ టార్గెట్ దిశగా వెళ్లలేదు. రెండో ఓవర్ తొలి బంతికి మొదలైన వికెట్ల పతనం కొనసాగుతూనే వెళ్లింది. 11 పరుగులకే తొలి వికెట్ పడగా.. 70 పరుగులు చేసే సరికి సగం వికెట్లు నేలకూలాయి.
ఇండియన్ టీమ్ స్టార్ బ్యాటర్లు స్మృతి మంధానా (12), షెఫాలీ వర్మ (2), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (15), జెమీమా రోడ్రిగ్స్ (13), రిచా ఘోష్ (12), దీప్తి శర్మ (13) వరుసగా పెవిలియన్ చేరారు. న్యూజిలాండ్ బౌలర్లలో రోజ్‌మేరీ మెయిర్ 4, లియా తాహుహు 3, ఈడెన్ కార్సన్ రెండు వికెట్లు తీశారు. ఇండియన్ టీమ్ లో హర్మన్ ప్రీత్ చేసిన 15 పరుగులే టాప్ స్కోర్ కావడం గమనార్హం.
బౌలింగ్‌లోనూ చేతులెత్తేశారు..
ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. టీ20ల్లో న్యూజిలాండ్ పై అంత మంచి రికార్డు లేని ఇండియన్ టీమ్.. ఈ మ్యాచ్ లోనూ అదే కొనసాగించింది. ఆ టీమ్ మంచి ఆరంభాన్ని అందుకుంది. ఓపెనర్లు సుజీ బేట్స్, జార్జియా ప్లిమ్మర్ 7.4 ఓవర్లలో 67 పరుగులు జోడించారు.
అదే స్కోరు దగ్గర ఈ ఇద్దరు బ్యాటర్లు ఔటైనా.. దానిని ఇండియన్ టీమ్ అనుకూలంగా మలచుకోలేకపోయింది. బేట్స్ 27, ప్లిమ్మర్ 34 రన్స్ చేశారు. అయితే కెప్టెన్ సోఫీ డివైన్ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో న్యూజిలాండ్ 160 పరుగులు చేసింది. డివైన్ కేవలం 36 బంతుల్లోనే 7 ఫోర్లతో 57 రన్స్ చేసి అజేయంగా నిలిచింది. ఇండియా బౌలర్లలో రేణుకా సింగ్ 2, అరుంధతి రెడ్డి, ఆశా శోభన చెరొక వికెట్ తీసుకున్నారు.
ఇండియన్ వుమెన్స్ టీమ్ టీ20 వరల్డ్ కప్ 2024లో తన తర్వాతి మ్యాచ్ ను ఆదివారం (అక్టోబర్ 6) పాకిస్థాన్ తో తలపడనుంది. అటు పాకిస్థాన్ వుమెన్ టీమ్ తన తొలి మ్యాచ్ లో శ్రీలంకను 31 పరుగులతో చిత్తు చేసి శుభారంభం చేసింది. ఇండియన్ టీమ్ ఈ ఓటమితో తీవ్ర ఒత్తిడిలో పాకిస్థాన్ తో బరిలోకి దిగనుంది. మరి ఆ మ్యాచ్ లో అయినా బోణీ చేస్తారో లేదో చూడాలి.