INDW vs NZW Controversy: ఔటైన బ్యాటర్‌ను వెనక్కి పిలిచిన ఫీల్డ్ అంపైర్.. వాగ్వాదానికి దిగిన భారత్ క్రికెటర్లు
New Zealand Women vs India Women in Womens T20 World Cup 2024: లేని రెండో పరుగు కోసం ప్రయత్నించిన న్యూజిలాండ్ బ్యాటర్ రనౌట్ అయ్యింది. కానీ.. ఆమె పెవిలియన్‌కి వెళ్తుండగా.. ఫీల్డ్ అంపైర్ వెనక్కి పిలిచాడు. దాంతో భారత క్రికెటర్లు వాగ్వాదానికి దిగడంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది.
దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్-2024లో భారత్ జట్టు తొలి మ్యాచ్‌లోనే వివాదంలో చిక్కుకుంది. టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వివాదాస్పద రనౌట్ దుమారం రేపుతోంది. అంపైర్ నిర్ణయం పట్ల భారత క్రికెటర్లు, స్టాఫ్ నిరసన వ్యక్తం చేయడంతో కాసేపు మ్యాచ్ నిలిచిపోయింది.
అసలు ఏం జరిగిందింటే?
మ్యాచ్‌లో 14వ ఓవర్ బౌలింగ్ చేసిన భారత స్పిన్నర్ దీప్తి శర్మ చివరి బంతిని లెంగ్త్ డెలివరీగా సంధించింది. ఆ బంతిని న్యూజిలాండ్ బ్యాటర్ అమేలియా ఖేర్ లాంగాఫ్ దిశగా హిట్ చేసింది. కానీ.. అక్కడే ఫీల్డర్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఉండటంతో.. బంతి నేరుగా ఆమె చేతుల్లోకి వెళ్లింది. దాంతో అమేలియా సింగిల్‌తో సరిపెట్టేలా కనిపించింది.
కానీ..బంతిని చేతుల్లోకి తీసుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్.. త్రో చేయలేదు. ఓవర్ ముగియడంతో.. అలా చేతుల్లోనే ఉంచుకుని బౌలింగ్ ఎండ్‌కి వచ్చే ప్రయత్నం చేసింది. అదే అదనుగా భావించిన న్యూజిలాండ్ బ్యాటర్లు డబుల్ కోసం పరుగెత్తగా.. వేగంగా బంతిని కీపర్ రిచా ఘోస్‌కి హర్మన్ అందించడంతో అమేలియా రనౌట్ అయ్యింది. కానీ.. అంపైర్ మాత్రం బంతి అప్పటికే డెడ్ అయినట్లు ప్రకటించాడు.
ఔట్.. అయినా మళ్లీ వెనక్కి
వాస్తవానికి న్యూజిలాండ్ డబుల్ కోసం ప్రయత్నించక ముందే ఫీల్డ్ అంపైర్ .. బౌలర్ దీప్తి క్యాప్‌ను ఆమెకి తిరిగి ఇచ్చేశాడు.అప్పటికే ఐదు సెకన్లకి పైగా హర్మన్‌ప్రీత్ చేతుల్లో బంతి ఉండిపోవడంతో బంతిని డెడ్‌గా ప్రకటించారు. కానీ న్యూజిలాండ్ మాత్రం డబుల్ కోసం వెళ్లింది. రనౌట్ తర్వాత తాను ఔట్‌గా భావించిన అమేలియా పెవిలియన్‌కి వెళ్లబోయింది. కానీ.. అంపైర్లు మాత్రం ఆమెని వెనక్కి పిలిచి మళ్లీ ఆడించారు. అయితే.. తర్వాత ఓవర్‌లోనే ఆమె ఔట్ అయ్యింది.
అంపైర్ నిర్ణయం పట్ల మ్యాచ్ తర్వాత భారత స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ మాట్లాడుతూ..‘‘బంతి డెడ్ అయిపోయినట్లు అంపైర్లు ప్రకటించిన నిర్ణయాన్ని భారత ఆటగాళ్లు గౌరవించారు. అయితే ఆ నిర్ణయం కఠినంగా అనిపించింది. అమేలియా తాను ఔట్ అనుకుని వెళ్లిపోతున్న తరుణంలో మళ్లీ ఆమెని వెనక్కి పిలవడం చాలా టఫ్ కాల్’’ అని మండిపడింది. భారత జట్టుకు, మ్యాచ్ అధికారులకు మధ్య కాసేపు తీవ్ర వాగ్వాదం జరిగింది.
నెక్ట్స్ మ్యాచ్ పాకిస్థాన్‌తో
మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఉమెన్స్ టీమ్ 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేయగా.. లక్ష్యఛేదనలో తడబడిన భారత్ జట్టు 19 ఓవర్లలోనే 102 పరుగులకి ఆలౌటైంది. దాంతో మహిళల టీ20 ప్రపంచకప్ లో తాను ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లోనే 58 పరుగుల తేడాతో ఓడిపోయిన భారత్ జట్టు.. సెమీస్ చేరాలంటే.. మెరుగైన రన్‌రేట్‌తో ఇక తర్వాత మ్యాచ్‌లను గెలవాల్సి ఉంటుంది. ఆదివారం పాకిస్థాన్‌తో భారత్ జట్టు నెక్ట్స్ మ్యాచ్‌ను ఆడనుంది.