Mohammed Shami: భారత ఫాస్ట్ బౌలర్ షమీని మళ్లీ టార్గెట్ చేసిన మాజీ భార్య.. అసలు గుట్టు బయటపెట్టేసింది!
Bowler Shami estranged wife Hasin Jahan: మహ్మద్ షమీ ఇటీవల తన కూతూరితో కలిసి షాపింగ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు. కానీ ఆ వీడియో పోస్ట్ వెనుక కూడా షమీ స్వార్థం ఉందని అతని మాజీ భార్య హసీన్ జాహాన్ విరుచుకుపడింది. ఆ స్వార్థం ఎలా అంటే..?
భారత్ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ చాలా కాలం తర్వాత ఇటీవల తన కుమార్తెను కలుసుకున్నాడు. భార్య హసీన్ జహాన్‌తో ఆరేళ్ల క్రితం విడిపోయిన షమీ.. కుమార్తెతో కలిసి షాపింగ్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియా పోస్ట్ చేశాడు. అయితే ఆ షాపింగ్ అంతా షో అంటూ షమీపై మరోసారి హసీన్ జహాన్ విరుచుకుపడింది.
‘‘బెబో.. చాలా రోజుల తర్వాత మళ్లీ నిన్ను చూశాను. ఎంతలా నిన్ను ప్రేమిస్తున్నానో మాటల్లో చెప్పలేను’’ అంటూ కూతురితో కలిసి షాపింగ్ చేస్తున్న వీడియోను షమీ పోస్ట్ చేయగా.. అభిమానుల నుంచి చాలా పాజిటివ్ రియక్షన్స్ వచ్చాయి. కానీ.. మహ్మద్ షమీ ఇష్యూ ఏదైనా వెంటనే రంగంలోకి దిగిపోయే హసీన్ జహాన్.. ఈసారి కూడా అతడ్ని వదల్లేదు.
షమీ బిల్ పే చేయలేదు
షమీ గురించి ఆనంద్‌బజార్.కామ్‌తో హసీన్ జహాన్ మాట్లాడుతూ ‘‘నా కుమార్తె పాస్‌పోర్టు గడువు ముగిసింది. కొత్త పాస్ పోర్టుకు షమీ సంతకం అవసరం. దాంతో ఆమె తన తండ్రిని కలిసేందుకు వెళ్లినా షమీ సంతకం చేయలేదు. కూతురితో కలిసి షాపింగ్ మాల్‌కు వెళ్లాడు. వాస్తవానికి అది షమీ ప్రచారం చేసే కంపెనీ. అందుకే అతడ్ని అక్కడికి తీసుకెళ్లింది. నా కుమార్తె ఆ దుకాణం నుంచి బూట్లు, బట్టలు కొనుగోలు చేసింది. కానీ.. వాటికి షమీ డబ్బులు చెల్లించలేదు. ప్రమోషన్‌లో భాగంగానే ఆ షాపింగ్ చేశారు. కాబట్టే.. షమీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. నిజానికి నా కుమార్తెకు గిటార్, కెమెరా కావాలి. కానీ షమీ ఆ వస్తువులను కొనివ్వలేదు’’ అని చెప్పుకొచ్చింది.
కూతురు గురించి షమీ ఎప్పుడూ అడగడని హసీన్ జహాన్ తెలిపింది. నెల రోజుల క్రితమే పాపని కలిశాడని.. కానీ అప్పుడు ఎలాంటి పోస్టులు పెట్టలేదని.. ఇప్పుడు ప్రమోషన్స్ కోసమే ఆ వీడియోను పోస్ట్ చేశాడని ఆరోపించింది.
నెలకి రూ.1.30 లక్షలు భరణం
2018 నుంచి విడిగా ఉంటున్నా.. మహ్మద్ షమీ, హసీన్ జహాన్ ఇప్పటి వరకు చట్టబద్ధంగా విడాకులు మాత్రం తీసుకోలేదు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. షమీ ప్రతి నెలా హసీన్ జహాన్‌కు భరణం కింద ఒక లక్షా 30 వేల రూపాయలు చెల్లించాలని కోర్టు గతంలో తీర్పునిచ్చింది. ఇందులో 80 వేల రూపాయలు హసీన్ జహాన్ కుమార్తె పెంపకానికికాగా.. మిగిలిన రూ.50 వేలు హసీన్ జహాన్‌కు వ్యక్తిగత భరణం.
గాయం కారణంగా గత ఏడాది నవంబరు నుంచి క్రికెట్‌కి మమ్మద్ షమీ దూరంగా ఉన్నాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉంటూ గాయం నుంచి ఇటీవల కోలుకుంటున్నట్లు కనిపించిన షమీ.. మళ్లీ గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. అతని మోకాలి గాయం తిరగబెట్టినట్లు తెలుస్తోంది. దాంతో మరి కొన్నాళ్ల పాటు ఆటకి షమీ దూరం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.