YS Jagan Passport : మాజీ సీఎం జగన్ కు హైకోర్టులో ఊరట, పాస్ పోర్టు ఐదేళ్ల రెన్యువల్ కు అనుమతి
YS Jagan Passport : పాస్ పోర్టు వ్యవహారంలో మాజీ సీఎం జగన్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఐదేళ్ల రెన్యువల్ కు హైకోర్టు అనుమతినిచ్చింది. ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన ఏడాది రెన్యువల్ ఉత్తర్వులను హైకోర్టు తోసిపుచ్చింది. అయితే పూచీకత్తు సమర్పించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.
YS Jagan Passport : మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు హైకోర్టులో ఊరట లభించింది. జగన్ పాస్ పోర్టు పునరుద్ధరణ విషయంలో కింద కోర్టు ఇచ్చిన ఏడాది రెన్యువల్ ను ఐదేళ్లకు పెంచింది హైకోర్టు. ఐదేళ్లు పాస్ పోర్టు రెన్యువల్ చేసేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది. అయితే విజయవాడ ప్రత్యేక కోర్టు విధించిన పూచీకత్తు షరతులను రద్దు చేసేందుకు నిరాకరించింది. ఆ షరతులను రద్దు చేయాలని జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ హైకోర్టు తీర్పు వెలువరించింది.
వైఎస్ జగన్ పాస్‌పోర్టు విషయంలో ప్రజాప్రతినిధుల కోర్టు రెన్యువల్ ఏడాదికి పరిమితం చేసింది. ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పును వైఎస్ జగన్ హైకోర్టులో సవాల్ చేశారు. సీబీఐ కోర్టు పాస్‌పోర్టు రెన్యువల్‌కు ఐదేళ్లు అనుమతించిందని, కానీ విజయవాడ ప్రత్యేక కోర్టు మాత్రం ఏడాదికి అంగీకారం తెలిపిందని హైకోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగి ఇరువైపులా వాదనలు ముగిశాయి. ఈ నెల 11న ఈ వ్యవహారంపై తీర్పు ఇస్తామని హైకోర్టు ఇటీవల ప్రకటించింది. ఇవాళ తీర్పు వెలువరిస్తూ జగన్ పాస్ పోర్ట్ రెన్యువల్ ఐదేళ్లకు పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది. అయితే దిగువ కోర్టు ఆదేశాలు ప్రకారం రూ.20 వేల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. దీంతో పాస్ పోర్టు వ్యవహారంలో వైఎస్ జగన్ కు కాస్త ఊరట లభించింది. అక్రమాస్తుల కేసుల కారణంగా జగన్ విదేశాలకు వెళ్లాల్సి వస్తే కోర్టు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు వీవీఐపీలకు ఇచ్చే డిప్లొమాట్ పాస్ పోర్టు ఇచ్చేవారు. అయితే ఇటీవల ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడంతో జగన్ డిప్లొమాట్ పాస్ పోర్టు రద్దైంది.
నందిగం సురేష్ ను పరామర్శించిన వైఎస్ జగన్
విజయవాడ వరదల్లో 60 మంది చనిపోయిన అంశాన్ని డైవర్ట్ చేయడానికి టీడీపీ ప్రభుత్వం మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను అరెస్ట్ చేసిందని వైఎస్ జగన్ ఆరోపించారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఎందుకు జరిగిందని జగన్ ప్రశ్నించారు. గుంటూరు జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను వైసీపీ అధ్యక్షుడు జగన్ పరామర్శించారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని బోషడికే అని తిట్టాడని, టీడీపీ కార్యాలయంలో టీడీపీ అధికార ప్రతినిధి సీఎంను బోషడికే అన్నాడని, ఆ మాదిరిగా తిట్టినందుకు, ముఖ‌్యమంత్రిని ప్రేమించేవారికి, వైసీపీ అభిమానులకు కడుపు మండదా? అని జగన్ ప్రశ్నించారు.
ఎవరైనా చెబితేనే అలా చేస్తారా, ఈ అన్యాయాన్ని చూడకూడదనుకునే వాళ్లు టీడీపీ కార్యాలయం దగ్గరకు వెళ్లి ధర్నా చేస్తే, ధర్నాకు వెళ్లిన వారిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు. ఆ సమయంలో కొద్దో గొప్పో రాళ్లు పడి ఉంటాయని జగన్ అన్నారు. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న తాను చంద్రబాబు మీద కక్ష సాధింపుతో వ్యవహరించలేదని, టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో పాల్గొన్న వారందరిని గుర్తించామన్నారు. నిందితుల సెల్‌ఫోన్లు, సీసీ కెమెరాలు చూసి వారందర్నీ 41ఏ నోటీసులు ఇచ్చి, కోర్టులో ప్రవేశపెట్టినట్టు జగన్ చెప్పారు. ఏడేళ్ల లోపు శిక్షపడే కేసులు కావడంతో 41ఏ ఇచ్చి కోర్టులో హాజరు పరిచామని, తాము నిబద్ధతతో అడుగులు వేశామని, ఈ కేసులో నిందితులపై అప్పట్లోనే చర్యలు తీసుకున్నామన్నారు.
సంబంధిత కథనం