Sania Mirza Mohammed Shami: సానియా మీర్జా క్రికెటర్ మహ్మద్ షమీని పెళ్లి చేసుకుంటోందా? ఆమె తండ్రి ఏమన్నాడంటే?
Sania Mirza Mohammed Shami: మాజీ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా క్రికెటర్ మహ్మద్ షమీని పెళ్లి చేసుకోబోతందా? కొన్ని రోజులుగా వస్తున్న ఈ పుకార్లపై తాజాగా ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించారు.
Sania Mirza Mohammed Shami: ఇండియా మాజీ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా మరో పెళ్లి చేసుకుందా? అది కూడా టీమిండియా స్టార్ పేస్ బౌలర్ మహ్మద్ షమీని పెళ్లాడబోతోందా? ఈ మధ్య వస్తున్న ఈ పుకార్లపై సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సానియా రెండో పెళ్లి వార్తల గురించి ప్రశ్నించగా.. ఆయన ఏమన్నారో చూడండి.
సానియా, షమి పెళ్లి?
టెన్నిస్ నుంచి రిటైరైనా కూడా కొన్ని నెలలుగా సానియా మీర్జా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. అయితే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు కావడం గమనార్హం. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకొని 13 ఏళ్ల పాటు కలిసి ఉన్న తర్వాత అతనితో విడిపోయింది. ఇప్పుడామె టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమిని రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
షమి కూడా తన మొదటి భార్య హసీన్ జహాన్ కు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఇద్దరి పెళ్లి వార్తలు సంచలనం రేపాయి. అయితే ఈ పుకార్లపై తాజాగా సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు. "అదంతా చెత్త. ఆమె ఎప్పుడూ కనీసం అతన్ని కలవలేదు" అని ఇమ్రాన్ అనడం గమనార్హం.
ఆ మార్ఫింగ్ ఫొటోతో..
ఈ మధ్య డీప్ ఫేక్ టెక్నాలజీతో ఫేక్ వీడియోలు, ఫొటోలు క్రియేట్ చేయడం కామనైపోయింది. అలాగే సానియా, మహ్మద్ షమీ కూడా పెళ్లి చేసుకోబోతున్నారంటూ వీళ్లు పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫొటోను కూడా క్రియేట్ చేశారు. అది 2010లో ఆమె షోయబ్ మాలిక్ ను పెళ్లాడినప్పటి ఫొటో. కానీ తాజాగా ఆమె తండ్రి ఇచ్చిన క్లారిటీతో అందులో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది.
జూన్ 12న ఈ ఫేక్ ఫొటో ఫేస్ బుక్ లో ప్రత్యక్షమైంది. అందులో షోయబ్ మాలిక్ ముఖం స్థానంలో మహ్మద్ షమి ముఖాన్ని పేస్ట్ చేశారు. ఈ ఏడాది మొదట్లోనే సానియా, షోయబ్ మాలిక్ విడిపోయారు. జనవరిలోనే షోయబ్ మూడో పెళ్లి చేసుకోవడంతో వీళ్లు విడాకుల వార్తలు కన్ఫమ్ అయ్యాయి. దీనిపై సానియా కూడా అధికారికంగా ఓ ప్రకటన జారీ చేసింది.
ఇక మహ్మద్ షమీ విషయానికి వస్తే అతడు కూడా కొన్నేళ్లుగా ఒంటరిగానే ఉంటున్నాడు. మాజీ భార్య హసీన్ జహాన్ అతనితో విడిపోయింది. షమీకి వేరే వాళ్లతో అక్రమ సంబంధాలు ఉన్నాయని, తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని కూడా ఆమె గతంలో ఆరోపించింది. ప్రస్తుతం షమి గాయం కారణంగా టీమిండియా దూరంగా ఉన్నాడు. గతేడాది వరల్డ్ కప్ లో గాయపడిన అతడు.. సర్జరీ చేయించుకున్నాడు.