Sania Mirza: విడాకుల తర్వాత సానియా మీర్జా మళ్లీ ప్రేమ కోసం చూస్తున్నారా? టెన్నిస్ స్టార్ ఏం చెప్పారంటే..
Sania Mirza: విడాకుల తర్వాత మళ్లీ రిలేషన్ విషయంపై టెన్నిస్ స్టార్ సానియా మీర్జా స్పందించారు. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో ఈ విషయం గురించి మాట్లాడారు.
Sania Mirza: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులతో తమ వివాహ బంధానికి ఫుల్‍స్టాప్ చెప్పారు. ఈ ఏడాది జనవరిలో పాక్ నటి సనా జావేద్‍ను మాలిక్ మూడో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత విడాకుల విషయాన్ని సానియా వెల్లడించారు. కొన్ని నెలల క్రితమే అతడికి విడాకులు ఇచ్చేశానని వెల్లడించారు. అయితే, మళ్లీ తన జీవితంలో ప్రేమ గురించి తాజాగా ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో సానియా స్పందించారు.
ముందు వెతకాలి
నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో సానియా మీర్జా పాల్గొన్నారు. బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కూడా ఇదే ఎపిసోడ్‍లో పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్‍కు సంబంధించిన వీడియో క్లిప్‍ను జాన్వీ కపూర్ పాల్గొన్న ఎపిసోడ్‍కు అటాచ్ చేసి వెల్లడించింది నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ.
సానియా మీర్జా జీవితంపై సినిమా చేస్తే ఆమె ప్రేమికుడిగా తాను నటిస్తానని గతంలో బాలీవుడ్ బాద్‍షా షారుఖ్ ఖాన్ చెప్పిన మాటను ఈ షో హోస్ట్ కపిల్ శర్మ గుర్తు చేశారు. ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారేమో అనే సమాచారం రాబట్టేందుకు పరోక్షంగా ఇలాంటి విషయం అడిగారు. దీనికి సానియా మీర్జా స్పందించారు. “ఇప్పుడు నేను ముందుగా లవ్ ఇంట్రెస్ట్‌ను కనుగొనాలి” అని సానియా మీర్జా అన్నారు. అంటే తాను ప్రేమించేలా ఉండే వ్యక్తిని ముందు కనిపెట్టాల్సి ఉందనేలా చెప్పారు. మనసుకు నచ్చే వ్యక్తి ఎదురైతే మళ్లీ ప్రేమిస్తాననేలా హింట్ ఇచ్చారు సానియా.
ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో జాన్వీ కపూర్, రాజ్‍కుమార్ రావ్ పాల్గొన్న ఎపిసోడ్ జూన్ 1వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చింది. సానియా మీర్జా పాల్గొన్న ఎపిసోడ్ ఈ వారంలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టే ఛాన్స్ ఉంది.
సానియా - మాలిక్ వివాహ బంధం ఇలా..
సానియా మీర్జా, షోయబ్ మాలిక్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2010 ఏప్రిల్ 12వ తేదీన వీరి వివాహం హైదరాబాద్‍లో గ్రాండ్‍గా జరిగింది. ఆ తర్వాత పాకిస్థాన్‍లోని సియాల్‍కోట్‍లో వలీమా వేడుక జరిగింది. అప్పటికే షోయబ్ మాలిక్‍కు అది రెండో వివాహం. సానియా, షోయబ్ మాలిక్‍కు 2018లో ఇజాన్ అనే కుమారుడు జన్మించారు. చాలా సంతోషంగా జీవితం గడిపారు.
సానియా మీర్జా, షోయబ్ మాలిక్ మధ్య 2020లో విభేదాలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి మనస్ఫర్థలు వచ్చాయి. అలాగే, సనా జావెద్‍తో మాలిక్ డేటింగ్ చేస్తున్నట్టు పుకార్లు వచ్చాయి. ఓ యాడ్ షూట్‍లో పరిచయం తర్వాత మాలిక్, సనా డేటింగ్‍లో ఉన్నారనే టాక్ వచ్చింది. ఆ తర్వాత మాలిక్, సానియా మధ్య గొడవలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో ఇద్దరూ వేర్వేరుగా ఉన్నారు. దీంతో మాలిక్, సానియా విడాకులు తీసుకోనున్నారని రూమర్లు వచ్చాయి. ఓ టాక్ షోలో కలిసి పాల్గొన్నా వీరి బంధం మళ్లీ మెరుగుపడలేదు. వైవాహిక జీవితం సరిగా లేదని సంకేతాలు ఇస్తూ సోషల్ మీడియాలో కొన్నిసార్లు పోస్టులు పెట్టారు సానియా. మొత్తంగా మాలిక్‍కు విడాకులు ఇచ్చేశానని ఈ ఏడాది జనవరిలో సానియా ప్రకటించారు.
షోయబ్ మాలిక్ తీరు నచ్చక సానియా మీర్జానే అతడికి విడాకులు ఇచ్చారని ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా వెల్లడించారు. సానియానే ఖులా ఇచ్చారని తెలిపారు. ఈ ఏడాది జనవరిలో సనా జావెద్‍ను మాలిక్ పెళ్లాడాడు.